చల్లని గాలి కావాలంటే ఏసీ ఉంటే చాలు కదా అనుకుంటారు పిల్లలు. మంచి నీళ్లు కావాలంటే ఫ్రిజ్‌లోంచి వస్తాయి కదా అనుకుంటారు. పండ్లు కావాలంటే మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు కదా అంటారు. పాలు ప్యాకెట్ల నుంచే వస్తాయని అనుకునే రేపటి తరం ‘పర్యావరణం’ అనే పెద్ద పదం గురించి అర్థం చేసుకోవాలంటే వారి బుర్రలకు మొక్కను పరిచయం చేయాల్సిందే! ‘అయితే అందుకు, ఇంట్లో పెద్దలే పూనుకోవాలి’ అంటారు హైదరాబాద్ మణికొండలో ఉంటున్న సోదరీమణులు రాజశ్రీ, నవ్యశ్రీ. చదువుకుంటూ, సొంతంగా ఫ్యాషన్ డిజైనర్స్‌గా రాణిస్తున్న ఈ అక్కాచెల్లెళ్లు ఈ వేసవిలో ఓ కొత్త ఆలోచన చేశారు. ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ చేసి, చుట్టుపక్కల పిల్లలకు ఇస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. అదే ఆచరణలో పెట్టారు. పిల్లలను ఆకట్టుకునేలా ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ చేయడం మొదలుపెట్టారు. ‘కాస్త ఫ్రీ టైమ్ కేటాయించుకునే చేస్తున్నాం. కానీ, ఒక టాయ్ పూర్తవడానికి వారం రోజులైనా పడుతుంది’ అంటున్నారు.
గ్యాడ్జెట్స్‌కు కాస్త దూరంగా!
ఎండ అని పిల్లలు ఎక్కువ శాతం ఇంటి పట్టునే ఉంటున్నారు. స్కూళ్ళు లేకపోవడంతో కాస్త పెద్ద పిల్లలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్ స్క్రీన్లకు తమ కళ్లను అప్పజెప్పేసి వీడియోగేమ్స్‌తో కుదురుగా కూర్చుంటున్నారు. ‘గ్యాడ్జెట్స్‌తో ఉండే పిల్లలకు పర్యావరణం గురించి క్లాసు తీసుకుమంటామంటే వింటారా. మనమే ఇప్పుడు అమ్మో, ఏం ఎండలు.. వేడికి తట్టుకోలేకపోతున్నాం..’, ‘చల్లని గాలి అన్నదే కరువైంది. అన్నీ బిల్డింగ్‌లే... చెట్లు ఎక్కడ ఉన్నాయి’ అంటూ అల్లాడిపోతున్నాం. మరి పిల్లలకు వాతావరణం గురించి అర్థమయ్యేదెలా..?’ అనిపించింది. మా సొంత ఊరు వరంగల్‌కి వెళ్లినప్పుడు ఈ భావన మరింత బలపడింది. పట్టణాలలో ఉన్న పిల్లలకు చెట్ల గురించి, వాటి పెంపకం గురించి తక్కువ తెలుసు అని. వీటిని కొంతవరకైనా అర్థమయ్యేలా ఆసక్తికరంగా చెప్పడం కోసం ఏం చెయ్యాలా అని ఆలోచించాను’ అని వివరిస్తుంది నవ్యశ్రీ.
బొమ్మలతో వివరణ..
‘పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. కానీ, వాటిలోనూ హానికారకమైనవే ఉన్నాయి. నర్సరీ పిల్లల బుర్రల్లోకి మంచి ఆలోచనలు వచ్చేవిధంగా, అలాగే వారి శరీరానికి, ఆరోగ్యానికి ఏ మాత్రం హాని చేయని బొమ్మలైతే బాగుంటుందనిపించింది. ఈ విషయంగా శోధిస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ ప్లాంట్స్ బొమ్మల ఐడియా బాగా నచ్చింది’ అంటూ తాము ఎంచుకున్న పర్యావరణ కాన్సెప్ట్‌ను తెలియజేసింది రాజశ్రీ. కొబ్బరి చిప్పలు, వెదురు కొమ్మలు, మట్టి కుండలలో చిన్న చిన్న మొక్కల పెంపకం తెలిసిందే. ఐదేళ్ల లోపు పిల్లల శరీరానికి, మనసుకు హత్తుకునేలా చెప్పగలిగేదే ప్లాంటేషన్. అది ఎప్పుడూ ముచ్చటైనదే.
ఫ్యాబ్రిక్‌తో మేకింగ్..
‘టెడ్డీబేర్ క్లాత్‌ను ఉపయోగించి, బొమ్మ ఆకారం వచ్చేలా చేశాను. అందులో కొంత కోకోపిట్ నింపి, తల భాగంలో హెయిర్ ఎలా అయితే ఉంటుంది, అలా గోధుమ గడ్డి పెరిగేలా ఏర్పాటు చేశాను. అక్క వాటికి కళ్లూ, ముక్కు.. వంటివి పెట్టి ఆర్టిస్టిక్‌గా తయారుచేసింది. బొమ్మ తలభాగంలో పైన కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటే వారం రోజుల్లో మొలకలు ఏపుగా పెరిగాయి. అప్పుడు మా చుట్టుపక్కల పిల్లలను పిలిచి, చూపించాం. ఎంత ఆనందించారో మాటల్లో చెప్పలేం. రోజంతా ఈ ప్లాంట్ బొమ్మలతోనే గడిపాశారు. ఆ సమయంలో వాతావరణం గురించి, చెట్ల గురించి ఎన్నో విషయాలు మాట్లాడాం. తరవాత వాటిని వారికే ఇచ్చేశాం. వరి, ఇతర చిరుధాన్యాలతోనూ ఇలాంటి బొమ్మలను సిద్ధం చేశాం. వీలున్నప్పుడల్లా చేస్తున్నాం. పాత క్లాత్స్‌తో తయారు చేసిన ప్లాంట్ టాయ్స్‌ని పిల్లలచేతే తయారుచేయించవచ్చు. ఇందుకు ఈ వేసవి సమయం మరింత అనువైది’’ అని తమ ప్రయత్నం గురించి వివరించింది నవ్యశ్రీ.
ఆడుకున్నా మేలే..
పిల్లలకు ఈ బొమ్మలు ఏ మాత్రం హానిచేయవు. పొరపాటున నోట్లో పెట్టుకున్నా ఏ హానీ కలగదు. పైగా గోధుమగడ్డి వంటివి ఆరోగ్యానికి మంచివే. వారి ముందే బొమ్మల హెయిర్(గడ్డి) కత్తిరించి జ్యూస్ చేసి, ఇవ్వచ్చు. పిల్లలు ఈ విధానాన్ని బాగా ఆనందిస్తారు. ఈ ప్లాంట్స్‌తో మొక్కలను ఎలా పెంచవచ్చు, చెట్లు వాతావరణానికి, ఆరోగ్యానికి చేసే మేలేమిటి.. వంటివన్నీ చెప్పవచ్చు. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు’ కూడా అని వివరిస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. రేపటì పర్యావరణ సమతుల్యతకు ఈ రోజే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందుకు, పిల్లల్లో మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఎలా పెంచవచ్చో ఇంటి నుంచే మొదలుపెట్టవచ్చు. వాతావరణ కాలుష్యానికి కారకమయ్యే ప్రతీ విషయాన్ని వివరించి, మనం జాగ్రత్తపడటంతో పాటు రేపటితరాన్నీ అప్రమత్తం చేయచ్చు.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment