Elip
-
కలంకారీ... కలర్‌ఫుల్ ఉపాధి
‘కలంకారీ’ పదంలో ‘కలం’ అంటే పెన్ను, ‘కారీ’ అంటే రాసే వ్యక్తి. ఈ కళ అత్యంత సంప్రదాయమైనది, శ్రమతో కూడినది, కళాత్మకమైనది. దీన్ని నమ్ముకున్న వారికి కాసులు కురిపిస్తున్న ఉపాధిమార్గం కూడా! కలంకారీలో శిక్షణ పొంది ఒక యూనిట్ స్థాపించాలంటే... ఎక్విప్మెంట్కు దాదాపుగా రెండున్నర లక్షలు, రా మెటీరియల్‌కు యాభై వేలు కలుపుకొంటే కనీస ఖర్చు మూడు లక్షల రూపాయలవుతుంది. రెండు నెలల్లో ప్రాథమిక శిక్షణ పొందడం సాధ్యమవుతుంది. కలంతో పువ్వులు, తీగల వంటి డిజైన్ గీయాలంటే కనీసం ఆరు నెలలపాటు శిక్షణ, సాధన అవసరం. కలంకారీలో పౌరాణిక గాథల ఘట్టాలు అత్యంత ప్రసిద్ధం. వీటిని చిత్రించాలంటే రెండేళ్లు శిక్షణ తీసుకోవాల్సిందే. ఈ ప్రక్రియ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణాజిల్లా పెడనలో మాత్రమే ఈ కళాకారులున్నారు. పెడన కలంకారీ అద్దకాలకు కేంద్రస్థానమైతే, భగవంతుని బొమ్మలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధం. ఈ వస్త్రాలకు, అలంకరణ పటాలకు ఒకప్పుడు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ కొన్నేళ్లుగా కార్పొరేట్ రంగం ఆసక్తి చూపడంతో అమ్మకాలు బాగా పెరిగాయి. ఇప్పుడు కాళహస్తిలోనే రెండు వేల మంది మహిళలు కలంకారీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు మూడు నుంచి పదివేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. కలంకారీ అద్దకాన్ని ఒకప్పుడు నూలు బట్టల మీద మాత్రమే అద్దేవారు. ఇప్పుడు టస్సర్, క్రేప్, సిల్క్ వస్త్రాల మీద కూడా వేస్తున్నారు. వీటి ధర దాదాపుగా మీటరు ఆరు వందల చొప్పున ఉంటే ఒక చీర 3,600 రూపాయలవుతుంది. కలంకారీ పెయింటింగ్ చేయడానికి వెయ్యి రూపాయలు కలుపుకొంటే చీర మీద పెట్టిన పెట్టుబడి ఏడు వేలవుతుంది. మార్కెట్లో దానికి పనితనంలో నైపుణ్యాన్ని బట్టి పది నుంచి ఇరవై వేల వరకు ధర పలుకుతుంది. ఇక చందేరి, మంగళగిరి దుపట్టాలకు మార్కెట్ ధర 1,200 దాకా ఉంటోంది. కావలసిన వస్తువులు... బల్ల - 1 (ఆరడుగుల పొడవు, రెండడుగుల వెడల్పు), ఉన్ని కంబళి - 1, మెత్తటి వస్త్రం - 1, పెయింటింగ్ కోసం వెదురు బ్రష్షులు - 14, రైటింగ్ బ్రష్షులు - ఐదారు, ప్లాస్టిక్ డ్రమ్ము - 1 (50 లీటర్లది), 20 లీటర్లు పట్టే బకెట్లు - 8; ప్లాస్టిక్ మగ్గులు - 7 లేదా 8, మరిగించే పాత్ర - 1, మిక్సీ - 1 (రంగులు కలుపుకోవడానికి), కంప్యూటర్ - 1 (డిజైన్లు రూపొందించుకోవడానికి), ఫొటోకాపీ మెషీన్ - 1 (డిజైన్లను ప్రింట్లు తీసుకోవడానికి), పెయింటింగ్ మగ్గం - 1, గది - 1 (30 బై 40 అడుగులది), సహాయకులు - ఐదుగురు వీటితోపాటు సమృద్ధిగా నీటితోపాటు నీరు ప్రవహించే సౌకర్యం ఉండాలి. దగ్గరలో ఏరు, నది వంటి జలాశయం లేకపోతే బోరు లేదా బావికి మోటారు, పెద్ద తొట్టి, వాడిన నీరు బయటకు వెళ్లే సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలి. అద్దకం సామగ్రి... బెల్లం, తాటి బెల్లం, ఇనుపముక్కలను 15 రోజుల పాటు ఊరబెడితే రసం వస్తుంది. దానిని కసిమి అంటారు. ఆ కసిమిలో కలాన్ని ముంచి డిజైన్ రాయాలి. కంబళిని రిబ్బన్‌లా చించి వెదురు కర్రకు చుడతారు. అది కలం. చింత బొగ్గులు, గోరింటాకు, కూరగాయల నుంచి తయారు చేసుకున్న రంగులు ప్రధానంగా ఉండాలి (కొంతమంది ఈ డిజైన్లను కృత్రిమ రంగులతో వేసి ఇవ్వమని అడుగుతుంటారు. కూరగాయల రంగుల కంటే కృత్రిమ రంగులు కంటికి ఇంపుగా ఉంటాయి). ఇక ఒక్కో రంగుకు కొన్ని దినుసుల మిశ్రమాలను ఉపయోగించాలి. శిక్షణ ఎక్కడ? రిజిస్ట్రేషన్ ఎలా? 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. - ‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో... రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
సహజంగా సంపాదన
ప్రకృతి తన బాధ్యతగా మనకు ఏడు వర్ణాలను ఇచ్చింది. ఆ పై బాధ్యతను మన సృజనాత్మకతకు వదిలేసింది. ఏ బెరడులో ఏ రంగు ఉంది? ఏ పువ్వును మరిగిస్తే ఏ వర్ణం ఆవిష్కారమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ పరిశ్రమ రూపుదిద్దుకుంది. ఎన్నో ప్రయోగాలు, మరెంతో శ్రమతో అందుబాటులోకి వచ్చిన ఈ సహజరంగుల పరిశ్రమ స్థాపించాలంటే ఏమేం కావాలో... ఆ వివరాలను చూద్దాం! ముడి సరుకు సేకరణ ఇందులో ప్రధానమైనది. పసుపురంగు కోసం: కలబంద, సన్‌ఫ్లవర్, బీట్రూట్, తంగేడు పువ్వు ఆరెంజ్ కలర్ కోసం: క్యారట్, జామాయిల్, ఉల్లిపాయ తొక్కలు, దానిమ్మ చెక్క, పసుపుకొమ్ములు ఆకుపచ్చ రంగు కోసం: పాలకూర ఆకులు, అరటిచెట్టు వేర్లు, చామంతి ఆకులు మొదలైనవి ఎరుపురంగు కోసం: మందారపూలు (ముదురు ఎరుపువి), తులసి, వెదురుకర్రలు, గులాబి పూలు ఒక రంగును రకరకాల దినుసులతో సృష్టించవచ్చు. మంజిష్ట, మోదుగపువ్వు, చావల్కోది వంటివి సులభంగా దొరుకుతాయి; ‘డ్రై ఫ్లవర్స్’, బెరళ్లు లాంటి వాటిని మార్కెట్లో కొనొచ్చు. వీటి పాళ్లలో కొద్దిపాటి తేడాలు పాటిస్తే కొత్త షేడ్‌ను తీసుకురావచ్చు. ఆ వివరాలన్నీ శిక్షణలో తెలుస్తాయి. సాధన, సృజనతో మరింత నైపుణ్యం పట్టుబడుతుంది. కావలసిన వస్తువులు: టేబుల్ - 1 (ఆరు మీటర్ల పొడవు, 50 అంగుళాల వెడల్పు ఉండాలి); తట్టు -1 (టేబుల్ మీద వేసే మెత్త వంటిది. 150 మీటర్ల వస్త్రాన్ని దాదాపు 20 పొరలుగా పేరుస్తారు) తెల్లటి వస్త్రం - పది మీటర్లు డిజైన్ అచ్చులు - పది రకాలు చెరువు, నది, వాగు వంటి జలాశయం అందుబాటులో ఉండాలి. నీటి పారుదల ఉంటే పని సులువవుతుంది. ప్రకృతి సహజమైన జలాశయం లేనప్పుడు నీటి తొట్టి, మోటారు, ట్యాంకు వంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది కొంచెం ఖర్చుతో కూడిన విషయం కాబట్టి యూనిట్ ప్రారంభ ఖర్చు లక్ష దాటుతుంది. నీటి వసతి ఏర్పాటు మినహాయిస్తే దాదాపుగా లక్షరూపాయల మూలధనంతో (రెండు నెలల ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు సహా) యూనిట్‌ని ప్రారంభించవచ్చు. యూనిట్‌ని విజయవంతంగా నడిపించడానికి కొన్ని రహస్యాలుంటాయి. శ్రమ తగ్గుతుంది కదాని రెడీమేడ్ పొడులను వాడకూడదు, శ్రమ ఎక్కువైనా సరే వేర్లను, ఆకులు, పూలను స్వయంగా మర పట్టించుకుంటే అవి ఇచ్చే రంగు విషయంలో భరోసా ఉంటుంది. కొత్త షేడ్స్ రూపకల్పనలో ఆయా ఆకులు, పూల మోతాదుల విషయంలో కచ్చితమైన అంచనా సాధ్యమవుతుంది. అలాగే డిజైన్ అచ్చులను ప్రతి రెండు నెలలకోసారి మారుస్తుండాలి. వినియోగదారులు ఒకసారి వాడిన డిజైన్‌ను మరోసారి కొనడానికి కాదు కదా కనీసం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. శిక్షణ తీసుకోవాలనే ఆసక్తి ఉన్న వారు తమ పేరు నమోదు చేసుకోవడానికి సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ నంబరు 1800 123 2388 ‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో... రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ పెట్టాలంటే...
మీరే పారిశ్రామికవేత్త! ‘ఇంట్లో అందరూ సంపాదన పరులే. నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి’ అనుకుంటున్నారా? ‘ప్రతి ఒక్కరిలో ఏదో ఓ నైపుణ్యం ఉంటుంది. నాలో నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి’ అనుకుంటున్నారా? ఇవేవీ కాదు, ‘డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే మార్గం కాదు. ఉద్యోగాలిచ్చే పరిశ్రమను స్థాపించడం గొప్ప ఆలోచన’ అనుకుంటున్నారా? ఇందులో మీరు ఎలా ఆలోచించినా, మీలో ఏదో చేయాలనే తపన ఉన్నట్టే! మీ ఆలోచనలకు వాస్తవ రూపమివ్వడానికే ఈ ప్రయత్నం. ఈ వారం జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. ఏమేం కావాలి? ఎంత ఖర్చవుతుంది? (ధరలు రూపాయల్లో) 1 జ్యూట్ సూయింగ్ మెషీన్ - 12,000 నుంచి 20,000. ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే ఇండస్ట్రియల్ మెషీన్ తీసుకోవాలి. అది 20,000 ఉంటుంది. 1 కటింగ్ మెషీన్ - 9,000. చేత్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో కావాలంటే మెషీన్ ఉంటే పని సులువవుతుంది. ఒక మెషీన్‌కు ఒక మనిషి చేత్తో కట్ చేసి అందించగలరు. 1 కటింగ్ టేబుల్ - 12,000. మీది చిన్న గది అయితే టేబుల్ వేయడం కుదరదు. నేల మీద పరచి కత్తిరించుకోవాలి. మరింత ఆకర్షణీయంగా తయారుచేయాలంటే ఎంబ్రాయిడరీ మెషీన్ కూడా తీసుకోవచ్చు. దీని ధర 28,000. 2 ర్యాకులు- ఒక్కొక్కటి 2,500 1 అల్మెరా - 6,000 నుంచి 7,000 ఇతరాలు: 1 కత్తెర - 200 1 పెద్ద స్కేలు - 20 1 టేపు - 5 10 బాబిన్లు, బాబిన్ కేస్లు - 350 మెషీన్ రిపేర్ కోసం స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్ సెట్ - 100 2 ఐలెట్ పంచెస్ (రంధ్రాలు చేయడానికి) - ఒక్కోటి వంద. (‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో...) మ్యాన్‌పవర్: ఇద్దరు కావాలి స్థలం ఎంతుండాలి? ఒక మెషీన్‌తో యూనిట్ పెట్టడానికి కనీసంగా కావల్సిన స్థలం: 12 బై 12 అడుగుల గది. టేబుల్ కూడా అమర్చుకోవాలంటే మరికొంత పెద్దగా ఉండాలి. యాభై వేల రూపాయలు మీ చేతిలో ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు, బ్యాంకు రుణాల సహకారంతో పది లక్షల రూపాయల యూనిట్ పెట్టుకోవచ్చు. శిక్షణ ఎలా? భారత ప్రభుత్వపు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ‘వందేమాతరం’ పేరుతో కేంద్ర పరిశ్రమల శాఖ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ‘ఎలీప్’ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా 18-45 ఏళ్ల మధ్య వయసు మహిళలు (కనీస విద్యార్హత 5వ తరగతి) శిక్షణ పొందవచ్చు. ఎలాంటివి ఉత్పత్తి చేయొచ్చు? కుషన్ కవర్లు, కర్టెన్లు, సెల్‌ఫోన్ కవర్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, లంచ్ బాక్సుల ఆకారాలను బట్టి వాటిని ఇమిడ్చే బ్యాగులను తయారుచేయవచ్చు. సర్టిఫికెట్ల ఫోల్డర్లు, కూరగాయల సంచుల నుంచి పిక్నిక్కు పనికొచ్చే వెరైటీలు, ఇలా దైనందిన జీవనాన్ని గమనిస్తే ఎన్నో ఆలోచనలొస్తాయి. మార్కెట్ ఎలా? జిల్లా, మండల కేంద్రాలలోని డ్వాక్రా బజార్లలో స్టాల్ అద్దెకు తీసుకుని స్వయంగా అమ్ముకోవచ్చు. ప్రభుత్వం అనుమతించిన మార్కెట్ ఏజెన్సీలతో అంగీకారం కుదుర్చుకోవచ్చు. గుళ్ల దగ్గర, కాలనీలోని దుకాణదారులకు ప్రయోగాత్మకంగా కొన్ని పీసులను ప్రదర్శించమని అడగవచ్చు. ఇంకా, ఎలీప్ ‘విపణి’ కార్యక్రమం ద్వారా అమ్మకందార్లను, కొనుగోలుదార్లను అనుసంధానిస్తోంది. శిక్షణ ఎక్కడ? రిజిస్ట్రేషన్ ఏలా? 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. యాభై వేల రూపాయలు చేతిలో ఉంటే పదిలక్షల యూనిట్ ప్రారంభించే అవకాశాలు నేడు మహిళలకు అందుబాటులో ఉన్నాయి. ఎలీప్ ద్వారా శిక్షణ, పరిశ్రమ పెట్టడానికి అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తున్నాం. ఆన్లైన్ మార్కెట్‌కు కూడా తెర తీశాం. జ్యూట్ (జనపనార) పర్యావరణ హితమైనది. దాని వాడకం పెరిగితే పరోక్షంగా రైతులకు ఉపాధి పెరుగుతుంది. - రమాదేవి ఎలీప్(అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) అధ్యక్షురాలు రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి