
జీవితాన్ని ఆస్వాదించడమే అసలైన ఆధ్యాత్మికత!
సద్గురు
జగ్గీ వాసుదేవ్
సాక్షి పాఠకులకు నిత్యజీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు, ఆయా సందర్భాలలో కలిగే వివిధ సందేహాలకు సద్గురు జగ్గీవాసుదేవ్ సమాధానాలిస్తారు. మీరు చేయవలసిందల్లా మీ సందేహాలను స్పష్టంగా కవర్ లేదా పోస్ట్‌కార్డ్ మీద రాసి పంపడమే!జీవితాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నవారి నుంచే వైరాగ్యం అనే మాట వచ్చింది. వీరి మూలంగానే ప్రపంచంలో చాలామందికి ఆధ్యాత్మికత పట్ల ఒక విధమైన ఏవగింపు వచ్చేసింది. ఆధ్యాత్మికత అంటే జీవితం పట్ల ఏ ఆసక్తి లేనివారికేనని ప్రస్తుతం చాలామంది అనుకుంటున్నారు. నిజానికి ఆధ్యాత్మికత అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారని! ఆధ్యాత్మికత అంటే మీ ఆసక్తి కేవలం భౌతిక జీవితం గురించే కాదు, జీవితంలోని అన్నికోణాల గురించి అని!
కాని సగటు మనిషి అర్థం చేసుకునేదేమిటంటే మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడంటే, సరిగా తినకూడదు, సరిగా బట్టలు కట్టుకోగూడదు, సరిగా జీవించకూడదు, అణగిపోయి ఉండాలి లేదా కనీసం అలా కనపడాలి అని! మీరు ఆనందంగా, సంతోషంగా ఉంటే, జీవితాన్ని ఆస్వాదిస్తుంటే, మీరు ఆధ్యాత్మికులు కాదని అనుకుంటారు. ఎప్పుడూ చిరునవ్వు ఎరుగని మేకపోతులా, గంభీరంగా ఉంటేనే మీరు ఆధ్యాత్మికులని అనుకుంటారు. ఇదంతా వైరాగ్య సిద్ధాంతాల మూలంగా వచ్చిన ఆలోచనల వల్లే.
మీరు భూమి మీదకి వచ్చింది జీవించటానికి... తప్పించుకోవడానికి కాదు. ఆధ్యాత్మికత అంటే మీరు జీవితంలోని పైపై మెరుగులతో సరిపెట్టుకునే వారు కాదని, జీవిత మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారని అర్థం. వైరాగ్యంతో మీరు జీవితాన్ని తెలుసుకోలేరు. పూర్తి ఆసక్తి చూపితేనే జీవితాన్ని తెలుసుకోగలరు. జీవితం మీద మీ ఆసక్తి ప్రస్తుతం ఉన్నదానికంటే చాలా ఎక్కువైతేనే మీకు ఆధ్యాత్మికత తెలుస్తుంది. అంతేకాని జీవితాన్ని తప్పించుకోజూస్తే మీరు ఆధ్యాత్మికతను తెలుసుకోలేరు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కి ప్రకృతి అన్నా, జీవితం అన్నా చాలా ఆపేక్ష. ఆయన ముసలితనంతో మంచం పట్టినప్పుడు, ఆయన స్నేహితులు ఆయన చుట్టూ చేరి, అవసాన కాలం సమీపించింది కాబట్టి భగవన్నామ స్మరణ చేసి భగవంతుణ్ణి ముక్తి కావాలని ఆయనను కోరుకోమన్నారు. అప్పుడు ఆయన - ‘ముక్తితో నేనేమి చేసుకోను, నాకు మళ్ళీ మళ్ళీ ఇక్కడకు రావాలని ఉంది - మీరే చూడండి... ప్రపంచమెంత అద్భుతమైనదో చూడండి, ప్రకృతి ఎంత దయకలదో చూడండి, నిజంగా భగవంతుడుంటే ఈ ప్రకృతితో ఉండటానికి నన్ను మళ్ళీ మళ్ళీ ఇక్కడకు పంపమని అడుగుతాను’ అన్నాడు. అలా జీవితంతో నిమగ్నమైన వారికే జీవితమంటే ఏమిటో తెలుస్తుంది. మిగతా వారికి కాదు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్‌కూ అలానే జరిగింది. ఆయనకు మృత్యువు సమీపించినప్పుడు, ఆయన ‘నాకు ఈ సైన్సు అంటే ఏమీ తెలియదు. నేను సముద్రపు ఒడ్డున గవ్వలు ఏరుకోవటంలో జీవితాన్ని వ్యర్థం చేశాను. అసలు సముద్రాన్ని అన్వేషించలేదు. నాకు సముద్రాన్ని అన్వేషించే అవకాశం మళ్ళీ వస్తే బాగుంటుంది’ అన్నాడు.
వారు జీవితాన్ని బాగా ఆస్వాదించినవారు. అంతేకాని జీవితంపై నిరాసక్తతతో ఉన్నవారు కాదు. జీవితాన్ని ఆస్వాదించండి, నిజమైన ఆధ్యాత్మికులు అవండి!
... ప్రేమాశీస్సులతో, సద్గురు