
వేసవిలో కాటన్ డ్రెస్సుల ప్రాముఖ్యత గురించి తెలిసిందే. అలాగే, ఈ సీజన్‌కి టెక్స్‌టైల్ జ్యువెలరీ అంతే స్పెషల్‌గా ఉంటుంది. ఎంచుకునే ఫ్యాబ్రిక్ ఏదైనా చేతితో రూపొందించే ఈ జ్యువెలరీ కొనుగోలు ఖర్చూ తక్కువే. అలాగే, ఎవరికి వారు నచ్చినట్టు ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు. యువతను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంచే ఈ స్పెషల్ జ్యువెలరీ అంతే తాజాదనపు అనుభూతిని సొంతం చేస్తుంది.
ప్రకృతికి దగ్గరగా.. ఫ్యాబ్రిక్ ఎంపిక!
పువ్వులంటేనే ప్రకృతి తెలియపరిచే ప్రేమ భాష. డిజైనర్ స్టూడియోలలో వాడగా ఉపయోగించిన మెటీరియల్‌తో అందమైన పూలను తయారుచేయవచ్చు. వాటిని పూసలు, జరీ దారాలతో ఆభరణాలుగా మార్చవచ్చు.
ఈ పువ్వుల ఆభరణాలు దుస్తుల అందాన్ని మరింతగా పెంచుతాయి. పాదం నుంచి తల వరకు ప్రతి ఆభరణాన్ని వస్త్రాలంకరణతో మెప్పించవచ్చు. చందేరీ, సిల్క్, నెటెడ్, కాటన్ వంటి ఏ మెటీరియల్ అయినా ఈ ఆభరణాల తయారీలో ఉపయోగించవచ్చు.
గార్మెంట్స్, బీడ్స్, జరీ లేదా కాటన్ దారాలను ఉపయోగించి చేసిన నెక్‌పీస్‌లు సంప్రదాయ చీరల మీదకే కాదు వెస్ట్రన్ డ్రెస్సుల మీదకూ ప్రత్యేక హంగుగా నిలుస్తున్నాయి.
కాటన్ దారాలు, క్లాత్‌తో తయారుచేసిన పువ్వులను ఉపయోగించి చేసిన బన్ క్లిప్స్ వేసవి సీజన్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎంపిక చేసుకున్న ఫ్యాబ్రిక్‌కి కాంబినేషన్‌గా సిల్వర్ లేదా ఇతర లోహాలతో తయారైన మువ్వలు,
గవ్వలు, జూకాలను జత చేయవచ్చు. దీని వల్ల ఈ జ్యువెలరీకి మరిన్ని హంగులు అమరుతాయి.