Kalamkari
-
నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు.. వన్నె తగ్గని సౌందర్యం!
నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు ఆధ్యాత్మికతనే కాదు వన్నె తగ్గని సౌందర్యాన్ని చూపుతాడు ఆ కళను ఫ్యాషన్ ప్రియులు తమ డిజైనర్ డ్రెస్సుల మీదకు తీసుకొచ్చి మరింత చూడముచ్చటగా తీర్చుతున్నారు. వాటిని ఎంపిక చేసుకున్నవారు అంతే ఆనందంగా తమ కళాత్మక హృదయాన్ని చాటుతున్నారు. కలంకారీ, మధుబని, పటచిత్ర.. మన దేశంలోని కళారూపాలన్నింటిలోనూ కృష్ణ సౌందర్యం మన కళ్లకు కడుతూనే ఉంటుంది. సంప్రదాయ చీరలు, కుర్తీలు, దుపట్టాల మీద మనకు ఈ సొగసైన కళ కొత్త కాంతులతో రూపుకడుతూనే ఉంది. బాల్యంలో చేసిన అల్లరి పనులు, రాధాకృష్ణుల ప్రణయ ఘట్టం, గోవుల కాపరిగా, యశోదా తనయుడిగా .. దుస్తుల మీద కొలువుదీరిన మురళీధరుడు ఫ్యాషన్ ప్రియులకు ఆరాధ్యుడయ్యాడు. కృష్ణుడి అలంకారంలో భాగమైన నెమలి పింఛం, పిల్లన గ్రోవి, శ్యామవర్ణం.. యువత మదిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే, స్త్రీ పురుషులిద్దరి వెస్ట్రన్ డ్రెస్సుల మీదా ఈ అలంకారాలు పెయింటింగ్‌గా అమరుతున్నాయి. ఎంబ్రాయిడరీగా అలరారుతున్నాయి. ఆభరణాలుగా మెరుస్తున్నాయి. బ్యాగుల అలంకరణలో ముఖ్య భూమిక అవుతున్నాయి. ఫ్యాషన్ వేదికల మీదా వినూత్న హంగులతో నడయాడుతున్నాయి. చదవండి: Saiee Manjrekar: ఈ హీరోయిన్ ధరించిన అనార్కలీ సెట్ ధర 46 వేలు! జరియా లేబుల్ వేల్యూ అదే! -
పెళ్లి వేడుకలు.. ఘనమైన అలంకారాలతో.. ప్రాచీన కళకు కొత్త హంగులు
సంప్రదాయ వేడుకల్లో తెలుగింటి వేషధారణకే అగ్రతాంబూలం ఉంటుంది. అయితే, రాచకళ తీసుకు రావాలన్నా, మరిన్ని హంగులు అమరాలన్నా ప్రాచీనకాలం నాటి డిజైన్స్‌కే పెద్ద పీట వేస్తున్నారు నేటి డిజైనర్లు. ‘నవతరం కోరుకుంటున్న హంగులను కూడా సంప్రదాయ డ్రెస్సులకు తీసుకువస్తున్నాం’ అని చెబుతున్నారు వెడ్డింగ్ డ్రెస్ డిజైనర్ భార్గవి అమిరినేని. కాబోయే పెళ్లికూతుళ్లు కోరుకుంటున్న డ్రెస్ డిజైన్స్ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు.. ‘కలంకారీ ప్రింట్స్, బెనారస్, కంచి పట్టులను సంప్రదాయ డిజైన్స్‌కు వాడుతుంటారు. అయితే, నవతరం మాత్రం వీటితోనే ఆధునికపు హంగులను కోరుకుంటున్నారు. ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్‌తోనే వెస్ట్రన్ కట్ కోరుకుంటున్నారు. నెక్, హ్యాండ్ డిజైన్స్ విషయంలోనే కాదు తమ ‘ప్రేమకథ’కు కొత్త భాష్యం చెప్పేలా ఉండాలని పెళ్లి కూతుళ్లు కోరుకుంటున్నారు. అందుకే వివాహ వేడుకలకు మరింత కొత్త హంగులు వచ్చి చేరుతున్నాయి. రంగుల కాంబినేషన్లు మాత్రం వేడుకను బట్టి మారిపోతున్నాయి. వీటిలో పేస్టల్ నుంచి గాఢమైన రంగుల వరకు ఉంటున్నాయి. డబుల్ లేయర్ దుపట్టాలు, లేయర్డ్ స్కర్ట్, టాప్స్.. కూడా వీటిలో ఎక్కువ ఉంటున్నాయి’ అని వివరించారు. వివాహ వేడుకలకు సిద్ధమవ్వాలంటే ఘనమైన అలంకారాలతో గొప్పగా సింగారించాలనుకుంటారు. అందుకు తగినట్టే నేటి వేడుకలకు తరతరాలుగా వస్తున్న ప్రాచీన కళకు కొత్త హంగులను అద్దుతున్నారు. మహారాణి దర్పం పెళ్లి కూతురు వేషధారణలో కంచి పట్టుచీర తప్పక ఉంటుంది. దీనికి కాంబినేషన్ బ్లౌజ్‌తోపాటు కుడివైపున వేసుకునే దుపట్టా కూడా ఓ హంగుగా అమరింది. దుపట్టాను బ్లౌజ్‌కు సరైన కాంబినేషన్ సెట్ అయ్యేలా మెజెంటా కలర్‌ను ఎంచుకొని, గ్రాండ్‌గా మగ్గం వర్క్‌తో మెరిపించడంతో లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. కాస్ట్యూమ్తోపాటు ఆభరణాలు కూడా పాతకాలం నాటివి ఎంపిక చేయడంతో రాయల్ లుక్ వచ్చేసింది. ఈ గెటప్‌కి వడ్డాణం లేదా వెయిస్ట్ బెల్ట్ యాడ్ చేసుకోవచ్చు. దుపట్టాను అవసరం అనుకుంటే వాడచ్చు. లేదంటే, ఎప్పటికీ గుర్తుగా కూడా ఉంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ బ్రోచ్లు కూడా అలంకరణలో వచ్చి చేరుతున్నాయి. కాన్సెప్ట్ బ్లౌజ్ పెళ్లికూతురు డ్రెస్ అనగానే అందరికన్నా ప్రత్యేకంగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. దీంట్లో భాగంగా పెళ్లికూతురు ధరించే బ్లౌజ్పైన అమ్మాయికి అబ్బాయి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టుగా, అలాగే వారి పేర్లూ వచ్చేలా డిజైన్ చేయడంతో గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఆభరణాల్లో ఉండే పచ్చలు, కెంపులు బ్లౌజ్ డిజైన్లలోనూ వాడుతున్నారు. ఈ బీడ్స్ ధరించే ఆభరణాలకు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నారు. పెద్దంచు మెరుపు సంప్రదాయ లుక్ ఎప్పుడూ అందానికి సిసలైన నిర్వచనంలా ఉంటుంది. పెద్ద అంచు లెహంగా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, దుపట్టా జత చేస్తే చాలు వేడుకలో ఎక్కడ ఉన్నా అందంగా కనిపిస్తారు. అయితే, హాఫ్ శారీ అనగానే గతంలో దుపట్టాలను ఓణీలా చుట్టేసేవారు. ఇప్పుడు ఒకే వైపున వేసుకోవడం కూడా ఫ్యాషన్‌లో ఉంది. డిజైన్స్లోనే కాదు అలంకారంలోనూ వచ్చిన మార్పు మరింత మెరుపునిస్తుంది. కలంకారికి మిర్రర్ ప్రాచీనకాలం నుంచి వచ్చిన మనవైన కళల్లో కలంకారీ ఒకటి. ఇప్పుడు ఈ ఆర్ట్‌పీస్ మరింత ఘనంగా సందడి చేస్తోంది. కలంకారీ క్రాప్టాప్కు మిర్రర్‌తో హ్యాండ్స్, నెక్‌లైన్‌ను డిజైన్ చేయడం ఈ డ్రెస్ స్పెషల్. బ్రొకేడ్ లెహెంగా మీదకు ఈ కలంకారీ బ్లౌజ్ జత చేయడంతో మరింత గొప్పగా అమరింది. – నిర్మలారెడ్డి -
ఢిల్లీ గడ్డపై కలంకారీ మెరుపు
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఢిల్లీలోని రాజపథ్‌లో ప్రదర్శించే కళారూపాల్లో శ్రీకాళహస్తి కలంకారీకి చోటుదక్కింది. శ్రీకాళహస్తి యువ కళాకారుడు సుధీర్ ఏపీ, తెలంగాణ తరఫున ఈ ప్రదర్శనకు ఎంపికయ్యాడు. గత నెలలో చండీగఢ్‌లో జరిగిన అమృతోత్సవాల్లో 9 మంది బృందంతో పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరఫున మరుగునపడ్డ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను కలంకారీని మిళితం చేసి 30 మీటర్ల వస్త్రంపై చిత్రీకరించారు. శ్రీకాళహస్తి ఖ్యాతిని రెపరెపలాడించిన కళాకారుడిని ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అభినందించారు. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. కలంకారీ చిత్రాలు గీస్తున్న కళాకారులు చాలా ఆనందంగా ఉంది చండీగఢ్‌లో జరిగిన అమృతోత్సవాల్లో ఏపీ, తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాను. మరుగునపడ్డ జాతీయ నాయకుల చిత్రాలకు జీవం పోశాం. మా కలంకారీ కళను గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. 2006 మహాత్మాగాంధీ మెమోరియల్ అవార్డు, 2007లో హ్యాండీక్రాఫ్ట్ విభాగంలో రాష్ట్ర అవార్డు వచ్చింది. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయంలో పెయింటింగ్‌లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ పూర్తి చేశాను. జాతీయ అవార్డు తీసుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాను. – సుదీర్, కలంకారీ కళాకారుడు -
ట్రీ ఆఫ్ లైఫ్ కలంకారీకి కేరాఫ్ కొండ్ర బ్రదర్స్
పెడన: కలంకారీ పరిశ్రమకు కేరాఫ్‌గా కృష్ణాజిల్లా పెడన చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఆ పరిశ్రమకు వెన్నెముకగా నిలిచిన కొండ్ర బ్రదర్స్ గంగాధర్, నరసయ్య తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ధిల్‌గల్ నుంచి వలస వచ్చి పెడనలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని కలంకారీకి ఊపిరి పోశారు. జాతీయస్థాయి అవార్డులెన్నో దక్కించుకున్న కొండ్ర బ్రదర్స్ ప్రస్థానం సాగిందిలా.. పెదనాన్న నుంచి వారసత్వంగా.. పెదనాన్న నుంచి కలంకారీ వృత్తిలో మెళకువలు నేర్చుకున్న కొండ్ర బ్రదర్స్ తొలుత హైదరాబాద్‌లో హ్యాండ్ బ్లాకుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అయితే వీరికి పెడన నుంచి ఎక్కువగా గిరాకీ వస్తుండడంతో అక్కడే పరిశ్రమ పెట్టుకుంటే బాగుంటుందని భావించి.. 1986–87లో పెడనలో కళంకారీ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పలు రకాల డిజైన్లతో బ్లాకులు తయారు చేస్తూ దేశ, విదేశీయులను ఆకట్టుకుంటున్నారు. ‘కలంకారి పండు’ డిజైన్‌కు 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా జాతీయస్థాయి అవార్డులను పొందారు. అలాగే మామిడి పండు, ఆర్చి, స్తంభం వంటి బ్లాకులకు కూడా మెరిట్ అవార్డులు దక్కాయి. 1998 నుంచి 2001 వరకు రూపొందించిన డిజైన్ బ్లాకులకు గానూ 2005లో అవార్డులు అందుకున్నారు. వీరి కళను గుర్తించిన కేంద్ర ప్రభుత్వ డెవలప్మెంటు హ్యాండీ క్రాఫ్ట్ కమిషనరేట్ శిక్షణ కేంద్రాన్ని 2002లో ఏర్పాటు చేసింది. ఐదారు సంవత్సరాల పాటు సుమారు వంద మంది వరకు కొండ్ర బ్రదర్స్ శిక్షణ ఇచ్చారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న నరసయ్య డిజైన్ల తయారీ ఇలా.. రాజమండ్రి నుంచి టేకును తీసుకొచ్చి.. ఆ చెక్క ముక్కలపై అన్నదమ్ములైన గంగాధర్, నరసయ్యలు డిజైన్లు గీసి బ్లాకులను తయారు చేస్తారు. ఆ బ్లాకులను వారం రోజులపాటు వంట నూనెలో నానబెట్టి.. కలంకారీ హ్యాండ్ ప్రింటింగ్ వ్యాపారస్తులకు విక్రయిస్తారు. ట్రీ ఆఫ్ లైఫ్‌కు మంచి స్పందన.. పట్టణానికి చెందిన కలంకారీ హ్యాండ్ ప్రింటింగ్ వ్యాపారి పిచ్చుక శ్రీనివాసరావు ట్రీ ఆఫ్ లైఫ్ డిజైన్‌కు సంబంధించిన బ్లాకులు తయారు చేయాల్సిందిగా కోరడంతో 233 బ్లాకులతో డిజైన్ రూపొందించారు. బెంగళూరు తదితర ప్రాంతాలకు సైతం ఈ బ్లాక్‌లను సరఫరా చేసేవారు. నెదర్లాండ్స్, థాయ్‌లాండ్ తదితర దేశాలకు చెందిన విదేశీయులు సైతం ఈ బ్లాక్‌లను కొనుగోలు చేసి తీసుకెళ్లడం విశేషం. వీరు తయారు చేసిన బ్లాకులు ఒక కళ అయితే.. వాటితో ప్రింటింగ్ వేయడం మరో కళ. శిల్పగురుకు ఎంపికైన ఆర్చి తప్పని కరోనా దెబ్బ.. కలంకారీ హ్యాండ్ ప్రింటింగ్‌తో ఎప్పుడూ రద్దీగా ఉండే వీరి వద్ద రోజూ 25 మందికి పైగా పనిచేసేవారు. అయితే అన్ని రంగాలనూ దెబ్బ తీసిన విధంగానే.. కరోనా వీరి వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రస్తుతం ఐదారుగురు మాత్రమే పని చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ‘శిల్పగురు’కు ఎంపిక.. అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి అవార్డు ‘శిల్పగురు’కు కొండ్ర గంగాధర్ ఎంపికయ్యారు. ఆయన రూపొందించిన మామిడి పండు, పండు, ఆర్చి డిజైన్ బ్లాకులను తయారు చేసినందుకు గానూ కేంద్ర ప్రభుత్వం జాతీయ హస్తకళల అభివృద్ధి సంస్థ ఎంపిక చేసింది. త్వరలోనే ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. చాలా సంతోషంగా ఉంది.. చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా జాతీయస్థాయి ‘శిల్పగురు’ వంటి అవార్డులకు ఎంపికవడం చాలా కష్టంగా ఉండేది. అవార్డుకు ఎంపికైన వారిని క్షేత్రస్థాయిలో పలువురు ఉన్నతాధికారులు స్వయంగా వచ్చి పరిశీలించి ఎంపిక చేయడంతో చాలా ఆనందం వేసింది. త్వరలోనే శిల్పగురు అవార్డు అందుకుంటా. –కొండ్ర గంగాధర్, శిల్పగురు అవార్డు గ్రహీత, పెడన చేతి వృత్తులకు కరువైన ఆదరణ ప్రస్తుతం చేతివృత్తులు బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు పెడనలో మంచి గీరాకీ ఉండేది. ప్రస్తుతం తగ్గడంతో విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాం. ట్రీ ఆఫ్ లైఫ్‌ను చూసేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా వచ్చారు. స్థానికంగా కార్మికులు లభించకపోవడంతో ఉత్తరప్రదేశ్ నుంచి 10 మందిని తీసుకొచ్చాం. –కొండ్ర నరసయ్య, జాతీయ అవార్డు గ్రహీత, పెడన -
మనోజ్ఞ అద్దకం
పదేళ్ల కిందటి మాట. మచిలీపట్నం కలంకారీ పరిశ్రమ ఖాయిలా పడడానికి సిద్ధంగా ఉంది. పెడనలో ఉన్న అద్దకం బల్లలు నిరుత్సాహంగా ఊపిరి పీలుస్తున్నాయి. కుటుంబ వారసత్వంగా అంది వచ్చిన కళ అన్నం పెడుతుందనే భరోసా లేకపోవడంతో ఒక్కొక్కరు ఇతర మా ర్గాలకు మళ్లుతున్నారు. ఒక్కో అద్దకం బల్ల అటకెక్కుతోంది. అలాంటి సమయంలో కలంకారీ కళలో జీవితాన్ని వెతుక్కున్నారు మనోజ్ఞ. ఈ కళతో పరిచయం లేని కుటుంబం ఆమెది. అయినా ఈ కళ మీద ఇష్టంతో అద్దకపు ముద్రికను అందుకుంది. మగవాళ్లే ఒక్కొక్కరుగా దూరమవుతున్న ఈ రంగంలో పరిశ్రమ స్థాపించారు మనోజ్ఞ. ఆ రోజు ఆమె వేసిన తొలి అడుగు మరెంతో మందికి ఆసరా అయింది. ఒక విస్తారమైన కలంకారీ సామ్రాజ్యానికి పునాది అయింది. ఆమె జీవితాన్ని మనోజ్ఞంగా డిజైన్ చేసుకుని, చక్కగా అద్దుకుంది. పెళ్లి ఖర్చు నాలుగువేలు ‘‘మా సొంతూరు నూజివీడు. నాన్నగారి అనారోగ్యరీత్యా మా కుటుంబాన్ని మా మేనమామ మచిలీపట్నానికి తీసుకువచ్చారు. 2009 ఫిబ్రవరిలో నవీన్‌తో నా పెళ్లయింది. పెళ్లి ఖర్చు నాలుగు వేల రూపాయలు. నిరాడంబరత కోసం కాదు, అంతకంటే ఖర్చు చేయగలిగిన స్థితి లేకనే. మా వారు అప్పటికే ఫ్యాన్సీ షాప్ పెట్టి నష్టపోయి ఉన్నారు. నేను కూడా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని అర్థమైంది. పెడనలో ముద్రించిన కలంకారీ మెటీరియల్ 2,870 రూపాయలకు కొన్నాను. అదే నా తొలి పెట్టుబడి. ఆ కలంకారీ మెటీరియల్‌తో చీరకు బోర్డరు, బ్లవుజ్, పల్లుకి చిన్న పువ్వులు (ఆ పూలను చీర మీద అప్లిక్ వర్క్‌లాగా కుట్టించుకోవడమే) వచ్చేటట్లు కట్ చేసి అంచులు కుట్టి సెట్ తయారు చేశాను. అది బాగా క్లిక్ అయింది. పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చాయి. రా మెటీరియల్ (కలంకారీ డిజైన్ అద్దిన క్లాత్) అవసరం భారీగా పెరిగింది. మెటీరియల్ సరఫరా సక్రమంగా కొనసాగి ఉంటే నాకు అద్దకం పరిశ్రమ స్థాపించాల్సిన అవసరం ఉండేది కాదు. సహాయ నిరాకరణ! కలంకారీ పరిశ్రమ కుటీర పరిశ్రమగా విస్తరించిన పెడనలో దళారీ వ్యవస్థ పాతుకుపోయి ఉండేది. మాకు మెటీరియల్ సమయానికి అందేది కాదు. కొన్ని సందర్భాలలో నాణ్యత లేని మెటీరియల్ వచ్చేది. అలాంటి మెటీరియల్‌తో వ్యాపారం చేస్తే మా క్రెడిబులిటీ దెబ్బతింటుంది. అందుకోసం సొంతంగా అద్దకం పరిశ్రమ పెట్టాలనే నిర్ణయానికి వచ్చాం. అలా 2014లో దసరా రోజున కలంకారీ ప్రింటింగ్ యూనిట్, 2015 ఫిబ్రవరిలో గార్మెంట్స్ యూనిట్ ప్రారంభించాం. పని నేర్చుకున్నాను! కలంకారీ మీద ఇష్టంతో అద్దకం కూడా నేర్చుకున్నాను. కానీ అద్దకం పనికి విశాలమైన ప్రాంగణం, పెద్ద షెడ్, టేబుళ్లు కావాలి. ఇంత పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్‌కు డబ్బు లేదు. అప్పుడు మా నవీన్ ఫ్రెండ్ కిషోర్‌యాదవ్ గారు అర ఎకరం స్థలాన్ని, అందులో నిర్మించిన విశాలమైన షెడ్‌ని వాడుకోమన్నారు. కలంకారీ కళ మరుగున పడకుండా ప్రపంచ ప్రఖ్యాతి సాధించడానికి తన వంతు సహాయంగా ఆయన ఆ షెడ్‌ను ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మా యూనిట్ రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుకలా మారింది. మా శ్రమకు ఫలితం త్వరగానే దక్కింది. ఆరునెలల్లో బ్రేక్ ఈవెన్ వచ్చింది. మేము ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత యూనిట్‌ని రాయవరానికి మార్చాం. ఏడు వందల ప్యాటర్న్‌లా! చీరల మీద అనేక ప్రయోగాలు చేశాను. ఆర్గండి, క్రేప్, సిల్క్, నెట్... ఇలా రకరకాల క్లాత్‌ల మీద కలంకారీ అద్దకాలు వేశాం. ఆ ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఒక్క చీరల మీద అద్దకంలోనే ఏడు వందల ప్యాటర్న్లు రూపొందించాం. చుడీదార్లలో 55, బెడ్షీట్లలో 180 ప్యాటర్న్‌లను రూపొందించాం. అద్దకంలో ప్రతి దశనూ నోట్స్ రాసుకుంటాను. తర్వాత ఏం చేయాలో ఒక స్టిక్కర్ మీద రాసి అతికిస్తాను. ‘కరక్కాయ ప్రాసెస్ అయింది– బ్యాక్‌గ్రౌండ్ వేయాలి, బ్యాక్ గ్రౌండ్ అద్దకం అయింది– అవుట్‌లైన్ అద్దాలి, అవుట్‌లైన్ అయింది– ఫిల్లింగ్ అద్దాలి’ ఇలాగన్నమాట. దాంతో పనివాళ్లకు రోజూ నేను దగ్గరుండి ఏ క్లాత్ మీద ఏది అద్దాలనే ఆదేశాలు ఇవ్వాల్సిన పని ఉండదు. పేరు వెనుక... మా పరిశ్రమ పేరు మానవ్... అంటే ఏమిటని అందరూ అడుగుతుంటారు. నా పేరు మనోజ్ఞలోని మొదటి రెండు (‘ఎంఎ’) అక్షరాలు, మా వారు నవీన్ పేరులోని మొదటి మూడు (‘ఎన్ఎవి’) అక్షరాల సమాహారమే మానవ్’’ అని వివరించారు మనోజ్ఞ. నిపుణుల తయారీ! ఇరవై మంది మహిళలకు ఆరు నెలల పాటు నెలకు నాలుగు వేల రూపాయలు ఉపకార వేతనం ఇస్తూ పని నేర్పించాం. ఇప్పుడు వారిలో నెలకు తొమ్మిది–పది వేలు సంపాదించుకునే వాళ్లున్నారు. వీళ్లంతా 18 ఏళ్ల నుంచి 30–35 ఏళ్ల లోపు వారే. ఈ ప్రయత్నం ద్వారా మరో 30 సంవత్సరాల వరకు కలంకారీ కళను బతికించడానికి మా వంతు ప్రయత్నం చేశామనే సంతృప్తి కలుగుతోంది. వీరంతా ఈ వృత్తిలో సంతోషంగా ఉంటే మరో తరం కూడా తయారవుతుంది. నేను ఉపాధి పొందడంతోపాటు కొడిగడుతున్న కలంకారీ పరిశ్రమను నిలబెట్టాలనేదే నా ప్రయత్నం. కలంకారీ కాకుండా వేరే చెప్పడానికి నా జీవితంలో ఏమీ లేదు. మా ఇద్దరమ్మాయిలకు కూడా ఈ పని నేర్పిస్తాను. – తుమ్మలపల్లి లక్ష్మీ మనోజ్ఞ ‘మానవ్ కలంకారీ’ వ్యవస్థాపక నిర్వాహకురాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తోంది
బెంగళూరు: సౌందర్య ఉత్పాదనలు జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేస్తారని తెలుసుకున్న సబ్రినా మొదట ఆశ్చర్యపోయింది. అందాన్ని పెంచే సుగుణాలు గల ఔషద మొక్కలు ఉంటే జంతువులకు హాని కలిగించే అవసరం ఏమిటి అని ఆలోచించింది. దీంతో సౌందర్య ఉత్పాదనల్లో మొక్కల గురించి పరిశోధనలు చేసింది. వేగన్ బ్యూటీ ప్రొడక్ట్స్‌ని మార్కెట్లోకి తీసుకువచ్చి, నెలకు 4 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. సబ్రినా సుహైల్ బెంగళూరు వాసి. మేకప్ ఆరిస్ట్‌గా15 ఏళ్ల అనుభవం ఉంది. మేకప్‌లో వాడే ఉత్పాదనల గురించి ఆమెకు ఎప్పుడూ సందేహం రాలేదు. అయితే, ఏడేళ్ల క్రితం ఓ రోజు సౌందర్య ఉత్పాదనల్లో జంతువుల నుంచి తీసిన కొవ్వులను ఉపయోగిస్తారని తెలుసుకుంది. అందాన్ని పెంచే ఎన్నో రకాల ఔషధ మొక్కలు భూమి మీద ఉండగా జంతువులకు హాని కలిగించడం ఎందుకు అనుకుంది. అందుకు తను చదివి కెమిస్ట్రీ, వృక్షశాస్త్ర అధ్యయనాలు ఆమెకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ పరిశోధనల తర్వాత 2014లో కాస్మెటిక్ బ్రాండ్ ‘టిన్జ్’ పేరుతో బెంగుళూరులో బ్యూటీ ప్రొడక్ట్స్ స్టార్టప్ ప్రారంభించింది. మొదటి మూడేళ్లలో క్లీన్ బ్యూటీ ఉత్పత్తులపై మరింతగా పరిశోధనలు చేసి వ్యాపారం కోసం లైసెన్స్ పొందింది. 2018 లో అధికారికంగా నమోదు అయిన తరువాత, కస్టమర్ డిమాండ్ మేరకు సబ్రినా తన సౌందర్య ఉత్పత్తులలో నచ్చిన రంగు, సువాసనను వారే ఎంచుకునే మార్పులు కూడా తెచ్చింది. ఈ ఉత్పత్తులు కస్టమర్ ముందే తయారు చేయడం ప్రారంభించింది. ఒక దానిని అమ్మిన తర్వాత మరొక కస్టమర్ కోసం కొత్త ప్రొడక్ట్‌ని తయారుచేస్తుంది. ఈ విధంగా సబ్రినా స్టార్ట్ అప్ భారీ శ్రేణి వేగన్ ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిలో వేగన్ లిప్ బామ్, లిప్ స్టిక్, ఫౌండేషన్, కన్సీలర్ మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు తన బ్యూటీ ప్రొడక్ట్స్ ద్వారా ప్రతి నెలా 4 లక్షల రూపాయలను సంపాదిస్తుంది. 2018 – 2020 మధ్య ఆమె బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారం 40 శాతం పెరిగింది. పాదాలను లాక్ చేద్దాం ఇంటికి తాళం వేయడం తెలుసు. కానీ, పాదాలకు లాక్ వేయడం ఏంటి అనేదేగా మీ సందేహం. ఇక్కడ ఫుట్ వేర్ చూస్తుంటే ఇట్టే అర్ధమైపోతుంది. చెప్పులకు లాక్ మోడల్స్ జత చేసి, ఇలా విభిన్నంగా డిజైన్ చేశారు. కొంచెం రఫ్ అండ్ టఫ్‌గా ఉన్నామని చెప్పడానికి అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు లాక్ స్టైల్ మోడల్ ఫుట్‌వేర్‌తో మన చూపుల్ని లాక్ చేస్తున్నారు. అమ్మాయిల ఫుట్ వేర్లో ఎక్కువగా హైహీల్స్, శాండల్స్కి లాక్స్ ఉంటే అబ్బాయిల ఫుట్‌వేర్‌లో ప్లిప్ ఫ్లాప్స్, లెదర్ షూస్‌కి ఈ డిజైన్స్ కనువిందు చేస్తున్నాయి. కళల కలంకారీ కలంకారీ ఫ్యాబ్రిక్ గురించి, ఆ ఆర్ట్ వర్క్ గురించి మనకు తెలిసిందే. నెమళ్లు, ఏనుగులు, బుద్ధుని రూపాలు, అమ్మవారి కళారూపం.. అన్నీ పెన్‌కలంకారీ కళ సొంతం. కలంకారీ చీరలైనా, డ్రెస్సులైనా ఒంటికి, కంటికి హాయినిస్తాయి. వాటిని ధరించిన వారిని అందంగా, హుందాగా కనిపించేలా చేస్తాయి. అందుకే, ఆభరణాల నిపుణులు ఈ కలంకారీ ఫ్యాబ్రిక్‌ను కూడా పట్టేసుకున్నారు. ఆభరణాలుగా రూపుకట్టేసుకున్నారు. తక్కువ ధరలో ఎక్కువ ఆకర్షణీయంగా డిజైన్ చేసి, చూపులను కొల్లగొట్టేస్తున్నారు. ఖాదీ, కాటన్ ఫ్యాబ్రిక్ డ్రెస్సులైనా, చీరల మీదకైనా ఎంతో అందంగా ప్రత్యేకంగా కనువిందు చేస్తున్న ఈ కలంకారీ ఆభరణాలు చెవి బుట్టలుగా, జూకాలుగా, మెడలో హారాలుగా, చేతి గాజులుగా అమరాయి. మువ్వలు, గవ్వలు, ఆక్సిడైజ్డ్ సిల్వర్.. ఇలా ఏ లోహంతో కలిసినా కలంకారీ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. వర్క్, డిజైన్ బట్టి ఇవి రూ.300/– నుంచి ధర పలుకుతున్నాయి. -
కలంకారీ... కలర్‌ఫుల్ ఉపాధి
‘కలంకారీ’ పదంలో ‘కలం’ అంటే పెన్ను, ‘కారీ’ అంటే రాసే వ్యక్తి. ఈ కళ అత్యంత సంప్రదాయమైనది, శ్రమతో కూడినది, కళాత్మకమైనది. దీన్ని నమ్ముకున్న వారికి కాసులు కురిపిస్తున్న ఉపాధిమార్గం కూడా! కలంకారీలో శిక్షణ పొంది ఒక యూనిట్ స్థాపించాలంటే... ఎక్విప్మెంట్కు దాదాపుగా రెండున్నర లక్షలు, రా మెటీరియల్‌కు యాభై వేలు కలుపుకొంటే కనీస ఖర్చు మూడు లక్షల రూపాయలవుతుంది. రెండు నెలల్లో ప్రాథమిక శిక్షణ పొందడం సాధ్యమవుతుంది. కలంతో పువ్వులు, తీగల వంటి డిజైన్ గీయాలంటే కనీసం ఆరు నెలలపాటు శిక్షణ, సాధన అవసరం. కలంకారీలో పౌరాణిక గాథల ఘట్టాలు అత్యంత ప్రసిద్ధం. వీటిని చిత్రించాలంటే రెండేళ్లు శిక్షణ తీసుకోవాల్సిందే. ఈ ప్రక్రియ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణాజిల్లా పెడనలో మాత్రమే ఈ కళాకారులున్నారు. పెడన కలంకారీ అద్దకాలకు కేంద్రస్థానమైతే, భగవంతుని బొమ్మలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధం. ఈ వస్త్రాలకు, అలంకరణ పటాలకు ఒకప్పుడు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ కొన్నేళ్లుగా కార్పొరేట్ రంగం ఆసక్తి చూపడంతో అమ్మకాలు బాగా పెరిగాయి. ఇప్పుడు కాళహస్తిలోనే రెండు వేల మంది మహిళలు కలంకారీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు మూడు నుంచి పదివేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. కలంకారీ అద్దకాన్ని ఒకప్పుడు నూలు బట్టల మీద మాత్రమే అద్దేవారు. ఇప్పుడు టస్సర్, క్రేప్, సిల్క్ వస్త్రాల మీద కూడా వేస్తున్నారు. వీటి ధర దాదాపుగా మీటరు ఆరు వందల చొప్పున ఉంటే ఒక చీర 3,600 రూపాయలవుతుంది. కలంకారీ పెయింటింగ్ చేయడానికి వెయ్యి రూపాయలు కలుపుకొంటే చీర మీద పెట్టిన పెట్టుబడి ఏడు వేలవుతుంది. మార్కెట్లో దానికి పనితనంలో నైపుణ్యాన్ని బట్టి పది నుంచి ఇరవై వేల వరకు ధర పలుకుతుంది. ఇక చందేరి, మంగళగిరి దుపట్టాలకు మార్కెట్ ధర 1,200 దాకా ఉంటోంది. కావలసిన వస్తువులు... బల్ల - 1 (ఆరడుగుల పొడవు, రెండడుగుల వెడల్పు), ఉన్ని కంబళి - 1, మెత్తటి వస్త్రం - 1, పెయింటింగ్ కోసం వెదురు బ్రష్షులు - 14, రైటింగ్ బ్రష్షులు - ఐదారు, ప్లాస్టిక్ డ్రమ్ము - 1 (50 లీటర్లది), 20 లీటర్లు పట్టే బకెట్లు - 8; ప్లాస్టిక్ మగ్గులు - 7 లేదా 8, మరిగించే పాత్ర - 1, మిక్సీ - 1 (రంగులు కలుపుకోవడానికి), కంప్యూటర్ - 1 (డిజైన్లు రూపొందించుకోవడానికి), ఫొటోకాపీ మెషీన్ - 1 (డిజైన్లను ప్రింట్లు తీసుకోవడానికి), పెయింటింగ్ మగ్గం - 1, గది - 1 (30 బై 40 అడుగులది), సహాయకులు - ఐదుగురు వీటితోపాటు సమృద్ధిగా నీటితోపాటు నీరు ప్రవహించే సౌకర్యం ఉండాలి. దగ్గరలో ఏరు, నది వంటి జలాశయం లేకపోతే బోరు లేదా బావికి మోటారు, పెద్ద తొట్టి, వాడిన నీరు బయటకు వెళ్లే సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలి. అద్దకం సామగ్రి... బెల్లం, తాటి బెల్లం, ఇనుపముక్కలను 15 రోజుల పాటు ఊరబెడితే రసం వస్తుంది. దానిని కసిమి అంటారు. ఆ కసిమిలో కలాన్ని ముంచి డిజైన్ రాయాలి. కంబళిని రిబ్బన్‌లా చించి వెదురు కర్రకు చుడతారు. అది కలం. చింత బొగ్గులు, గోరింటాకు, కూరగాయల నుంచి తయారు చేసుకున్న రంగులు ప్రధానంగా ఉండాలి (కొంతమంది ఈ డిజైన్లను కృత్రిమ రంగులతో వేసి ఇవ్వమని అడుగుతుంటారు. కూరగాయల రంగుల కంటే కృత్రిమ రంగులు కంటికి ఇంపుగా ఉంటాయి). ఇక ఒక్కో రంగుకు కొన్ని దినుసుల మిశ్రమాలను ఉపయోగించాలి. శిక్షణ ఎక్కడ? రిజిస్ట్రేషన్ ఎలా? 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. - ‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో... రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
కలంకారి ఇంపుగా.. హాయిగా..
సౌకర్యం, సంప్రదాయాలను అనుసరించి కాలానుగుణంగా వేషధారణల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటికే మళ్ళీ చిన్న చిన్న మార్పులను జోడించి, ట్రెండ్ సృష్టించడమే ఫ్యాషన్. వేసవిలో చెమటను పీల్చుకునే దుస్తులను, లేత రంగులను ఇష్టపడతారు. ఆ విధంగా కాటన్ క్లాత్‌కు, ‘కలంకారి’ డిజైన్లకు చరిత్ర ఎంతో ఉంది. ఈ రెండింటినీ జోడించి కొత్త కొత్త దుస్తులను సృష్టిస్తే... ఈ వేసవి కూల్‌గానే కాదు మరింత ‘కళ’ గానూ మారిపోతుంది. నూలు వస్త్రంపై సహజసిద్ధమైన రంగులతో చేసిన డిజైన్లు కాబట్టి ‘కలంకారి’ దుస్తులు కంటికి ఇంపుగా, ఒంటికి మెత్తగా, మనసుకు హాయిగా అనిపిస్తాయి. వీటిలో ‘పెన్ కలంకారి’ డిజైన్లు ఖరీదు ఎక్కువ. ప్రింటెడ్ ‘కలంకారి’ వస్త్రాలు ఖరీదు తక్కువే! కాబట్టి స్తోమతను బట్టి, సౌకర్యాన్ని బట్టి కలంకారికి ఆధునిక సొబగులను ఎన్నైనా అద్దవచ్చు. వేసవి ఫ్యాబ్రిక్స్‌తో... వేసవిలో సింథటిక్ దుస్తులు చర్మంపై ర్యాష్‌కు కారణం అవుతాయి. అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకని వేసవికి అనుకూలమైన నూలు, నార, లినెన్, రేయాన్, కోటా, మల్మల్, శాటిన్, కోరా ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవచ్చు. వీటికి ‘కలంకారి’ ఫ్యాబ్రిక్‌ను జోడిస్తే వినూత్నమైన దుస్తులు వేషధారణలో ‘కళ’తీసుకువస్తాయి. టాప్ టు బాటమ్... తలపైన కలంకారి టోపీ, అదే కాంబినేషన్లో కలంకారి వెయిస్ట్‌కోట్, ముదురు ఆకుపచ్చ లెహంగాకు చేసిన కలంకారి ప్యాచ్ వర్క్, హ్యాండ్ బ్యాగ్.. ఎండలో చార్మ్‌గా వెలిగిపోవడానికి మంచి ఎంపిక కలంకారి. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళ కలంకారి. ఎన్ని రకాలుగా ఉపయోగించినా బోర్ అనిపించని కలంకారి ఫ్యాబ్రిక్‌తో లెక్కలేనన్ని డిజైన్లు తీసుకురావచ్చు. సహజంగా ‘కలంకారి’ని బెడ్‌షీట్స్, దిండుగలేబులుగా వాడుతుంటారు. నేను దీంట్లో ఒక ట్రెండ్‌ను సృష్టించి, స్టైలిష్ ఫ్యాబ్రిక్‌గా పరిచయం చేయాలనుకున్నాను. ఆ విధంగానే జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైన ఆధునిక దుస్తుల్లో కలంకారి డిజైన్లను మెరిపించాను. నేను ఎక్కువగా ఆకుపచ్చ, నీలం, ఎరుపు, నలుపు, ఆలివ్.. రంగుల కలంకారి ఫ్యాబ్రిక్‌ను ఉపయోగిస్తాను. దాంట్లో టాప్స్ పై వేసుకొని జాకెట్స్, బాటమ్‌గా చురీ ప్యాంట్స్, పొడవైన కుర్తాలు.. ఇలా చాలా రకాలుగా సృష్టించాను. చీరలు, లెహంగాలు, కుర్తాలు, జంప్‌సూట్స్...ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు చేశాను. చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ముంబయ్, ఢిల్లీ, ప్యారిస్ నుంచి కూడా నాకు కలంకారి దుస్తులకు ఆర్డర్లు వస్తుంటాయి. ఇది రీ సైకిల్ ఫ్యాబ్రిక్. కాస్త ఎంబ్రాయిడరీ టచ్ ఇచ్చామంటే మరింత వెలిగిపోతుంది. వేసవిలో కలంకారి రంగులు, ప్రింట్లు కూల్ ఫీలింగ్‌ను ఇస్తాయి. - అస్మితా మార్వా, ఫ్యాషన్ డిజైనర్ ఖర్చు తక్కువ... ‘అచ్చు కలంకారి’ ఖరీదు తక్కువే! ప్రింటెడ్ కలంకారి ఫ్యాబ్రిక్ మీటర్ ధర రూ.100 నుంచి లభిస్తుంది. అదే పెన్ కలంకారి అయితే డిజైన్ బట్టి ధర వేల రూపాయల్లో ఉంటుంది. వెరైటీ డిజైన్లు... పొడవు పొట్టి లెహంగాలు, వెయిస్ట్ కోట్లు, జాకెట్లు, కుర్తాలు, హారమ్ ప్యాంట్స్, ఫ్రాక్‌లు.. ‘కలంకారి’తో వీటిలో ఎన్నో ప్రత్యేకతలను చూపించవచ్చు. యాక్ససరీస్.. పర్సులు, బ్యాగులు, పాదరక్షలు, టోపీలు, చెవి ఆభరణాలు.. కలంకారి డిజైన్లతో కనువిందు చేస్తుంటే వాటిని అలంకరణలో భాగం చేసుకొని మరింత ప్రత్యేకంగా వెలిగిపోవచ్చు.