‘మనసులో ఉండే గదులను అసూయ, ద్వేషం, ఆగ్రహం.. వంటి ప్రతికూల శక్తులతో నింపుకుంటూ వెళితే మనసు భారంతో కుంగిపోతుంది. ఆ భారం మన అడుగులపై పడుతుంది. ఒక అడుగు కూడా ముందుకు పడదు. దీనివల్ల ఎవరికి నష్టం? అలాకాకుండా మనసును ప్రేమ, శాంతి, సంతోషాలతో నింపండి. మనసు అత్యంత తేలిక అవుతుంది. అడుగులు వడివడిగా ముందుకు పడతాయి..’ ఇలాంటి మాటలతో యువతరాన్ని ఆకట్టుకుంటున్నారు యంగ్ స్పిరిచ్యువల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు. సోషల్ మీడియాలో వీరు ఆధ్యాత్మికతకు సంబంధించికొత్త ద్వారాన్ని తెరిచారు. వీరి ఫాలోవర్స్‌లో అత్యధికులు యువతే కావడం మరో విశేషం..
‘కాపీ కొట్టండి ఫరవాలేదు’ అంటుంది శ్రేయాసి వాలియా. ఇంతకీ ఆమె ఏం కాపీ కొట్టమంటుంది? ‘కాపీ కొట్టండి. దయగల హృదయాన్ని, ఎంత పెద్ద విమర్శను అయినా చిన్న చిరునవ్వుతో స్వీకరించే ధీరత్వాన్ని’ అంటుంది శ్రేయాసి. దిల్లీలో జన్మించిన శ్రేయాసి కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం స్క్రిప్ట్ రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా ‘స్పిరిచ్యువల్ ఇన్‌ఫ్లూయెన్సర్’గా మంచి పేరు సంపాదించుకుంది.
ఏడు సంవత్సరాల వయసు నుంచే ధ్యానం తరగతులకు హాజరయ్యేది శ్రేయాసి. ధ్యానంతో పాటు ఆధ్యాత్మిక విషయాలపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. లాక్‌డౌన్ సమయంలో కోవిడ్ మహమ్మారి భయం అనేది ఒక కోణం అయితే కరిగిపోతున్న ధైర్యం, నిలువెల్లా దైన్యం, రకరకాల మానసిక సమస్యలు మరో కోణం. ఈ సమస్యల పరిష్కారానికి ఉచితంగా మెడిటేషన్ తరగతులు నిర్వహించింది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ‘ధ్యానం ఎందుకు చేయాలంటే.. 500 కారణాలు’ అంటూ రాసిన దానికి మంచి స్పందన వచ్చింది.
‘ధ్యానం వల్ల నా కోపం తగ్గిపోయింది. ఆత్మవిశ్వాసం పెరిగింది’ అంటుంది శ్రేయాసి. ‘ధ్యానం’ తరువాత ఆధ్యాత్మిక విషయాలు కూడా రాయడం మొదలుపెట్టింది. ‘భక్తితత్వాన్ని గంభీరంగా మాత్రమే చెప్పాలని లేదు’ అనే భావనతో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోల ద్వారా కూడా ఎన్నో మంచి విషయాలు చెప్పింది. ‘ఇదంతా ఏమిటి! హాయిగా లక్షలు సంపాదించే ఉద్యోగం చేసుకోకుండా’ అని తనతో చాలామంది అనేవారు. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ సరేసరి. అయితే వారి మాటలు, ట్రోలింగ్ తనపై ప్రభావం చూపించలేక పోయాయి. ‘స్పిరిచ్యువల్ ఇన్‌ఫ్లూయెన్సర్’గా శ్రేయాసికి సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘నేను ఎక్కువ ఇచ్చి తక్కువ తీసుకుంటున్నానా? తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకుంటున్నానా?’ అనేది శ్రేయాసి తనకు తాను వేసుకునే ప్రశ్న. తీరిక సమయంలో పెయింటింగ్స్ వేయడం, పుస్తకాలు చదవడం, బ్యాడ్మింటన్ ఆడడం అంటే తనకు ఇష్టం.
కోల్‌కత్తాకు చెందిన 27 సంవత్సరాల జయ కిశోరిని ‘మీరాబాయి ఆఫ్ జెన్‌జెడ్’ అని పిలుచుకుంటారు అభిమానులు. సోషల్ మీడియా కేంద్రంగా కృష్ణుడి గాథలను 30 సెకండ్ల వీడియోలతో చెప్పడం ద్వారా జయ కిశోరి పాపులర్ అయింది. జయ కిశోరి ఉపన్యాసాలకు ప్రభావితమైన ఎంతోమంది ‘మాలో ఒంటరితనం దూరమైంది. స్నేహభావం పెరిగింది’ అంటుంటారు. జయ కిశోరికి ఫేస్‌బుక్‌లో 1.9 మిలియన్లు, యూట్యూబ్‌లో 2 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. ‘నా తల్లిదండ్రులు ఆర్మీలో పనిచేస్తారు. దీంతో ఎన్నో ప్రాంతాలలో చదువుకోవాల్సి వచ్చింది. అయితే ఏ ప్రాంతంలో చదువుకున్నా జయ దీదీ నాతోపాటు ఉన్నట్లే ఉంటుంది.
నాకు ధైర్యం చెబుతూ దారి చూపుతుంది’ అంటుంది దిల్లీకి చెందిన పదహారు సంవత్సరాల జయ పాండే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన 14 సంవత్సరాల దేవి ఉష్మ కిషోర్జీ ఒకవైపు పాఠశాల విద్యను కొనసాగిస్తూనే సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్, పోస్ట్‌ల ద్వారా ఆధ్యాత్మికం నుంచి సెల్ఫ్–లవ్, సెల్ఫ్–కేర్ వరకు ఎన్నో విషయాలపై తన మనసులోని భావాలను పంచుకుంటుంది. దేవికి ఇన్‌స్టాగ్రామ్‌లో పదివేలమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘నాకు ఉన్న ఫాలోవర్స్ సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఒక వీడియోకు మూడు లక్షలు ఇస్తాం అంటూ ఆఫర్స్ వస్తుంటాయి. అయితే నేను డబ్బు కోసం రాజీ పడదలచుకోలేదు.
వీడియోలను వైరల్ చేయడానికి ఒత్తిడి తెచ్చుకోవడం నా లక్ష్యం కాదు’ అంటుంది ముంబైకి చెందిన ఒక స్పిరిచ్యువల్ ఇన్‌ఫ్లూయెన్సర్. ‘మీ ఉపన్యాసం విన్న తరువాత నేను ఒంటరిని అనే భావన పోయింది అని మెసేజ్‌లు వస్తుంటాయి. ఇలాంటి మెసేజ్‌లు డబ్బుకంటే ఎంతో విలువైనవి అనిపిస్తాయి’ అంటుంది ఆమె. స్థూలంగా చెప్పాలంటే యంగ్ స్పిరిచ్యువల్ ఇన్‌ప్లూయెన్సర్‌లు తమ ఆనందాన్ని డబ్బులలో చూసుకోవడం లేదు. తమ విజయాన్ని కరెన్సీ ధగధగలతో కొలవాలనుకోవడం లేదు. ‘మీ పోస్ట్ చదివిన తరువాత, మీ ఉపన్యాసం విన్న తరువాత నాలో చెప్పలేనంత మార్పు వచ్చింది’ ఇలాంటి చిన్న మెసేజ్ చాలు వారికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వడానికి!.
(చదవండి: పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది )
Comments
Please login to add a commentAdd a comment