సహజ రంగులు అద్దుకున్న ఫ్యాబ్రిక్ స్కిన్ ఫ్రెండ్లీగా అమరిపోతుంది. ఆ దుస్తుల్లో ఎక్కడ ఉన్నా హుందాతనం కనిపిస్తుంది. అందుకే స్లో ఫ్యాషన్‌గా పేరున్న దుస్తులు ఇప్పుడు ఫాస్ట్‌గా యువతను ఆకట్టుకుంటున్నాయి. టై అండ్ డై తోనూ అట్రాక్ట్ చేస్తున్నాయి.హైదరాబాద్‌లోని తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సెల్‌లో సహజ రంగులతో దారాలను, ఫ్యాబ్రిక్‌ను ఎంత కలర్‌ఫుల్‌గా మార్చేయవచ్చో కళ్లకు కడుతున్నారు.
పోచంపల్లి, ఇకత్, పటోల వంటి.. మన చేనేతల్లో రంగుల వాడకం తెలిసిందే. అయితే ఈ రంగులు అన్నీమొక్కల బెరడు, పండ్లతొక్కలు, ఆకులు, పువ్వులు, వేర్లు.. మొదలైనవాటితో తయారు చేసి, ఆ ప్రింట్లను దుస్తుల మీదకు తీసుకురావడం పెద్ద ప్రక్రియే. కానీ, వీటివల్ల ప్రకృతికి దగ్గరగా ఉంటాం. పైగా కాటన్ ఫ్యాబ్రిక్, సహజ రంగుల వల్ల సూర్యుని నుంచి హానికరమైన అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. డై చేసిన ఈ సహజ రంగులు ఎంతకాలమైనా మన్నికగా ఉండటంతో ఈ కాటన్ వస్త్రాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. మన దేశీయ కళను మరింత విస్తృతంగా కళ్లకు కడుతుంది.
సహజరంగు దారాలు
కాటన్, పట్టుదారాలను ముందుగా రంగులో ఉడికించి, తర్వాత వాటిని నీడలో ఆరబెట్టి, మగ్గం మీద నేయడానికి వాడుతారు. ఈ రంగు దారాలతో చీరలు, ఫ్యాబ్రిక్‌ను తయారుచేస్తారు. సేంద్రీయ రంగులతో తయారైన ఫ్యాబ్రిక్ రంగులు, ప్రింట్స్ కాలక్రమేణా వెలిసిపోతాయి అనుకుంటారు. కానీ, సరైన జాగ్రత్తలతో వేసిన సహజ రంగులు చాలాకాలం పాటు ఉంటాయి. ఫ్యాబ్రిక్ మన్నికను మించి కూడా రంగులు తమ సహజ గుణాన్ని చూపగలవు.
ప్రక్రియలో నేర్పు అవసరం
టై అండ్ డై, యార్న్ డై టెక్నిక్స్‌కు నేచరల్, సింథటిక్ రెండింటికీ వాడచ్చు. మనకు ఎన్ని రంగులు కావాలో ముందు డిసైడ్ చేసుకోవాలి. డైయింగ్ పద్ధతి పూర్తయ్యాకే మనకు కావాల్సిన డిజైన్ వస్తుంది కాబట్టి, టై చేసే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. దానిమ్మ, బంతిపువ్వు, బీట్‌రూట్, ఆలివ్స్.. ఇలా అన్నింటినుంచి లేత, ముదురు రంగులను సహజంగా తయారు చేసుకోవచ్చు.
– డా. లక్ష్మీ పూజ శంకు
అసిస్టెంట్ ప్రొఫెసర్, జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్శిటీ
►ముందు నీళ్లను బాగా మరిగించి, అందులో ఎంపిక చేసుకున్న పువ్వు లేదా బెరడు వంటివి వేసి ఉడికించాలి. పదార్థంలో ఉన్న రంగు అంతా నీళ్లలోకి వచ్చేశాక, వడకట్టుకొని, ఆ నీటిని మళ్లీ మరిగించాలి ∙
►మిషనరీ లేదా మగ్గంపై తయారైన కొత్త క్లాత్‌లో స్టార్చ్, దుమ్ము ఉంటుంది. ఎంపిక చేసుకున్న క్లాత్‌ని ముందుగానే బాగా ఉతికి, ఆరేసి ఉంచాలి.
► డిజైన్‌ను బట్టి క్లాత్‌ను మడిచి, గట్టిగా ముడివేసి, ఉడుకుతున్న రంగులో ముంచి, అరగంట ఉంచి, తీసి, తర్వాత నీడలో ఆరబెట్టాలి.
►యార్న్ అయినా అదేవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, రంగు తయారీలో సమయం, పీహెచ్ లెవల్స్ ని పెంచడంలో మరికొన్ని పద్ధతులు ఉన్నాయి. ► వీటిని అనుసరిస్తే రంగుల్లో రకరకాల షేడ్స్ తీసుకురావచ్చు ∙నేచరల్ కలర్స్ అంత ఫాస్ట్ కలర్స్ మరేమీ ఉండవు.
► ప్రాచీన సౌందర్యం, ఆ హుందాతనం మనల్ని ఎలాగైతే ఆకట్టుకుంటుందో అంత బాగా ఈ సహజ రంగుల అందం కట్టిపడేస్తుంది.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment