‘కలంకారీ’ పదంలో ‘కలం’ అంటే పెన్ను, ‘కారీ’ అంటే రాసే వ్యక్తి. ఈ కళ అత్యంత సంప్రదాయమైనది, శ్రమతో కూడినది, కళాత్మకమైనది. దీన్ని నమ్ముకున్న వారికి కాసులు కురిపిస్తున్న ఉపాధిమార్గం కూడా! కలంకారీలో శిక్షణ పొంది ఒక యూనిట్ స్థాపించాలంటే... ఎక్విప్‌మెంట్‌కు దాదాపుగా రెండున్నర లక్షలు, రా మెటీరియల్‌కు యాభై వేలు కలుపుకొంటే కనీస ఖర్చు మూడు లక్షల రూపాయలవుతుంది. రెండు నెలల్లో ప్రాథమిక శిక్షణ పొందడం సాధ్యమవుతుంది.
కలంతో పువ్వులు, తీగల వంటి డిజైన్ గీయాలంటే కనీసం ఆరు నెలలపాటు శిక్షణ, సాధన అవసరం. కలంకారీలో పౌరాణిక గాథల ఘట్టాలు అత్యంత ప్రసిద్ధం. వీటిని చిత్రించాలంటే రెండేళ్లు శిక్షణ తీసుకోవాల్సిందే. ఈ ప్రక్రియ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణాజిల్లా పెడనలో మాత్రమే ఈ కళాకారులున్నారు. పెడన కలంకారీ అద్దకాలకు కేంద్రస్థానమైతే, భగవంతుని బొమ్మలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధం. ఈ వస్త్రాలకు, అలంకరణ పటాలకు ఒకప్పుడు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ కొన్నేళ్లుగా కార్పొరేట్ రంగం ఆసక్తి చూపడంతో అమ్మకాలు బాగా పెరిగాయి. ఇప్పుడు కాళహస్తిలోనే రెండు వేల మంది మహిళలు కలంకారీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు మూడు నుంచి పదివేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
కలంకారీ అద్దకాన్ని ఒకప్పుడు నూలు బట్టల మీద మాత్రమే అద్దేవారు. ఇప్పుడు టస్సర్, క్రేప్, సిల్క్ వస్త్రాల మీద కూడా వేస్తున్నారు. వీటి ధర దాదాపుగా మీటరు ఆరు వందల చొప్పున ఉంటే ఒక చీర 3,600 రూపాయలవుతుంది. కలంకారీ పెయింటింగ్ చేయడానికి వెయ్యి రూపాయలు కలుపుకొంటే చీర మీద పెట్టిన పెట్టుబడి ఏడు వేలవుతుంది. మార్కెట్‌లో దానికి పనితనంలో నైపుణ్యాన్ని బట్టి పది నుంచి ఇరవై వేల వరకు ధర పలుకుతుంది. ఇక చందేరి, మంగళగిరి దుపట్టాలకు మార్కెట్ ధర 1,200 దాకా ఉంటోంది.
కావలసిన వస్తువులు...
బల్ల - 1 (ఆరడుగుల పొడవు, రెండడుగుల వెడల్పు), ఉన్ని కంబళి - 1, మెత్తటి వస్త్రం - 1, పెయింటింగ్ కోసం వెదురు బ్రష్షులు - 14, రైటింగ్ బ్రష్షులు - ఐదారు, ప్లాస్టిక్ డ్రమ్ము - 1 (50 లీటర్లది), 20 లీటర్లు పట్టే బకెట్లు - 8; ప్లాస్టిక్ మగ్గులు - 7 లేదా 8, మరిగించే పాత్ర - 1, మిక్సీ - 1 (రంగులు కలుపుకోవడానికి), కంప్యూటర్ - 1 (డిజైన్లు రూపొందించుకోవడానికి), ఫొటోకాపీ మెషీన్ - 1 (డిజైన్లను ప్రింట్లు తీసుకోవడానికి), పెయింటింగ్ మగ్గం - 1, గది - 1 (30 బై 40 అడుగులది),
సహాయకులు - ఐదుగురు
వీటితోపాటు సమృద్ధిగా నీటితోపాటు నీరు ప్రవహించే సౌకర్యం ఉండాలి. దగ్గరలో ఏరు, నది వంటి జలాశయం లేకపోతే బోరు లేదా బావికి మోటారు, పెద్ద తొట్టి, వాడిన నీరు బయటకు వెళ్లే సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలి.
అద్దకం సామగ్రి...
బెల్లం, తాటి బెల్లం, ఇనుపముక్కలను 15 రోజుల పాటు ఊరబెడితే రసం వస్తుంది. దానిని కసిమి అంటారు. ఆ కసిమిలో కలాన్ని ముంచి డిజైన్ రాయాలి. కంబళిని రిబ్బన్‌లా చించి వెదురు కర్రకు చుడతారు. అది కలం. చింత బొగ్గులు, గోరింటాకు, కూరగాయల నుంచి తయారు చేసుకున్న రంగులు ప్రధానంగా ఉండాలి (కొంతమంది ఈ డిజైన్లను కృత్రిమ రంగులతో వేసి ఇవ్వమని అడుగుతుంటారు. కూరగాయల రంగుల కంటే కృత్రిమ రంగులు కంటికి ఇంపుగా ఉంటాయి). ఇక ఒక్కో రంగుకు కొన్ని దినుసుల మిశ్రమాలను ఉపయోగించాలి.
శిక్షణ ఎక్కడ? రిజిస్ట్రేషన్ ఎలా?
1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు.
- ‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో...
రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి
కలంకారీ... కలర్‌ఫుల్ ఉపాధి
Published Sun, Mar 8 2015 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement
Advertisement