నీ చరణమ్ములే నమ్మితినమ్మ! | special chit chat with senior actor kr vijaya | Sakshi
Sakshi News home page

నీ చరణమ్ములే నమ్మితినమ్మ!

Published Wed, Nov 1 2017 12:48 AM | Last Updated on Wed, Nov 1 2017 3:00 AM

special  chit chat with senior actor kr vijaya

చెట్టుకు ఉన్న పూలు అందంగా కనిపిస్తాయి.
పూలగుత్తిలోని పూలు పొందికగా కనిపిస్తాయి.
దండలో ఉన్న పూలు గౌరవంగా కనిపిస్తాయి.
తోరణంలోని పూలు సంస్కృతులుగా కనిపిస్తాయి.
అమ్మవారి చరణాల చెంత
పూలు అశీస్సులుగా కనిపిస్తాయి.
కె.ఆర్‌.విజయ పోషించిన పాత్రలన్నీ..
అమ్మవారి చరణాల దగ్గరి పూలే!


మీ జీవితాన్ని ఆధ్యాత్మికత అనుభవాలతో మేళవించితే ఏమనిపిస్తోంది?
కేఆర్‌విజయ: ఎలాంటి ప్రాథమిక అర్హతలు లేకుండా సినీరంగంలో ప్రవేశించడం దైవ ప్రేరణే అనిపిస్తుంది.
     
కొంచెం వివరంగా చెబుతారా?
నాన్నది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, అమ్మది కేరళ రాష్ట్రంలోని ట్రిచూరు. నేను ట్రిచూరులోనే పుట్టాను. నాన్న ఆంధ్రాలో రెండు, మూడు క్లాసులు చదివించారు, ఆ తరువాత అమ్మ కేరళకు తీసుకెళ్లింది. అక్కడ కొన్ని తరగతులు చదివాను. తరువాత కేరళలోనే ఉండిపోయాను. ప్రా«థమిక విద్యదశలోనే నన్ను డ్రామాల్లో చేర్పించారు. నటిగా స్టేజీపైనే నా కెరీర్‌ స్టార్ట్‌ అయింది. తరువాత తమిళసినిమాల్లోకి ప్రవేశించాను. జన్మతః తెలుగు, మలయాళంకు చెందిన నేను తమిళ సినీ పరిశ్రమలో స్థిరపడటం దైవ సంకల్పమే! ఎందుకంటే నాకు చదువు లేదు,పెద్దగా లోకజ్ఞానం కూడా తెలియనిదాన్ని. కానీ, పెద్దనటిగా పేరు తెచ్చుకున్నాను. సినిమా జీవితం నాకొక స్కూల్‌. చదువులే కున్నా పరిశ్రమలో మంచి పేరు ప్రతిష్ఠ దక్కింది. సినిమాల్లోకి రావడానికి కారణం తల్లిదండ్రులే, అయినా నన్ను సినిమాల్లో చేర్పించాలనే ఆలోచన వారిలో కల్పించినవాడు దేవుడు. అందుకే నా జీవితం దైవ ప్రేరణ అంటాను.
     
మిమ్మల్ని తల్లిదండ్రులే సినిమాలోకి తీసుకొచ్చారంటే మీ కుటుంబంలో సినీ నేపథ్యమేమైనా ఉందా ?
అదే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నాన్న తన స్కూల్‌ లైఫ్‌లో ఉండగా ఎంకే రాధ వారి కంపెనీలో నాటకాలు వేసేవారట, తరువాత ఆర్మీలో చేరారు. రెండవ ప్రపంచ యుద్దంలో మా నాన్నగారు పాల్గొన్నారు. అమ్మఐదుగురు సోదరులు కూడా ఎయిర్‌ఫోర్సు, మిలిటరీలలో ఉన్నతాధికారులు. అమ్మవైపు, నాన్న వైపు ఎవరికీ సినీ నేపథ్యం లేదు. నేను సినిమానటిని కావడం దైవకృప.
     
జీవితంలో ఎదిగిన తరువాత ఇలాంటి వేదాంత ధోరణి అలవడిందా ?

ఆధ్యాత్మిక భావన చిన్ననాటి నుండే అలవడింది. అమ్మ, అమ్మమ్మ, తాతలది ఎంతో సంప్రదాయ కుటుంబం. ఇంట్లో నిత్యదేవతారాధనలు, పూజలు పునస్కారాలు క్రమం తప్పకుండా కొనసాగేవి.
     
మీరు, మీ కుటుంబం నిత్యం ఏ దేవుడిని కొలుస్తారు?
మా వారు వెలాయుధన్‌ నాయర్‌ బిజినెస్‌మేన్‌గా మంచి పేరున్న వ్యక్తి. కూతురు హేమలత. కిందటేడాది నా భర్త అనారోగ్యంతో మరణించారు. మా ఇంట్లో అప్పుడూ ఇప్పుడూ అమ్మవారు, మురుగన్‌ని ఎక్కువగా కొలుస్తాం. అమ్మవారి కొడుకే కదా మురుగన్‌. ఏ బాధ కలిగినా, సంతోషమైనా అమ్మవారితోనే చెప్పుకుంటాను.
     
అమ్మవారు అంటే ఎందుకంత ఇష్టం ?

నా పన్నెండేళ్ల్ల వయస్సులో అమ్మ, అమ్మమ్మలతో కలిసి ప్రతి రోజు అమ్మవారి గుడికి వెళ్లేదాన్ని. అలా అమ్మవారితో ఒక అనుబంధం ఏర్పడింది. అక్కడే శ్రీకృష్ణుడినీ కొలిచేవాళ్లం. సహజంగా అన్ని దేవుళ్లను కొలుస్తాను. ఏదైన సమస్యలు వచ్చినపుడు ‘విఘ్నేశ్వరా... మురుగా..’ అని ప్రార్థించడం అలవాటు.
     
సినిమాల్లో అమ్మవారి పాత్ర అంటే చాలు మీరే గుర్తుకు వస్తారు. అమ్మవారి పాత్రలకు మిమ్మల్నే ఎక్కువగా ఎన్నుకోవడం, ప్రసిద్ది చెందడం ఎలా జరిగింది?
తెలుగులో నా తొలి పౌరాణిక పాత్ర శ్రీకృష్ణపాండవీయం. ఎన్టీఆర్‌ గారు స్వయంగా అడిగారు, ఆ సినిమాలో రుక్మిణి పాత్ర వేశాను. సరిగ్గా అదే సమయంలో తమిళంలో కందన్‌ కరుణై అనే చిత్రంలో మురుగన్‌ భార్య దేవనాయగి పాత్ర వేసాను. ‘అమ్మవారి పాత్రలో మీరు చాలా బావుంటార’ని అందరూ చెబుతుండేవారు. దీంతో నిర్మాత, దర్శకులు సైతం అమ్మవారి పాత్రలకు నన్నే తీసుకునేవారు.
     
అమ్మవారిని కొలిచే పరమభక్తులు మీరు. అమ్మవారి పాత్రలు వేసేటపుడు మీ అనుభూతి ఎలా ఉండేది ?
చాలా సంతోషంగా ఉండేది. అంతటి ఉన్నతమైన పాత్రకు నన్ను ఎన్నుకోవడం అమ్మవారి కృపే. మేకప్‌ వేసుకున్నప్పటి నుండి తిరిగి తీసే వరకు మనస్సు చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ అమ్మే నాలో కొలువై ఉందా అనిపించేది. అదో అనిర్వచనీయమైన అనుభూతి... మాటల్లో చెప్పలేనిది.
     
అమ్మవారి పాత్రలకు ఏదైనా తర్ఫీదు, జాగ్రత్తలు.. వంటివి తీసుకునేవారా ?
అమ్మవారి పాత్రల షూటింగ్‌కు వెళ్లేముందు పూజాగదిలోకి వెళ్లి దణ్ణం పెట్టుకునేదాన్ని. ఆ సమయంలో దేవుని గదిలోని ఫొటోలో అమ్మవారు ఎలా నిలుచుని ఉన్నారు, ఆ ముఖాలలో హావభావాలు ఎలా ఉంటాయో గమనించేదాన్ని. అలాగే, మనసుకు బాధ కలిగించే ఏ ఆలోచనలు పెట్టుకోకుండా, ముఖ్యంగా టెన్షన్‌ లేకుండా వెళతాను. అమ్మవారి పాత్రల్లో ఒదిగిపోవాలంటే ప్రశాంతమైన ముఖవర్చస్సు ముఖ్యం. దాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా జాగ్రత్తపడతాను. ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య ఉంటుంది. కానీ, నటిగా మేకప్‌ వేసుకోగానే ఆ సమస్యలన్నింటినీ మూటగట్టి మూలన పడేస్తాను. మేకప్‌ తీయగానే మళ్లీ ఆ ఆలోచనలన్నీ మైండ్‌లోకి వచ్చేస్తాయి. (నవ్వుతూ)
     
ఇప్పటి వరకు అమ్మవారి పాత్రలు ఎన్నివేశారు ?
అస్సలు గుర్తులేదు. నటిగా భవిష్యత్తు, వర్తమానం గురించే ఆలోచించేదానిని. ఇంకా మంచి పాత్రలు వేయాలి, ప్రేక్షకులను మెప్పించాలనే ఆలోచనే ఇప్పటికీ ఉంటుంది. గతంలో ఏమి జరిగింది, ఏ పాత్రలు వేశాను అని ఆలోచించేందుకు టైమ్‌ దొరికేది కాదు. మంచైనా, చెడైనా ఓకే అని ముందుకు సాగిపోవడమే నా అలవాటు.
     
అమ్మవారి పా్రత్రలతో పేరొందిన తరువాత నటిగా బాహ్యప్రపంచంలో ఏదైనా అనుభవం ఉందా?
ఒక్కటేమిటి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నా పట్ల ప్రేక్షకుల్లో అభిమానంతోపాటూ గౌరవమూ పెరిగింది. జనంలోకి ఎవరైనా వెళితే జరగండి.. జరగండి అని తోసేస్తారు, కానీ నన్ను రండి..రండి అంటూ దారిచ్చి ఆహ్వానించేవారు. సినీ నటి వస్తోందని సహజంగా ఎగబడి దూసుకు వచ్చే పరిస్థితులు కాకుండా ఎక్కడికి వెళ్లినా గౌరవంగా వ్యవహరించేవారు. ఇక ఆలయాల్లోకి వెళితే అమ్మవారే వచ్చిందన్నట్లుగా అక్కడి పెద్దలు దగ్గరుండి దర్శనభాగ్యం కల్పించేవారు. ఇటీవల ధర్మస్తలికి పోయినపుడు ఒక వృద్ధురాలు వచ్చి ‘అమ్మా, మిమ్మల్ని రోజూ గర్భగుడిలో చూస్తుంటాను, ఈరోజు నేరుగా చూస్తున్నాను’ అంటూ అక్కున చేర్చుకున్నారు. ఇలా అనేక గౌరవాలను ఇచ్చాయి అమ్మవారి పాత్రలు. ఇలాంటి గౌరవాలు రావాలని నేనేమీ ప్రయత్నాలు చేయలేదు, అదంతా నా అదృష్టం. అమ్మవారి భక్తురాలిగా అంతకంటే ఏం కావాలి.
     
బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ?
నా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు తిరుమలకు వెళ్లాలని కోరాడు. కారులో తిరుమలకు వెళ్లాం. కొండపై మండుటెండ. నా చీర కొంగు ఆయన తలపైన వేసి ఎండలో, బారులు తీరిన క్యూలో నడిపించాను. క్యూలైన్లలో అవస్థలు పడ్డాం. ఒకనాడు తిరుమలకు వెళ్లినపుడు సకలమర్యాదలు చేసి దర్శనం కల్పించిన టీటీడీ సిబ్బంది నా భర్తతోపాటు వృద్ధాప్య దశలో కొండపైకి వెళితే ఎవ్వరూ నన్ను తెలియనట్లుగా వ్యవహరించడం బాధనిపించింది.
     
అమ్మవారిని అంతగా పూజించే మీకు కష్టాలు వచ్చినపుడు ఎలా అనిపించేది ?
కష్టాలు వచ్చినపుడు ఓవర్‌గా పూజలు, హోమాలు ఏమీ చేసేదాన్ని కాదు. దేవాలయానికి వెళ్లి మంచైనా చెడైనా నీదే భారమని ప్రార్థించేదాన్ని. ఇప్పటికీ అంతే! ‘మంచైనా, చెడైనా నువ్వే చూసుకోవాలి స్వామీ’ అని మనస్సులో తరచూ ప్రార్థిస్తుంటాను.
     
దేవునిపై భక్తి గురించి మీ నిర్వచనం ?
నమ్మకమే కదా జీవితం. దేవుడైనా దెయ్యమైనా నమ్మకం ఉన్నపుడు భక్తి పుడుతుంది, భయం ఏర్పడుతుంది. అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు. అమ్మ పరిచయం చేసినపుడు నాన్నను ఎలా నమ్ముతామో, మన పెద్దలు చూపిన మార్గంలో దేవుడిని కూడా అలా నమ్మాలి. భగవంతుడు ఎక్కడ ఉన్నా వెళతాను. అది నా కెపాసిటీ కాదు, భగవంతుడే నన్ను ప్రేరేపించి తీసుకెళతాడు. ఒక్కోసారి పక్కనే మహత్తు కలిగిన గుడి ఉంటుంది, కానీ వెళ్లలేం, భగవంతుడు పిలవనిదే వెళ్లలేం, తలరాత ఉండాలి.
     
అంటే దేవుడు ఉన్నాడని గట్టిగా నమ్ముతున్నారా ?
దేవుడు లేడనడం పొరపాటు. మనం చూసే దైవం తల్లి, ఈ దైవాన్ని లేదనగలమా. ‘మాతా, పితా గురు దైవం’, వీటిని ఎవ్వరూ కాదనలేరు. దెయ్యానికి ఒక లిమిట్‌ ఉంది అన్ని చోట్ల జొరబడే శక్తి దెయ్యానికి ఉండదు, కానీ దేవుడు సర్వాంతర్యామి, ఎక్కడికైనా రాగలడు. తల్లి లేకుండా సృష్టే లేదు. తల్లంటేనే అమ్మవారు, అమ్మవారిలా పూజనీయురాలు తల్లి. వీరిద్దరినీ వేరు వేరుగా చూడగలమా. దేవుడు ఉన్నాడనే విషయం కూడా అంతే.

నా జీవితమే దైవప్రేరణ
మనకు జరిగే మంచైనా చెడైనా దైవ ప్రేరణే అని తేలిగ్గా తీసుకుంటే మానసిక బాధలు, శారీరక కష్టాలు ఉండవు. నా వరకు చూసుకుంటే జీవితమంతా దైవానుగ్రహమే. జన్మతః తెలుగు, మలయాళం కలబోసిన నేను, ఆ రెండింటిలో ఏ భాషకూ చెందకుండా పోయాను. ఆ రెండు భాషలపైనా పట్టులేకుండా ఉన్న దశలో తమిళ సినీపరిశ్రమలో ప్రవేశించి వెలుగొందడం అంటే దైవ ప్రేరణే... అంటున్నారు ప్రముఖ ïసినీనటి కేఆర్‌ విజయ. వెండితెరపై అమ్మవారి పాత్రలో రాణించిన కేఆర్‌ విజయ నిజజీవితంలో కూడా అమ్మవారి ఆరాధకురాలు. అమ్మవారు అంటే కేఆర్‌ విజయ అనేటంతగా ఆ పాత్రలో ఇమిడిపోయిన ఆమె నేను–నాదైవం కోసం తన భావాలను పంచుకున్నారు.
- కొట్రా నందగోపాల్, సాక్షి, చెన్నై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement