సహజంగా సంపాదన
ప్రకృతి తన బాధ్యతగా మనకు ఏడు వర్ణాలను ఇచ్చింది. ఆ పై బాధ్యతను మన సృజనాత్మకతకు వదిలేసింది. ఏ బెరడులో ఏ రంగు ఉంది? ఏ పువ్వును మరిగిస్తే ఏ వర్ణం ఆవిష్కారమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ పరిశ్రమ రూపుదిద్దుకుంది. ఎన్నో ప్రయోగాలు, మరెంతో శ్రమతో అందుబాటులోకి వచ్చిన ఈ సహజరంగుల పరిశ్రమ స్థాపించాలంటే ఏమేం కావాలో... ఆ వివరాలను చూద్దాం!
ముడి సరుకు సేకరణ ఇందులో ప్రధానమైనది.
పసుపురంగు కోసం: కలబంద, సన్‌ఫ్లవర్, బీట్‌రూట్, తంగేడు పువ్వు
ఆరెంజ్ కలర్ కోసం: క్యారట్, జామాయిల్, ఉల్లిపాయ తొక్కలు, దానిమ్మ చెక్క, పసుపుకొమ్ములు
ఆకుపచ్చ రంగు కోసం: పాలకూర ఆకులు, అరటిచెట్టు వేర్లు, చామంతి ఆకులు మొదలైనవి
ఎరుపురంగు కోసం: మందారపూలు (ముదురు ఎరుపువి), తులసి, వెదురుకర్రలు, గులాబి పూలు
ఒక రంగును రకరకాల దినుసులతో సృష్టించవచ్చు. మంజిష్ట, మోదుగపువ్వు, చావల్‌కోది వంటివి సులభంగా దొరుకుతాయి; ‘డ్రై ఫ్లవర్స్’, బెరళ్లు లాంటి వాటిని మార్కెట్లో కొనొచ్చు. వీటి పాళ్లలో కొద్దిపాటి తేడాలు పాటిస్తే కొత్త షేడ్‌ను తీసుకురావచ్చు. ఆ వివరాలన్నీ శిక్షణలో తెలుస్తాయి. సాధన, సృజనతో మరింత నైపుణ్యం పట్టుబడుతుంది.
కావలసిన వస్తువులు: టేబుల్ - 1 (ఆరు మీటర్ల పొడవు, 50 అంగుళాల వెడల్పు ఉండాలి); తట్టు -1 (టేబుల్ మీద వేసే మెత్త వంటిది. 150 మీటర్ల వస్త్రాన్ని దాదాపు 20 పొరలుగా పేరుస్తారు)
తెల్లటి వస్త్రం - పది మీటర్లు
డిజైన్ అచ్చులు - పది రకాలు
చెరువు, నది, వాగు వంటి జలాశయం అందుబాటులో ఉండాలి. నీటి పారుదల ఉంటే పని సులువవుతుంది. ప్రకృతి సహజమైన జలాశయం లేనప్పుడు నీటి తొట్టి, మోటారు, ట్యాంకు వంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది కొంచెం ఖర్చుతో కూడిన విషయం కాబట్టి యూనిట్ ప్రారంభ ఖర్చు లక్ష దాటుతుంది. నీటి వసతి ఏర్పాటు మినహాయిస్తే దాదాపుగా లక్షరూపాయల మూలధనంతో (రెండు నెలల ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు సహా) యూనిట్‌ని ప్రారంభించవచ్చు.
యూనిట్‌ని విజయవంతంగా నడిపించడానికి కొన్ని రహస్యాలుంటాయి. శ్రమ తగ్గుతుంది కదాని రెడీమేడ్ పొడులను వాడకూడదు, శ్రమ ఎక్కువైనా సరే వేర్లను, ఆకులు, పూలను స్వయంగా మర పట్టించుకుంటే అవి ఇచ్చే రంగు విషయంలో భరోసా ఉంటుంది. కొత్త షేడ్స్ రూపకల్పనలో ఆయా ఆకులు, పూల మోతాదుల విషయంలో కచ్చితమైన అంచనా సాధ్యమవుతుంది. అలాగే డిజైన్ అచ్చులను ప్రతి రెండు నెలలకోసారి మారుస్తుండాలి. వినియోగదారులు ఒకసారి వాడిన డిజైన్‌ను మరోసారి కొనడానికి కాదు కదా కనీసం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. శిక్షణ తీసుకోవాలనే ఆసక్తి ఉన్న వారు తమ పేరు నమోదు చేసుకోవడానికి సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ నంబరు 1800 123 2388
‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో...
రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి