research scholar
-
సిరిసిల్ల నేతన్నలు అదుర్స్: అమెరికా రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు
సాక్షి, సిరిసిల్ల: అగ్గిపెట్టలో పట్టే చీర నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన అక్కడి నేతన్నలపై ప్రశంసలు కురిపించారు అమెరికా చేనేత నైపుణ్య నిపుణురాలు, రీసెర్చ్ స్కాలర్ కైరా జాఫ్. నేతన్నల కళానైపుణ్యాలను చూసి అబ్బురపడిపోయారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాండ్తో ఆసియాలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు, నేతన్నల నైపుణ్యం వంటి రంగాలపై సమగ్రమైన అధ్యయనం చేస్తున్న కైరా.. శనివారం సిరిసిల్లలో పర్యటించారు. సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని అక్కడి నుంచి సిరిసిల్ల చేరుకున్న ఆమె నేతన్నలతో సమావేశమయ్యారు. చేనేత కార్మికుల మగ్గాలు, వారు నేస్తున్న బట్టలు, చేనేత నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కళ నుంచి మరమగ్గాలవైపు సిరిసిల్ల నేతన్నలు మళ్ళిన చారిత్రాత్మక క్రమంపైనా ఆమె వివరాలు తీసుకున్నారు. తన వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్‌ను కలిశారు కైరా జాఫ్. ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులు, ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన చీరను చూసి ఆమె అబ్బురపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రతిభ నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు తాను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల నైపుణ్యంతో పాటు పవర్ లూమ్ క్లస్టర్‌గా మారిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి స్వయం సమృద్ధి వైపు సాగుతుండడంపైన ఆమె ఆసక్తి చూపారు. కైరా బృందం వెంట తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, స్థానిక టెక్స్టైల్ అధికారులతో పాటు చేనేత నేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒకప్పుడు సిరిసిల్ల క్లస్టర్లో నేతన్నల ఇబ్బందులు, పరిశ్రమ సంక్షోభం, దాని నుంచి బయటపడిన విధానం, అందుకు ప్రభుత్వం అందించిన సహకారం, కార్మికులు తమ నైపుణ్యాలను, పవర్లూమ్ యంత్రాలను ఆధునికరించిన విధానం వంటి వివరాలను అందజేశారు. చేనేత కార్మిక క్షేత్రాల్లో పర్యటన.. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడి చేనేత పరిశ్రమపైన ఆమె తన అధ్యయనాన్ని పూర్తిచేసుకుని భారత్‌కు వచ్చారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తన అధ్యయనాన్ని కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల్ సహా ఇతర నేత కార్మిక క్షేత్రాలు ఎన్ఎస్ సిరిసిల్ల సిద్దిపేట జనగామ వంటి ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఇదీ చదవండి: బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు -
స్ఫూర్తి: ముంబై మురికివాడ నుంచి... యూఎస్ యూనివర్శిటీ వరకు!
దురదృష్టం ఒక ద్వారం మూసిపెడితే, కష్టపడేతత్వం పదిద్వారాలను తెరిచి ఉంచుతుంది... అంటారు. ముంబై పేవ్‌మెంట్స్‌పై పూలు అమ్మిన సరిత మాలికి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి చేసే అవకాశం లభించింది. ఈ విజయానికి కారణం ఆమె ఇష్టపడే కష్టపడేతత్వం... సరిత మాలి తల్లిదండ్రులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మూరుమూల ప్రాంతం నుంచి పొట్ట చేతపట్టుకొని మహానగరం ముంబైకి వచ్చారు. అక్కడి ఘడ్కోపర్ మురికివాడలో పుట్టి పెరిగింది సరిత.స్థానిక మున్సిపల్ స్కూల్లో పదవతరగతి చదువుకుంది. ఆ తరువాత కాలేజి చదువు కొనసాగిస్తూనే ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. ట్యూషన్స్ చెప్పగా వచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచుకునేది. పై చదువులకు అవి ఎంతో కొంత సహాయపడ్డాయి. ఒకసారి సెలవులలో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు, బంధువులలో ఒకరు దిల్లీలోని ‘జేఎన్‌యూ’ గురించి గొప్పగా చెప్పారు. ఆ సమయంలోనే అనుకుంది...ఆ యూనివర్శిటీలో ఎలాగైనా చేరాలని! ఆ ఉత్సాహంపై నీళ్లుపోసే మాటలు ఎదురయ్యాయి. ‘జేఎన్‌యూలో అడ్మిషన్ దొరకడం అంతేలికైన విషయం కాదు’ ‘తెలివైన విద్యార్థులు మాత్రమే అక్కడ చదువుకుంటారు’... మొదలైనవి. ఆ తెలివైన విద్యార్థి తాను ఎందుకు కాకూడదు? అని మనసులో గట్టిగా అనుకుంది సరిత. బీఏ మొదటి సంవత్సరం నుంచే ప్రవేశపరీక్షకు ప్రిపేర్ కావడం మొదలుపెట్టింది! ఆమె కష్టం వృథా పోలేదు. ప్రసిద్ధమైన యూనివర్శిటీలో ఎం.ఏ హిందీలో ఆమెకు సీటు వచ్చింది. ‘నేను మరిచిపోలేని రోజు, నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు అది. జేఎన్‌యూలో విస్తృతమైన∙ప్రపంచాన్ని చూశాను. ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను’ అంటుంది సరిత. యూనివర్శిటీలో తనతో ఒక్కొక్కరూ ఒక్కోరకంగా వ్యవహరించేవారు. పేదకుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యంగెస్ట్ రిసెర్చ్ స్కాలర్‌గా తనను స్ఫూర్తిగా తీసుకున్నవారు కొందరైతే,‘సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లకుండా ఈ సాహిత్యం, కవిత్వం వల్ల ఉపయోగం ఏమిటి?’ అని తక్కువ చేసి మాట్లాడిన వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, తన మాటల్లో చెప్పాలంటే ‘జేఎన్‌యూ’ సరితకు మరోప్రపంచాన్ని చూపింది. జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేసిన సరితకు తాజాగా ‘యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి(హిందీ సాహిత్యం) చేసే అవకాశం లభించింది. ‘భక్తి ఉద్యమకాలంలో అట్టడుగు వర్గ మహిళల సాహిత్యం’ అనేది ఆమె పీహెచ్‌డి అంశం. ‘నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. అయితే పేదరికం వల్ల ఎన్నోసార్లు చదువు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినా నేను వెనక్కి తగ్గలేదు. ఏదో రకంగా కష్టపడి చదువుకున్నాను. నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల సహకారం మరవలేనిది. భవిష్యత్‌లో పేదపిల్లలకు నా వంతుగా సహాయపడాలనుకుంటున్నాను’ అంటుంది 28 సంవత్సరాల సరిత మాలి. -
ఫెలోషిప్ నిరాకరించారని దళిత ప్రొఫెసర్‌పై..
లక్నో : ఫెలోషిప్ నిరాకరించినందుకు ఓ దళిత ప్రొఫెసర్‌పై ఆయన ఛాంబర్‌లోనే అగ్రవర్ణ విద్యార్థి దాడి చేసిన ఘటన బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కలకలం రేపింది. కులం పేరుతో ప్రొఫెసర్‌ను దూషిస్తూ, ఆయనను తోసివేయడంతో వర్సిటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధిత ప్రొఫెసర్ ఫిర్యాదుతో నిందితుడు, రీసెర్చ్ స్కాలర్ సంజయ్ ఉపాధ్యాయను లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా వర్సిటీ క్యాంపస్‌లో భారీగా పోలీస్ బలగాలను తరలించారు. ప్రొఫెసర్‌ను రీసెర్చ్ స్కాలర్ కులం పేరుతో దూషించడం పట్ల ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. ఎకనమిక్స్ డిపార్ట్మెంట్లో సంజయ్ ఉపాధ్యాయ ప్రొఫెసర్ ఎల్సీ మాలియ పర్యవేక్షణలో పీహెచ్డీ చేస్తున్నారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఫెలోషిప్ కోసం ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం తిరస్కరణకు గురైందని చెప్పారు. తాను దళితుడిని కాకపోవడం వల్లే తన పేపర్‌ను తిరస్కరించారని ప్రొఫెసర్ మాలియతో సంజయ్ వాగ్వాదానికి దిగారు. ప్రొపెసర్ను కులం పేరుతో దూషిస్తూ కాలర్ పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నించారు. ఇతర ఫ్యాకల్టీ సభ్యులు ఆయనను కాపాడారని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు ఈ ఘటనలో నిందితుడు, బాధితుడు అగ్ర, నిమ్న వర్గాలకు చెందిన వారు కావడంతో ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్ధులు రెండు వర్గాలుగా విడిపోయారు. -
'నన్ను బంధించారు... పోలీసులు విడిపించారు'
న్యూఢిల్లీ: తనకు ఇవ్వాల్సిన స్టైఫండ్ నిలిపి వేశారని ప్రొఫెసర్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ పరిశోధక విద్యార్థిని వాపోయారు. తనను లైబ్రరీలోకి కూడా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలను సెయింట్ స్టీఫెన్ కాలేజీ ప్రిన్సిపాల్ వాల్సన్ తంపూ ఖండించారు. తాను బలవంతంగా లైబ్రరీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా తనను గదిలో పెట్టి అటెండర్లు బంధించారని బాధితురాలు తెలిపింది. పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి తనను విడిపించారని చెప్పింది. కాగా, తాను ప్రిన్సిపాల్ తో మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన నాలుగు ఆడియో టేపులను గతవారం పోలీసులకు ఆమె ఇచ్చింది. ప్రొఫెసర్ సతీశ్ కుమార్ పై పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని తనపై ప్రిన్సిపాల్ ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించింది. ఈ కేసును నీరుగార్చేందుకు వాల్సన్ తంపూ ప్రయత్నించారని పేర్కొంది.