dyeing
-
అందుకే కాటన్ ఫ్యాబ్రిక్‌కు డిమాండ్ ఎక్కువ, వాటినుంచి కాపాడుకోవచ్చు
సహజ రంగులు అద్దుకున్న ఫ్యాబ్రిక్ స్కిన్ ఫ్రెండ్లీగా అమరిపోతుంది. ఆ దుస్తుల్లో ఎక్కడ ఉన్నా హుందాతనం కనిపిస్తుంది. అందుకే స్లో ఫ్యాషన్‌గా పేరున్న దుస్తులు ఇప్పుడు ఫాస్ట్‌గా యువతను ఆకట్టుకుంటున్నాయి. టై అండ్ డై తోనూ అట్రాక్ట్ చేస్తున్నాయి.హైదరాబాద్‌లోని తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సెల్లో సహజ రంగులతో దారాలను, ఫ్యాబ్రిక్‌ను ఎంత కలర్ఫుల్గా మార్చేయవచ్చో కళ్లకు కడుతున్నారు. పోచంపల్లి, ఇకత్, పటోల వంటి.. మన చేనేతల్లో రంగుల వాడకం తెలిసిందే. అయితే ఈ రంగులు అన్నీమొక్కల బెరడు, పండ్లతొక్కలు, ఆకులు, పువ్వులు, వేర్లు.. మొదలైనవాటితో తయారు చేసి, ఆ ప్రింట్లను దుస్తుల మీదకు తీసుకురావడం పెద్ద ప్రక్రియే. కానీ, వీటివల్ల ప్రకృతికి దగ్గరగా ఉంటాం. పైగా కాటన్ ఫ్యాబ్రిక్, సహజ రంగుల వల్ల సూర్యుని నుంచి హానికరమైన అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. డై చేసిన ఈ సహజ రంగులు ఎంతకాలమైనా మన్నికగా ఉండటంతో ఈ కాటన్ వస్త్రాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. మన దేశీయ కళను మరింత విస్తృతంగా కళ్లకు కడుతుంది. సహజరంగు దారాలు కాటన్, పట్టుదారాలను ముందుగా రంగులో ఉడికించి, తర్వాత వాటిని నీడలో ఆరబెట్టి, మగ్గం మీద నేయడానికి వాడుతారు. ఈ రంగు దారాలతో చీరలు, ఫ్యాబ్రిక్‌ను తయారుచేస్తారు. సేంద్రీయ రంగులతో తయారైన ఫ్యాబ్రిక్ రంగులు, ప్రింట్స్ కాలక్రమేణా వెలిసిపోతాయి అనుకుంటారు. కానీ, సరైన జాగ్రత్తలతో వేసిన సహజ రంగులు చాలాకాలం పాటు ఉంటాయి. ఫ్యాబ్రిక్ మన్నికను మించి కూడా రంగులు తమ సహజ గుణాన్ని చూపగలవు. ప్రక్రియలో నేర్పు అవసరం టై అండ్ డై, యార్న్ డై టెక్నిక్స్‌కు నేచరల్, సింథటిక్ రెండింటికీ వాడచ్చు. మనకు ఎన్ని రంగులు కావాలో ముందు డిసైడ్ చేసుకోవాలి. డైయింగ్ పద్ధతి పూర్తయ్యాకే మనకు కావాల్సిన డిజైన్ వస్తుంది కాబట్టి, టై చేసే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. దానిమ్మ, బంతిపువ్వు, బీట్రూట్, ఆలివ్స్.. ఇలా అన్నింటినుంచి లేత, ముదురు రంగులను సహజంగా తయారు చేసుకోవచ్చు. – డా. లక్ష్మీ పూజ శంకు అసిస్టెంట్ ప్రొఫెసర్, జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్శిటీ ►ముందు నీళ్లను బాగా మరిగించి, అందులో ఎంపిక చేసుకున్న పువ్వు లేదా బెరడు వంటివి వేసి ఉడికించాలి. పదార్థంలో ఉన్న రంగు అంతా నీళ్లలోకి వచ్చేశాక, వడకట్టుకొని, ఆ నీటిని మళ్లీ మరిగించాలి ∙ ►మిషనరీ లేదా మగ్గంపై తయారైన కొత్త క్లాత్‌లో స్టార్చ్, దుమ్ము ఉంటుంది. ఎంపిక చేసుకున్న క్లాత్‌ని ముందుగానే బాగా ఉతికి, ఆరేసి ఉంచాలి. ► డిజైన్‌ను బట్టి క్లాత్‌ను మడిచి, గట్టిగా ముడివేసి, ఉడుకుతున్న రంగులో ముంచి, అరగంట ఉంచి, తీసి, తర్వాత నీడలో ఆరబెట్టాలి. ►యార్న్ అయినా అదేవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, రంగు తయారీలో సమయం, పీహెచ్ లెవల్స్ ని పెంచడంలో మరికొన్ని పద్ధతులు ఉన్నాయి. ► వీటిని అనుసరిస్తే రంగుల్లో రకరకాల షేడ్స్ తీసుకురావచ్చు ∙నేచరల్ కలర్స్ అంత ఫాస్ట్ కలర్స్ మరేమీ ఉండవు. ► ప్రాచీన సౌందర్యం, ఆ హుందాతనం మనల్ని ఎలాగైతే ఆకట్టుకుంటుందో అంత బాగా ఈ సహజ రంగుల అందం కట్టిపడేస్తుంది. – నిర్మలారెడ్డి -
చేనేతల కళత: ఇక్కత్ ఇక్కట్లు.. గొల్లభామ గొల్లు
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి తరతరాల వృత్తిపై మమకారం.. వదులుకోలేని, కొనసాగించలేని దైన్యం. మూరెడు బట్ట నేసినా.. జానెడు పొట్ట నిండని దౌర్భాగ్యం. అరకొర సాయం మినహా ప్రఖ్యాతిగాంచిన కళలు బతికి ‘బట్ట’ కట్టేలా కొరవడిన ప్రోత్సాహం..వెరసి చేనేత మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆరు తరాలుగా వస్తోన్న అరుదైన చేనేత రంగుల కళ, కళ్ల ముందే చెదిరిపోతోంది. తెలంగాణాలో రెండు దశాబ్దాల క్రితం లక్ష మగ్గాలపై పడుగూ, పేకలతో అద్భుతాలు సృష్టించి అబ్బుర పరిచిన నేతన్నల సంఖ్య ఇప్పుడు ఇరవై రెండువేలకు పడిపోయిందంటేనే పరిస్థితి అర్ధమవుతోంది. మార్కెట్‌తో పోటీ పడే స్థితి లేక, నేసిన బట్టకు ధర గిట్టుబాటు కాక ఇతర ఉపాధి అవకాశాలను చూసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకరు, ఇద్దరు తప్ప కొత్త తరం ఈ వృత్తి వైపే కన్నెత్తి చూడటం లేదు. దీంతో చేనేతకు సంబంధించి ఇదే చివరి తరం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నైపుణ్యం ఉన్నా.. చేయూత సరిపోక యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల, జనగామ జిల్లాల్లో చేనేత కళాకారులు తమ నైపుణ్యంతో గుప్పిట్లో పట్టే చీరలను సైతం నేసి ఔరా అనిపించారు. నూలు దారాలకు రబ్బర్ ట్యూబ్‌ను బిగించి (టై), సహజ రంగులద్ది (డై) మగ్గాలపై 3,384 పోగుల పడుగు (పొడవు), 17,000 పోగుల పేక (వెడల్పు)తో నేసిన ‘పోచంపల్లి ఇక్కత్’ పట్టుచీర ఇప్పటికీ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. తలపై పాలకుండతో వయ్యారి నడకలకు తమ పోగులతో ప్రాణం పోసి గొల్లభామ బ్రాండ్‌తో మార్కెట్లో మగువలను ఆకట్టుకుంది సిద్దిపేట నేతన్న కళ. దశాబ్దాల క్రితమే అంతరించిన పీతాంబరి పట్టుకు సైతం సిద్దిపేట కళాకారులు మళ్లీ ప్రాణం పోశారు. జకాడ మగ్గంపై వెండి జరీ ఉపయోగించి నేయటం పీతాంబరం ప్రత్యేకత. చీర అంచులు, డిజైన్లకు ప్రత్యేక పోగులను వాడుతారు. ఈ చీర ధర రూ.30 నుండి రూ.40 వేల వరకు ఉంటుంది. చేనేత కళాకారులు తమ మేథోసంపత్తితో రూపొందిస్తున్న ఇలాంటి చీరల డిజైన్లకు.. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయలేని వైఫల్యంతో, కొందరు వారం వ్యవధిలో నకళ్లు తయారు చేస్తున్నారు. పవర్‌లూమ్స్‌పై ప్రింట్ చేసి చేనేత బ్రాండ్‌గా తక్కువ ధరలతో మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ ప్రింటెడ్ చీరలతో పోటీ పడలేక నేత చీర చతికిల పడుతోంది. దీనికి తోడు పోటీ ప్రపంచంలో మారుతున్న అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు రూపొందించే శక్తి, సామర్థ్యాలు సహకార సంఘాలు, మాస్టర్ వీవర్లకు ఉండటం లేదు. మరోవైపు తమదైన శైలిలో రూపొందించిన వస్త్రాలను మార్కెట్ చేసుకోవటంలో వారు విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర వస్త్ర ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు కార్మికులకు పొదుపు, భద్రతా పథకం అమలు చేస్తూ రసాయనాలపై సబ్సిడీలు ఇస్తున్నా అవి ఏ మూలకు సరిపోవడం లేదు. పోటీని తట్టుకునేలా పాతవారితో పాటు కొత్త తరం వారికి తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు, అంతరించే పోయే పరిస్థితుల్లో ఉన్న కళలను కాపాడేలా అనేక రూపాల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కింకర్తవ్యం ఏమిటి? ►ఐదేళ్లుగా ఎన్నికలు లేని, ఐదు మాసాలుగా కొనుగోళ్లు చేయని చేనేత సహకార సంఘాలన్నింటిలో కార్యాచరణ ప్రారంభించి రాజకీయాలకు సంబంధం లేకుండా మగ్గం నేసే వారికి సభ్యత్వం ఇవ్వాలి. సహకార సంఘాలకు కార్పొరేట్ హంగులద్ది ప్రతి నెలా తప్పనిసరిగా వస్త్రాలను కొనుగోలు చేయాలి ►మాస్టర్ వీవర్లకు ఆర్థిక పరిపుష్టినిచ్చేలా ప్యాకేజీలు ప్రకటించాలి. పరిశోధన, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. ►నూలు, రంగులు, రసాయనాలపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని పెంచాలి. మాల్స్, షాపింగ్ కాంప్లెక్సుల్లో చేనేత షోరూమ్‌లను తప్పనిసరి చేయాలి. ►ఇళ్లల్లో మగ్గం నేసే కార్మికులకు గృహ విద్యుత్ వినియోగంలో సబ్సిడీ ఇవ్వాలి. చేనేత బీమా వయో పరిమితి పెంచాలి. ►చేనేత వస్త్ర ఉత్పత్తులన్నింటిపై నకిలీకి తావులేకుండా ప్రత్యేక హోలోగ్రామ్ ముద్రించాలి. 1985 చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ►ప్రస్తుతం చేష్టలుడిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్ఫోర్స్మెంట్ను పటిష్టం చేసి నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ►అన్ని రకాల చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలి. చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మంచిదని, తెలంగాణ ఖ్యాతికి నిదర్శనమనే ప్రచారాన్ని విస్తృతంగా చేయాలి. ►ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకల్లో చేనేత పట్టుచీర, ధోవతిని చేర్చాలి. బతుకమ్మ చీరల్లోనూ కొంత వాటా చేనేతకు కేటాయించాలి. రిజర్వేషన్ చట్టం ఏం చెబుతోంది చేనేత రిజర్వేన్ చట్టం 1985 ప్రకారం.. 11 రకాల ఉత్పత్తులు..అంటే కాటన్.. పట్టు చీరలు, ధోతి, టవల్స్, లుంగీలు, బెడ్‌షీట్స్, జంపఖానాలు, డ్రెస్ మెటీరియల్, బ్యారక్ బ్లాంకెట్స్, ఉన్ని శాలువలు, మఫ్లర్లు, చద్దర్లు పూర్తిగా చేనేత (కొన్ని మినహాయింపులతో) ద్వారానే ఉత్పత్తి చేయాలి. పవర్‌లూమ్స్ నిబంధనలు ఉల్లంఘించి ఉత్పత్తి, విక్రయాలు చేస్తే.. క్రిమినల్ చర్యలు చేపట్టి జరిమానాతో పాటు జైలుశిక్ష సైతం విధించవచ్చు. సంఘం సామగ్రి, పని ఇవ్వడం లేదు నేను చేనేత సహకార సంఘంలో ఎప్పటి నుండో సభ్యుడిని. కానీ సంఘం.. సామగ్రి, పని ఇవ్వడం లేదు. నాకు నేత తప్ప మరో పని రాదు. అందుకే ఓ మాస్టర్ వీవర్ వద్ద కూలీ పని చేస్తున్న. పోచంపల్లి నేత ఖ్యాతి క్రమంగా మసకబారుతోంది. కొత్తతరం రావడం లేదు. కళ్ల ముందే అరుదైన కళ కనుమరుగవుతుంటే బాధగా ఉంది. –చిట్టి ఐలయ్య, నేత కార్మికుడు, పోచంపల్లి తక్షణ కార్యాచరణ అవసరం చేనేత ఒక వృత్తి కాదు నాగరికత. అందులో పోచంపల్లి చేనేత కళ దేశంలోనే మరీ ప్రత్యేకమైనది. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రాకుంటే అతి త్వరలో చేనేత కళ కనుమరుగు కావడం ఖాయం. ముందు తరాలకు అందించడం, మన ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తం చేయాలంటే తక్షణ కార్యాచరణ అవసరం. కొత్త టెక్నాలజీ, డిజైన్లు, మార్కెటింగ్ అంశాలపై శిక్షణ ఇవ్వాలి. మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. – చింతకింది మల్లేశం, ఆసు యంత్రం రూపకర్త ఇదే చివరి తరం అనుకుంటున్న చేనేత మాతోనే అంతం అయ్యేలా ఉంది. కొత్త తరం రాకపోతే గొప్ప కళను సమాజం కోల్పోతుంది. పొద్దంతా చీర నేస్తే రోజుకు రూ.200 నుంచి రూ.220 కూలీయే లభిస్తోంది. ఏదైనా షాప్‌లో పనికి వెళ్తే కనీసం రోజుకు రూ 300 ఇస్తున్నారు. నేను 53 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. వేరే పనికి వెళ్లలేక ఈ వృత్తిలో కొనసాగుతున్న. నాకు ఇప్పుడు 65 ఏళ్లు.. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత బీమా వర్తించడం లేదు. చేనేత బీమాకు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ అమలు చేయాలి. – గంజి లింగం, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట పీతాంబరానికి ‘ప్రాణం’ పోశారు తుమ్మ గాలయ్య సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికుడు. అధికారులు చెప్పారని కనుమరుగైన పీతాంబరం పట్టు చీరకు పునర్వైభవం తెచ్చే దిశగా కృషి చేశాడు. ఇతర నేత కార్మికులతో కలిసి అనేక వ్యయ ప్రయాసలతో 270 వరకు పీతాంబరం పట్టు చీరలు నేశాడు. ప్రభుత్వం, టీఎస్సీఓ 60 చీరలను కొనుగోలు చేయగా మరో 60 వరకు చీరలు ప్రైవేటులో విక్రయించాడు. అయితే తగిన ప్రచారం లేకపోవడంతో పూర్తిస్థాయిలో చీరలు అమ్మలేకపోయాడు. ఇంకా 150 చీరల వరకు స్టాక్ ఉంది. భారీ పెట్టుబడితో నేసిన వస్త్రాల నిల్వ చూస్తుంటే నిద్ర పట్టడం లేదని, ప్రభుత్వం స్పందించి త్వరగా కొనుగోలు చేయకపోతే, భవిష్యత్తులో పీతాంబరం వెరైటీని తీసుకురాలేమని అంటున్నాడు. – తుమ్మ గాలయ్య, చేనేత కార్మికుడు, సిద్దిపేట పోచంపల్లికి.. కొత్త హంగులద్దాలని ఉంది ప్రపంచ ఖ్యాతి ఉన్న పోచంపల్లి చేనేతకు కొత్తహంగులు అద్దాలని ఉంది. అనేక ఉన్నత ఉద్యోగాలను వదులుకుని చేనేత పనినే ఎంచుకున్నా. సొంత ఖర్చులతో అనేక ప్రయోగాలు, కొత్త డిజైన్లు రూపొందించి మార్కెట్ చేస్తున్నా. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి చేనేతను బతికించే ప్రతిపాదన ఇచ్చా.. ఏమవుతుందో చూడాలి. –సాయిని భరత్, పీహెచ్డీ స్కాలర్, పోచంపల్లి నావంతుగా.. నా నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకలతో పాటు నా వంతుగా వధూవరులకు పోచంపల్లి చేనేత పట్టుచీర, జాకెట్, పంచె, టవల్ సొంత ఖర్చులతో ఇస్తున్నా. నేతన్నను ప్రోత్సహించే దిశగా నా వంతు ప్రయత్నం ఇది. – పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
సిడ్నీలో పోచంపల్లి ఇక్కత్ నేత ప్రదర్శన
భూదాన్‌పోచంపల్లి: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఆస్ట్రేలియాలోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిడ్నీలోని పవర్‌హౌస్ మ్యూజియంలో ‘చరఖా అండ్ కర్గా’ పేరిట చేనేత హస్తకళల ప్రదర్శన జరుగుతోంది. ఇండియన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, కేంద్ర జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రదర్శనలో పోచంపల్లికి చెందిన నేషనల్ హ్యాండ్లూమ్ మెరిట్ సర్టిఫికెట్ విన్నర్ తడక రమేశ్‌కు అవకాశం వచ్చింది. తడక రమేశ్ మగ్గంపై ఇక్కత్ వస్త్రాల తయారీ, చిటీకి కట్టడం, రంగులద్దకం, ఆసుపోయడం వంటి నేత ప్రక్రియలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు. ఇండియా నుంచి పోచంపల్లి ఇక్కత్‌తో పాటు బనారస్ వస్త్రాల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనకు అవకాశ వచ్చిందని రమేష్ తెలిపారు. భారత రాయబారి మనీష్ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు సిడ్నీలో జాతీయ జెండావిష్కరణ ఉంటుందని, స్థానికంగా ఉన్న భారతీయులందరూ పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకల్లో తాను, మాస్టర్‌వీవర్ పాలాది యాదగిరి భాగస్వామికావడం గర్వంగా ఉందన్నారు. (క్లిక్: మిస్ ఇండియా యూఎస్–2022 రన్నరప్‌గా సంజన) -
కుక్క హెయిర్ డై కోసం 5 లక్షలు.. మోడల్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!
Russian Playboy Model Spends 5 Lakh For Dye Dog: గతంలో సెలబ్రిటీలు ఏం చేసినా పెద్దగా తెలిసేది కాదు. ఒకవేళ తెలిసిన అది మీడియా ద్వారా తెలియాల్సిందే. అయితే సోషల్‌మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చేసే ప్రతీది ప్రపంచ మారుమూలాలకు వెళ్తోంది. అయితే అందులో కొన్ని నెటిజన్లకు నచ్చితే పోగడ్తలతో ముంచెత్తడం, లేదంటే విపరీతమైన ట్రోలింగ్ చేయడం సర్వ సాధారణం. తాజాగా ఓ పాపులర్ మోడల్ చేసిన పనికి నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు. పెంపుడు జంతువులను పెంచుకోవడం అందరికి సరదానే. కాకపోతే ధనవంతులు వాటిని జంతువుల్లా కాకుండా తమ సొంత మనుషుల్లా చూసుకుంటారు. రష్యాకు చెందిన ‘ప్లేబాయ్’ మోడల్ పేరు అన్నా స్టూపక్ తన తన పెంపుడు కుక్కకి ఫోటోషూట్ చేయాలనుకుంది. ఇందులో ఆమెను విమర్శించాలి పని ఏముందని అనుకుంటున్నారా?. కానీ, అమ్మడు సరికొత్తగా ఆలోచించి ఫోటోషూట్ కోసం తన కుక్క పిల్ల కలర్‌నే మార్చేసింది. దాని ఒంటి మీదున్న వెంట్రుకలకు డై చేయించింది. అలా ఓ ఫోటో షూట్ కోసం ఏకంగా ఖర్చు 5 వేల యూరోలు (రూ. 5 లక్షలు) ఖర్చు పెట్టింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అయితే చాలా మంది నెటిజన్లు మాత్రం ఇది మూగ జీవాన్ని హింసించడమేనంటూ ఆమెపై ఫైర్ అయ్యారు. దీంతో అన్నా తన చర్మానికి ఎలాంటి హానీ జరగకుండానే వైట్ డాగ్‌ను ఆరెంజ్ డాగ్‌గా మార్చామని బదులిచ్చింది. అయినా ఆమెపై విమర్శుల మాత్రం ఆగడం లేదు. చదవండి: బాడీలో ఆ పార్ట్‌కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్ -
మనోజ్ఞ అద్దకం
పదేళ్ల కిందటి మాట. మచిలీపట్నం కలంకారీ పరిశ్రమ ఖాయిలా పడడానికి సిద్ధంగా ఉంది. పెడనలో ఉన్న అద్దకం బల్లలు నిరుత్సాహంగా ఊపిరి పీలుస్తున్నాయి. కుటుంబ వారసత్వంగా అంది వచ్చిన కళ అన్నం పెడుతుందనే భరోసా లేకపోవడంతో ఒక్కొక్కరు ఇతర మా ర్గాలకు మళ్లుతున్నారు. ఒక్కో అద్దకం బల్ల అటకెక్కుతోంది. అలాంటి సమయంలో కలంకారీ కళలో జీవితాన్ని వెతుక్కున్నారు మనోజ్ఞ. ఈ కళతో పరిచయం లేని కుటుంబం ఆమెది. అయినా ఈ కళ మీద ఇష్టంతో అద్దకపు ముద్రికను అందుకుంది. మగవాళ్లే ఒక్కొక్కరుగా దూరమవుతున్న ఈ రంగంలో పరిశ్రమ స్థాపించారు మనోజ్ఞ. ఆ రోజు ఆమె వేసిన తొలి అడుగు మరెంతో మందికి ఆసరా అయింది. ఒక విస్తారమైన కలంకారీ సామ్రాజ్యానికి పునాది అయింది. ఆమె జీవితాన్ని మనోజ్ఞంగా డిజైన్ చేసుకుని, చక్కగా అద్దుకుంది. పెళ్లి ఖర్చు నాలుగువేలు ‘‘మా సొంతూరు నూజివీడు. నాన్నగారి అనారోగ్యరీత్యా మా కుటుంబాన్ని మా మేనమామ మచిలీపట్నానికి తీసుకువచ్చారు. 2009 ఫిబ్రవరిలో నవీన్‌తో నా పెళ్లయింది. పెళ్లి ఖర్చు నాలుగు వేల రూపాయలు. నిరాడంబరత కోసం కాదు, అంతకంటే ఖర్చు చేయగలిగిన స్థితి లేకనే. మా వారు అప్పటికే ఫ్యాన్సీ షాప్ పెట్టి నష్టపోయి ఉన్నారు. నేను కూడా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని అర్థమైంది. పెడనలో ముద్రించిన కలంకారీ మెటీరియల్ 2,870 రూపాయలకు కొన్నాను. అదే నా తొలి పెట్టుబడి. ఆ కలంకారీ మెటీరియల్‌తో చీరకు బోర్డరు, బ్లవుజ్, పల్లుకి చిన్న పువ్వులు (ఆ పూలను చీర మీద అప్లిక్ వర్క్‌లాగా కుట్టించుకోవడమే) వచ్చేటట్లు కట్ చేసి అంచులు కుట్టి సెట్ తయారు చేశాను. అది బాగా క్లిక్ అయింది. పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చాయి. రా మెటీరియల్ (కలంకారీ డిజైన్ అద్దిన క్లాత్) అవసరం భారీగా పెరిగింది. మెటీరియల్ సరఫరా సక్రమంగా కొనసాగి ఉంటే నాకు అద్దకం పరిశ్రమ స్థాపించాల్సిన అవసరం ఉండేది కాదు. సహాయ నిరాకరణ! కలంకారీ పరిశ్రమ కుటీర పరిశ్రమగా విస్తరించిన పెడనలో దళారీ వ్యవస్థ పాతుకుపోయి ఉండేది. మాకు మెటీరియల్ సమయానికి అందేది కాదు. కొన్ని సందర్భాలలో నాణ్యత లేని మెటీరియల్ వచ్చేది. అలాంటి మెటీరియల్‌తో వ్యాపారం చేస్తే మా క్రెడిబులిటీ దెబ్బతింటుంది. అందుకోసం సొంతంగా అద్దకం పరిశ్రమ పెట్టాలనే నిర్ణయానికి వచ్చాం. అలా 2014లో దసరా రోజున కలంకారీ ప్రింటింగ్ యూనిట్, 2015 ఫిబ్రవరిలో గార్మెంట్స్ యూనిట్ ప్రారంభించాం. పని నేర్చుకున్నాను! కలంకారీ మీద ఇష్టంతో అద్దకం కూడా నేర్చుకున్నాను. కానీ అద్దకం పనికి విశాలమైన ప్రాంగణం, పెద్ద షెడ్, టేబుళ్లు కావాలి. ఇంత పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్‌కు డబ్బు లేదు. అప్పుడు మా నవీన్ ఫ్రెండ్ కిషోర్‌యాదవ్ గారు అర ఎకరం స్థలాన్ని, అందులో నిర్మించిన విశాలమైన షెడ్‌ని వాడుకోమన్నారు. కలంకారీ కళ మరుగున పడకుండా ప్రపంచ ప్రఖ్యాతి సాధించడానికి తన వంతు సహాయంగా ఆయన ఆ షెడ్‌ను ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మా యూనిట్ రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుకలా మారింది. మా శ్రమకు ఫలితం త్వరగానే దక్కింది. ఆరునెలల్లో బ్రేక్ ఈవెన్ వచ్చింది. మేము ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత యూనిట్‌ని రాయవరానికి మార్చాం. ఏడు వందల ప్యాటర్న్‌లా! చీరల మీద అనేక ప్రయోగాలు చేశాను. ఆర్గండి, క్రేప్, సిల్క్, నెట్... ఇలా రకరకాల క్లాత్‌ల మీద కలంకారీ అద్దకాలు వేశాం. ఆ ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఒక్క చీరల మీద అద్దకంలోనే ఏడు వందల ప్యాటర్న్లు రూపొందించాం. చుడీదార్లలో 55, బెడ్షీట్లలో 180 ప్యాటర్న్‌లను రూపొందించాం. అద్దకంలో ప్రతి దశనూ నోట్స్ రాసుకుంటాను. తర్వాత ఏం చేయాలో ఒక స్టిక్కర్ మీద రాసి అతికిస్తాను. ‘కరక్కాయ ప్రాసెస్ అయింది– బ్యాక్‌గ్రౌండ్ వేయాలి, బ్యాక్ గ్రౌండ్ అద్దకం అయింది– అవుట్‌లైన్ అద్దాలి, అవుట్‌లైన్ అయింది– ఫిల్లింగ్ అద్దాలి’ ఇలాగన్నమాట. దాంతో పనివాళ్లకు రోజూ నేను దగ్గరుండి ఏ క్లాత్ మీద ఏది అద్దాలనే ఆదేశాలు ఇవ్వాల్సిన పని ఉండదు. పేరు వెనుక... మా పరిశ్రమ పేరు మానవ్... అంటే ఏమిటని అందరూ అడుగుతుంటారు. నా పేరు మనోజ్ఞలోని మొదటి రెండు (‘ఎంఎ’) అక్షరాలు, మా వారు నవీన్ పేరులోని మొదటి మూడు (‘ఎన్ఎవి’) అక్షరాల సమాహారమే మానవ్’’ అని వివరించారు మనోజ్ఞ. నిపుణుల తయారీ! ఇరవై మంది మహిళలకు ఆరు నెలల పాటు నెలకు నాలుగు వేల రూపాయలు ఉపకార వేతనం ఇస్తూ పని నేర్పించాం. ఇప్పుడు వారిలో నెలకు తొమ్మిది–పది వేలు సంపాదించుకునే వాళ్లున్నారు. వీళ్లంతా 18 ఏళ్ల నుంచి 30–35 ఏళ్ల లోపు వారే. ఈ ప్రయత్నం ద్వారా మరో 30 సంవత్సరాల వరకు కలంకారీ కళను బతికించడానికి మా వంతు ప్రయత్నం చేశామనే సంతృప్తి కలుగుతోంది. వీరంతా ఈ వృత్తిలో సంతోషంగా ఉంటే మరో తరం కూడా తయారవుతుంది. నేను ఉపాధి పొందడంతోపాటు కొడిగడుతున్న కలంకారీ పరిశ్రమను నిలబెట్టాలనేదే నా ప్రయత్నం. కలంకారీ కాకుండా వేరే చెప్పడానికి నా జీవితంలో ఏమీ లేదు. మా ఇద్దరమ్మాయిలకు కూడా ఈ పని నేర్పిస్తాను. – తుమ్మలపల్లి లక్ష్మీ మనోజ్ఞ ‘మానవ్ కలంకారీ’ వ్యవస్థాపక నిర్వాహకురాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
డయ్యింగ్ డేంజర్
♦ కాలుష్య కోరల్లో క్షీరపురి ♦ చీరాలలో 45కు పైగా అక్రమ డయ్యింగ్ యూనిట్లు ♦ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులవే ఎక్కువ ♦ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మాట మరిచిన యూనిట్ల యజమానులు ♦ డయ్యింగ్ యూనిట్లకు విద్యుత్ కట్ చేసినా పునరుద్ధరించేలా చేసిన ప్రజాప్రతినిధి ♦ ప్రస్తుతం తూతూ మంత్రంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆయనే ఫిర్యాదు ♦ కిలోమీటర్ల మేర కలుషితమైన భూగర్భ జలాలు ♦ సీజింగ్ ఆదేశాలు బేఖాతరు వస్త్రవ్యాపారంలో చినముంబయిగా పేరొందిన చీరాల కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. తమిళనాడు నుంచితరలివచ్చిన డయ్యింగ్ యూనిట్ల నుంచి కొన్నేళ్లుగా విడుదలవుతున్న రసాయనాలతో భూగర్భ జలాలన్నీ విషతుల్యమయ్యాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఆయన అనుచరులే నడిపిస్తున్న ఆ డయ్యింగ్ యూనిట్లతో చీరాల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. చీరాల: చీరాలలో చేనేత పరిశ్రమలు ఉండటంతో నూలుకు రంగులు వేసేందుకు అద్దకం అవసరం. ఇందుకు సహజ సిద్ధమైన చిన్నపాటి రంగుల కార్ఖానాలు ఏర్పాటు చేసి వాటికి అద్దకం వేసేవారు. వీటివల్ల పెద్దగా నష్టం ఉండేది కాదు. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చీరాల కేంద్రంగా రెడీమేడ్ వస్త్రాలు, ఇతర ఫ్యాబ్రిక్స్ కూడా తయారు కావడం మొదలైంది. ఇందుకు చీరాల ప్రాంతంలో 65 భారీ క్యాబినెట్ డయ్యింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. నామమాత్రపు అనుమతి కూడా లేకుండా యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాటిలో కొన్ని మూతపడగా ప్రస్తుతం 45 ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే వస్త్రాలకు చీరాలలో డయ్యింగ్ జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాల నుంచి 45 మంది వ్యాపారులు చీరాలలో డయ్యింగ్ యూనిట్లను అక్రమంగా పెట్టారు. నియోజకవర్గంలోని ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఉన్నాయి. ఇవి రోజూవారి వదిలే విషపూరిత నీరు సుమారు 50 లక్షల లీటర్లకు పైగానే ఉంటుందని అంచనా. తమిళనాడులోని తిరువూరు, సేలం, ఈరోడ్, కంచి, కుంభకోణం, ఆరణి వంటి ప్రాంతాల్లో డయ్యింగ్ యూనిట్లను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. వాటి నుంచి వచ్చే విషపూరితమైన కలుషిత నీరు భూగర్భ జలాల్లో చొరబడి, విషపూరితంగా మార్చిన ఫలితంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయన్న ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయిలో యూనిట్లపై దృష్టి పెట్టింది. కలుషిత నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు ఉంటేనే డయ్యింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ఖచ్చితమైన నిబంధన విధించింది. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలంటే కోట్లతో కూడుకున్న పని. దీంతో చీరాలలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇక్కడికి తరలివచ్చాయి. మాట తప్పి...మడం తిప్పి: ఆయన నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి. చట్టం, నిబంధనల గురించి అనునిత్యం వల్లె వేస్తుంటారు. కానీ వాటన్నింటి వెనక జనం బాగోగుల కన్నా స్వప్రయోజనాలను చక్కబెట్టుకునే వ్యూహమే ఉంటుంది. క్షీరపురిని కాలుష్య కోరల్లో నెట్టివేస్తున్న డయ్యింగ్ యూనిట్ల జోలికి అధికారులెవ్వరూ ఎందుకు వెళ్లరంటే వాటి నిర్వాహకులకు సదరు ప్రజాప్రతినిధే పెద్దదిక్కు మరి. కొత్తపేట, దేవాంగపురి, చీరాలనగర్, సాయికాలనీ, కోర్టు రోడ్డులో క్యాబినెట్ డయ్యింగ్లు నడుపుతున్న వారు ఆ ప్రజాప్రతినిధి అనుచరులు. యూనిట్ల నుంచి వచ్చే వృథా నీటిలో దారుణమైన విషవాయువులు కలిసి ఉన్నట్లు 2012లో పరీక్షలు నిర్వహించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) మహేష్‌తో పాటు ఇతర అధికారులు నిర్ధారించారు. ఆ తరువాత అనుమతులు లేవంటూ వాటికి విద్యుత్ శాఖాధికారులు సరఫరా నిలిపేశారు. తమిళనాడు డయ్యింగ్‌లను మూసివేస్తే తన అనుచరులవి కూడా మూతపడతాయనుకుని సదరు ప్రజాప్రతినిధి రంగంలోకి దిగాడు. 2012లో అప్పటి కలెక్టర్ కాంతీలాల్‌దండే సమక్షంలో కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ రూ.5 కోట్లు ఖర్చుతో ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత విద్యుత్ శాఖాధికారులు సరఫరా పునరుద్ధరించేలా చేశారు. కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఇప్పిస్తానని చెప్పిన ఆ ప్రజాప్రతినిధి దాని ఊసే పట్టించుకోలేదు. కాలుష్య కారకాలతో భూగర్భజలాలు విషతుల్యమై పంట పొలాలు సైతం దెబ్బతినడంతో పాటుగా కుందేరులో గడ్డితిని, నీరు తాగిన పశువులు రోజుకు 4 వరకు మరణిస్తున్నాయి. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాని నుంచి బయటపడేందుకు ఆ ప్రజాప్రతినిధి మళ్లీ వ్యూహం పన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డయ్యింగ్ యూనిట్లను మూసేయాలంటూ ఇటీవల పొల్యూషన్ కంట్రోల్‌బోర్డుకు నామమాత్రంగా ఫిర్యాదు చేశారు. ఆమేరకు బోర్డు అధికారులు కూడా డయ్యింగ్‌లను తూతూ మంత్రంగా తనిఖీ చేశారు. డయ్యింగ్ యూనిట్ల యజమానులు పొల్యూషన్ బోర్డు అధికారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయగా ముందు మీ ప్రజాప్రతినిధిని ఒప్పించుకోండని ఉచిత సలహా ఇచ్చారు. తర్వాత డయ్యింగ్ అక్రమార్కుల్లో కొందరు ప్రజాప్రతినిధిని కలిసి ఓ ఒప్పందానికి వచ్చారని సమాచారం. పొల్యూషన్ బోర్డు అధికారులు విచారించినప్పటికీ అనుమతిలేని ఒక్క డయ్యింగ్ యూనిట్‌ను మూసివేసిన దాఖలాలు లేవు. ఆయన అనుచరుల కోసం కొన్ని క్యాబినెట్ డయ్యింగ్లకు అండగా ఉండటంతో పాటు కేంద్రం నుంచి వచ్చే అనేక సబ్సిడీలు, పథకాలను వర్తింపజేస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సంభవించే ప్రమాదాలివే... ఈ విషపూరితమైన నీరు నేరుగా విడుదల చేయడంతో అవి భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. అలానే కుందేరులో విడుదల కావడంతో ఆ పరిసర ప్రాంతాలతో పాటు సముద్రంలో కలవడం వలన కూడా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. పరిసర ప్రాంతాల్లోని బోర్లు, బావుల్లోకి ఈ కలుషిత నీరు చేరుతోంది. ఈ నీటిని ప్రజలు తాగడం వలన కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో పాటుగా చర్మవ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారు. నీటిలో ఉప్పు శాతం పెరిగిపోవడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. జీర్ణవ్యవస్థ దెబ్బతిని జీర్ణకోశ వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. అలానే బావులు, బోర్లలోని నీళ్లు మందంగా మారుతాయి. వాటిని తాగడం వలన కూడా అనేక వ్యాధుల బారిన పడటం ఖాయంగా కనిపిస్తోంది. నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోతోంది. దీనివల్ల చేపలు, రొయ్యలతో పాటు సముద్ర జీవులు చనిపోతాయి. నిబంధనలకు నీళ్లు... డయ్యింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలంటే నిబంధనల ప్రకారం ముందుగా సీఎస్టీ అనుమతిని కాలుష్య నియంత్రణ బోర్డు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ పెట్టే స్థలం అందుకు అనుకూలమైందా, స్థానికులకు ఇబ్బందులకు ఏర్పడతాయా అనేది పరిశీలించాలి. ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించిన అనుమతి తీసుకోవాలి. తప్పకుండా యూనిట్ల నుంచి విడుదలయ్యే కలుషిత నీటిని శుద్ధి చేసేందుకు ట్రీట్మెంట్ ప్లాంట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. కానీ చీరాలలో ఉన్న డయ్యింగ్ యూనిట్లకు ఇటువంటి అనుమతులేమీ లేవు. నేటికీ అడుగుపడని ట్రీట్మెంట్ ప్లాంట్..! గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మహేష్, మరికొందరు అధికారులు అనుమతి లేని డయ్యింగ్ యూనిట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఉన్న డయ్యింగ్ యూనిట్ల యజమానులందరూ కలిసి మొత్తం మీద ఒక ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినా నేటికీ పునాదికి నోచుకోలేదు. ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ప్రత్యేకంగా ఒక పైపులైన్‌ను వేసి డయ్యింగ్ యూనిట్ల నుంచి వచ్చే కలుషిత నీటిని ఈ పైపులైన్ ద్వారా ట్రీట్మెంట్ ప్లాంట్‌కు అనుసంధానం చేసేందుకు అంగీకరించినప్పటకీ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలంటే రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కల్పిస్తుందని, మిగిలిన మొత్తం డయ్యింగ్ యూనిట్ల యజమానులు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే డయ్యింగ్ యూనిట్ల యజమానులు ఇంత పెద్ద మొత్తం పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం నేటికీ మొదలు కాలేదు. పోరాటమే శరణ్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డయ్యిం గ్ యూనిట్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో, మామూళ్ల మత్తుతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కాలుష్య భూతం నుంచి విముక్తి కావాలంటే పోరు తప్పేట్లు లేదని ప్రజలంటున్నారు. నిరసన బాట పట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. చీరాల విషపూరితమవుతుందిలా... చీరాల ప్రాంతంలో ఉన్న డయ్యింగ్ యూనిట్ల నుంచి రోజుకు 50 లక్షల లీటర్లకు పైగానే వివిధ రసాయనాలు, ఇతర వ్యర్థ పదార్థాలు భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. సుమారు ఒక్కొక్క డయ్యింగ్ యూనిట్లో రోజూ మూడు నుంచి నాలుగు వేల కేజీల వస్త్రాలకు డయ్యింగ్ వేస్తారు. ఒక్కో కేజీ వస్త్రానికి డయ్యింగ్ వేయాలంటే 200 లీటర్లు రసాయనాలతో కూడిన నీటిని వినియోగిస్తారు. ఆ తర్వాత వాటిని నేరుగా కుందేరు లేదా ఆ పక్కనే వదిలేస్తున్నారు. యూనిట్ల నుంచి వచ్చే వ్యథా నీటిలో దారుణమైన విష వాయువులు కలిసి ఉన్నట్లు గతంలోనే పరీక్షలు నిర్వహించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్పటి ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) మహేష్‌తో పాటు ఇతర అధికారులు నిర్ధారించారు. టీడీఎస్ (టోటల్ డిజాల్వ్ సాలిడ్) 2100 మిల్లీ గ్రాములు ఉండాల్సి ఉండగా ఏకంగా 40 వేల మిల్లీ గ్రాములు వరకు ఉంది. అలానే సీఓడీ (కెమికల్ ఆక్సిజన్ డిమాండ్) 250 మిల్లీ గ్రాములు ఉండాల్సి ఉండగా 4 వేల మిల్లీ గ్రాములు ఉన్నాయి. అలానే సస్పెండెడ్ సాలిడ్స్ 100 మిల్లీ గ్రాములు ఉండాల్సి ఉండగా 1800 మిల్లీ గ్రాములు వరకు ఉంది.