మనోజ్ఞ అద్దకం | thummalapally lakshmi manogna about manav kalabnkari founder | Sakshi
Sakshi News home page

మనోజ్ఞ అద్దకం

Published Sat, Aug 7 2021 1:32 AM | Last Updated on Sat, Aug 7 2021 1:56 AM

thummalapally lakshmi manogna about manav kalabnkari founder  - Sakshi

పదేళ్ల కిందటి మాట. మచిలీపట్నం కలంకారీ పరిశ్రమ ఖాయిలా పడడానికి సిద్ధంగా ఉంది. పెడనలో ఉన్న అద్దకం బల్లలు నిరుత్సాహంగా ఊపిరి పీలుస్తున్నాయి. కుటుంబ వారసత్వంగా అంది వచ్చిన కళ అన్నం పెడుతుందనే భరోసా లేకపోవడంతో ఒక్కొక్కరు ఇతర మా ర్గాలకు మళ్లుతున్నారు. ఒక్కో అద్దకం బల్ల అటకెక్కుతోంది. అలాంటి సమయంలో కలంకారీ కళలో జీవితాన్ని వెతుక్కున్నారు మనోజ్ఞ.

ఈ కళతో పరిచయం లేని కుటుంబం ఆమెది. అయినా ఈ కళ మీద ఇష్టంతో అద్దకపు ముద్రికను అందుకుంది. మగవాళ్లే ఒక్కొక్కరుగా దూరమవుతున్న ఈ రంగంలో పరిశ్రమ స్థాపించారు మనోజ్ఞ. ఆ రోజు ఆమె వేసిన తొలి అడుగు మరెంతో మందికి ఆసరా అయింది. ఒక విస్తారమైన కలంకారీ సామ్రాజ్యానికి పునాది అయింది. ఆమె జీవితాన్ని మనోజ్ఞంగా డిజైన్‌ చేసుకుని, చక్కగా అద్దుకుంది.

పెళ్లి ఖర్చు నాలుగువేలు
‘‘మా సొంతూరు నూజివీడు. నాన్నగారి అనారోగ్యరీత్యా మా కుటుంబాన్ని మా మేనమామ మచిలీపట్నానికి తీసుకువచ్చారు. 2009 ఫిబ్రవరిలో నవీన్‌తో నా పెళ్లయింది. పెళ్లి ఖర్చు నాలుగు వేల రూపాయలు. నిరాడంబరత కోసం కాదు, అంతకంటే ఖర్చు చేయగలిగిన స్థితి లేకనే. మా వారు అప్పటికే ఫ్యాన్సీ షాప్‌ పెట్టి నష్టపోయి ఉన్నారు. నేను కూడా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని అర్థమైంది. పెడనలో ముద్రించిన కలంకారీ మెటీరియల్‌ 2,870 రూపాయలకు కొన్నాను.

అదే నా తొలి పెట్టుబడి. ఆ కలంకారీ మెటీరియల్‌తో చీరకు బోర్డరు, బ్లవుజ్, పల్లుకి చిన్న పువ్వులు (ఆ పూలను చీర మీద అప్లిక్‌ వర్క్‌లాగా కుట్టించుకోవడమే) వచ్చేటట్లు కట్‌ చేసి అంచులు కుట్టి సెట్‌ తయారు చేశాను. అది బాగా క్లిక్‌ అయింది. పెద్ద మొత్తంలో ఆర్డర్‌లు వచ్చాయి. రా మెటీరియల్‌ (కలంకారీ డిజైన్‌ అద్దిన క్లాత్‌) అవసరం భారీగా పెరిగింది. మెటీరియల్‌ సరఫరా సక్రమంగా కొనసాగి ఉంటే నాకు అద్దకం పరిశ్రమ స్థాపించాల్సిన అవసరం ఉండేది కాదు.

సహాయ నిరాకరణ!
కలంకారీ పరిశ్రమ కుటీర పరిశ్రమగా విస్తరించిన పెడనలో దళారీ వ్యవస్థ పాతుకుపోయి ఉండేది. మాకు మెటీరియల్‌ సమయానికి అందేది కాదు. కొన్ని సందర్భాలలో నాణ్యత లేని మెటీరియల్‌ వచ్చేది. అలాంటి మెటీరియల్‌తో వ్యాపారం చేస్తే మా క్రెడిబులిటీ దెబ్బతింటుంది. అందుకోసం సొంతంగా అద్దకం పరిశ్రమ పెట్టాలనే నిర్ణయానికి వచ్చాం. అలా 2014లో దసరా రోజున కలంకారీ ప్రింటింగ్‌ యూనిట్, 2015 ఫిబ్రవరిలో గార్మెంట్స్‌ యూనిట్‌ ప్రారంభించాం.

పని నేర్చుకున్నాను!
కలంకారీ మీద ఇష్టంతో అద్దకం కూడా నేర్చుకున్నాను. కానీ అద్దకం పనికి విశాలమైన ప్రాంగణం, పెద్ద షెడ్, టేబుళ్లు కావాలి. ఇంత పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్‌కు డబ్బు లేదు. అప్పుడు మా నవీన్‌ ఫ్రెండ్‌ కిషోర్‌యాదవ్‌ గారు అర ఎకరం స్థలాన్ని, అందులో నిర్మించిన విశాలమైన షెడ్‌ని వాడుకోమన్నారు. కలంకారీ కళ మరుగున పడకుండా ప్రపంచ ప్రఖ్యాతి సాధించడానికి తన వంతు సహాయంగా ఆయన ఆ షెడ్‌ను ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మా యూనిట్‌ రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుకలా మారింది. మా శ్రమకు ఫలితం త్వరగానే దక్కింది. ఆరునెలల్లో బ్రేక్‌ ఈవెన్‌ వచ్చింది. మేము ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత యూనిట్‌ని రాయవరానికి మార్చాం.

ఏడు వందల ప్యాటర్న్‌లా!
చీరల మీద అనేక ప్రయోగాలు చేశాను. ఆర్గండి, క్రేప్, సిల్క్, నెట్‌... ఇలా రకరకాల క్లాత్‌ల మీద కలంకారీ అద్దకాలు వేశాం. ఆ ప్రయోగాలన్నీ సక్సెస్‌ అయ్యాయి. ఒక్క చీరల మీద అద్దకంలోనే ఏడు వందల ప్యాటర్న్‌లు రూపొందించాం. చుడీదార్‌లలో 55, బెడ్‌షీట్లలో 180 ప్యాటర్న్‌లను రూపొందించాం. అద్దకంలో ప్రతి దశనూ నోట్స్‌ రాసుకుంటాను. తర్వాత ఏం చేయాలో ఒక స్టిక్కర్‌ మీద రాసి అతికిస్తాను. ‘కరక్కాయ ప్రాసెస్‌ అయింది– బ్యాక్‌గ్రౌండ్‌ వేయాలి, బ్యాక్‌ గ్రౌండ్‌ అద్దకం అయింది– అవుట్‌లైన్‌ అద్దాలి, అవుట్‌లైన్‌ అయింది– ఫిల్లింగ్‌ అద్దాలి’ ఇలాగన్నమాట. దాంతో పనివాళ్లకు రోజూ నేను దగ్గరుండి ఏ క్లాత్‌ మీద ఏది అద్దాలనే ఆదేశాలు ఇవ్వాల్సిన పని ఉండదు.

పేరు వెనుక...
మా పరిశ్రమ పేరు మానవ్‌... అంటే ఏమిటని అందరూ అడుగుతుంటారు. నా పేరు మనోజ్ఞలోని మొదటి రెండు (‘ఎంఎ’) అక్షరాలు, మా వారు నవీన్‌ పేరులోని మొదటి మూడు (‘ఎన్‌ఎవి’) అక్షరాల సమాహారమే మానవ్‌’’ అని వివరించారు మనోజ్ఞ.

నిపుణుల తయారీ!
ఇరవై మంది మహిళలకు ఆరు నెలల పాటు నెలకు నాలుగు వేల రూపాయలు ఉపకార వేతనం ఇస్తూ పని నేర్పించాం. ఇప్పుడు వారిలో నెలకు తొమ్మిది–పది వేలు సంపాదించుకునే వాళ్లున్నారు. వీళ్లంతా 18 ఏళ్ల నుంచి 30–35 ఏళ్ల లోపు వారే. ఈ ప్రయత్నం ద్వారా మరో 30 సంవత్సరాల వరకు కలంకారీ కళను బతికించడానికి మా వంతు ప్రయత్నం చేశామనే సంతృప్తి కలుగుతోంది. వీరంతా ఈ వృత్తిలో సంతోషంగా ఉంటే మరో తరం కూడా తయారవుతుంది. నేను ఉపాధి పొందడంతోపాటు కొడిగడుతున్న కలంకారీ పరిశ్రమను నిలబెట్టాలనేదే నా ప్రయత్నం. కలంకారీ కాకుండా వేరే చెప్పడానికి నా జీవితంలో ఏమీ లేదు. మా ఇద్దరమ్మాయిలకు కూడా ఈ పని నేర్పిస్తాను.

– తుమ్మలపల్లి లక్ష్మీ మనోజ్ఞ
‘మానవ్‌ కలంకారీ’ వ్యవస్థాపక నిర్వాహకురాలు

 

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement