natural colours
-
హోలీ..హోలీరే : నేచురల్ కలర్స్, గులాల్ తయారు చేసుకోండిలా!
#Holi 2024:హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా పెద్దా అంతా రంగుల్లో మునిగి తేలే పండుగ. వసంతకాల వేడుక. పల్లె పట్నం అంతా ఎల్లలు దాటేలా సంబరాలు చేసుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా, రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా ఆలయాలుముంగిళ్లు, వాకిళ్లు రంగులతో తడిసి మురిసే సంబరం. ఇంట్లోనే సహజంగా హోలీ రంగులు వసంతం ఆగమనానికి సూచిక హోలీ. ఒకప్పుడు ప్రకృతి ప్రసాదించిన పువ్వులు, ఆకులతో తయారుచేసుకున్న రంగులతో పండుగ జరుపుకునే వారు. కాలక్రమంలో హోలీ ప్రజాదరణ పెరిగింది. సహజ రంగుల స్థానాన్ని రసాయన ఆధారిత సింథటిక్ రంగులు ఆక్రమించేశాయి. సహజ రంగులతో పోలిస్తే చౌకగా ఉంటాయి, కానీ ఆరోగ్యానికి , పర్యావరణానికి హానికరమైనవి, చర్మానికి, ఆరోగ్యానికి మంచిదని కాదని తెలిసినా జాగ్రత్త పడటం లేదు. దీనికి తోడు సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో తెలియక చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. రానున్న హోలీ సందర్భంగా మార్కెట్లో లభించే అసహజ రంగులకు బదులుగా ఇంట్లోనే సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే పింక్ గులాల్ ఇలా పింక్ గులాల్ కోసం 1-2 మీడియం బీట్రూట్లను తీసుకోవాలి. వాటిని చక్కగాతురుముకోవాలి, దీన్ని ఒక కప్పు నీళ్లుపోసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ ద్రావణాన్ని వడకట్టుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. దీనికి మొక్కజొన్న పిండి లేదా టాల్కమ్ పౌడర్ని కలుపుకోవచ్చు. పొడిగా కావాలనుకుంటే మైక్రోవేవ్‌లో వేడి చేయండి. దీన్ని బాగా కలపినా లేదా మళ్లీ గ్రైండ్ చేసినా పింక్ గులాల్ రడీ. రెడ్ కలర్ గులాల్ గులాల్ ను ఇంట్లో తయారు చేసుకోవాలంటే గులాబీ రేకులను తీసుకుని నీటిలో గంటసేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పొడిగా కావాలంటే ఎండబెట్టండి లేదా మీరు మైక్రోవేవ్లోపుంచి డ్రైగా చేసుకోవచ్చు. ఎండబెట్టిన కొన్ని ఎరుపు మందార పువ్వులను తీసుకోండి. వాటిని మెత్తగా పొడి చేయండి. దీనికి కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఎర్ర చందనం కలిపిన నీళ్లు ఎర్ర రంగులోకి మారి భలే ఆకర్షణీయంగా ఉంటుంది. దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి వాటర్ కలర్ వాడుకోవచ్చు.( కానీ ఈ నీళ్ళ మరకలు ఒక పట్టాన పోవు) పసుపు పసుపు పొడి ఇంట్లోనే పసుపు రంగును తయారు చేసకోవచ్చు. పసుపు రంగులో ఉండే శనగపిండి, పసుపు మిశ్రమంతో ఒక కలర్ సింపుల్‌గా రడీ అయిపోతుంది. దీని వల్ల ఎలాంటి నష్టం రాదు. పైగా పసుపు, శనగ పిండి సున్ని పిండిలాగా కూడా ఉపయోగపడుతుంది. వీటినే నీటిలో కలిపే తడి రంగును తయారు చేసుకోవచ్చు. అంతేకాదు పసుపు బంతి పువ్వులను తీసుకొని నీటిలో మరగించినా చక్కటి కలర్ వస్తుంది. గ్రీన్ కలర్: ఇంట్లో చాలా సులభంగా లభించే గోరింటాకు పొడితో గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. అప్పుటి కప్పుడు కడిగేసుకుంటాం కాబట్టి పెద్దగా పండదు. అలాగే ఎండ బెట్టిన గోరింట పొడిని నీటిలో కలపి ఈ వాటర్‌ను వాడుకోవచ్చు. ఇంకా పుదీనీ, బచ్చలికూర లాంటి ఆకుకూరలు వేప, తులసి లాంటి ఆకులను నీటిలో ఉడకబెట్టడం ద్వారా కూడా ఆకుపచ్చ రంగును తయారు చేసుకోవచ్చు. మెరూన్ మెరూన్, లేదా లేత పర్పుల్ రంగును సులభంగా తయారు చేయడానికి బీట్రూట్ రసాన్ని మించింది లేదు. బీట్రూట్ను మెత్తగా దంచుకొని, లేదా మిక్సీలో వేసి ఆ ముద్దను నీటిని రాత్రంతా నానబెట్టండి. దీన్ని చక్కగా వడకట్టుకొని వాడుకోవచ్చు. బ్లూ కలర్: అపరాజిత నీలి రంగు మందారం రేకుల నుండి ఇంట్లోనే చాలా సులభంగా బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు. అంతేకాదు నీలి రంగు అపరాజిత లేధా శంఖం పువ్వులు కూడా బ్లూ కలర్‌కి బాగా ఉపయోగపడతాయి. పూల రేకులను ఎండబెట్టి, దాని నుండి పొడిని తయారు చేయండి. పొడిలో కాస్త బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఈ పూలను నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లను కూడా వాడుకోవచ్చు. ఆరెంజ్: ఎండిన నారింజ తొక్కలను ఉపయోగించి నిమిషాల్లో ఆరెంజ్రంగును తయారు చేయవచ్చు. తొక్కల్ని ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత మొక్కజొన్న పిండి, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. నోట్: వీటితోపాటు, మీకు తెలిసిన, మీ అమ్మమ్మ, బామ్మలను అడిగి తెలుసుకుని మరీ అనేక సహజ రంగులకు తయారు చేసుకోవచ్చు. సహజ రంగులనే వాడదాం. మన ఆరోగ్యాన్ని , ప్రకృతిని కాపాడుకుందాం!! -
హ్యాపీ స్పేస్
యాంత్రిక ప్రయాణంలో పోటీ ఎప్పుడూ ఉండేదే! కానీ, చంటిబిడ్డ తన జీవనంలోకి వచ్చినప్పుడు అమ్మ కళ్లలో.. కలల్లో చుట్టూ జీవం ఉండాలనుకుంటుంది. ‘ఆ ప్రయాస నుంచి పుట్టుకువచ్చిందే నా ప్రకృతి ఎకో ప్లే థీమ్’ అంటోంది భార్గవి. హైదరాబాద్ అల్వాల్‌లో ఉంటున్న భార్గవి నేచురల్ కలర్స్ వాడకం గురించి అపార్ట్మెంట్ పిల్లలకు పరిచయం చేస్తూ కనిపించారు. ఆసక్తితో ఆమె చేస్తున్న పని గురించి ప్రశ్నించినప్పుడు పిల్లల కోసం తను సృష్టించిన సహజ ప్రపంచాన్ని మన ముందుంచారు.. ‘‘పుట్టింది మెదక్ జిల్లాలో. ఎమ్‌టెక్ చేసి, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో బిజీ బిజీగా మారిపోయాను. పెళ్లై, పిల్లలు జీవితంలోకి వచ్చాక నాలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. మూడేళ్ల నా కూతురు స్వతంత్రంగా ఎదగాలంటే ఏదైనా హ్యాపీ స్పేస్ ఉందా.. అని వెతికాను. కానీ, నాకేవీ సంతృప్తినివ్వలేదు. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే పిల్లల వికాసం అంత బాగుంటుంది అనే తపన నాది. దీంతో చాలారోజులు ఆలోచించాను. నా సేవింగ్స్ ఎంత ఉన్నాయో చూసుకున్నాను. చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆరేళ్లక్రితం నా ఇద్దరు పిల్లలతో ఈ థీమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాను. ఇప్పుడు ముప్పైమంది పిల్లలు ఉన్నారు. ఈ ముప్పై సంఖ్య దగ్గరే నేను కటాఫ్ పెట్టుకున్నాను. స్వలాభం ఏ మాత్రం చూసుకోని ఒక ప్రాజెక్ట్ ఇది. నాకై నేను నా పిల్లలకోసం సృష్టించుకున్న ప్రపంచం. ఈ పిల్లలు ఎదిగి, పైస్కూళ్లకు వెళ్లినప్పుడు ఎంత ప్రతిభను చూపిస్తున్నారో స్వయంగా తెలుసుకుంటున్నాను. ఈ హ్యాపీ స్పేస్‌లో పిల్లలు చేసే అద్భుతాలు కళ్లారా చూడాల్సిందే. అందమైన పెయింట్స్ వేస్తుంటారు. సీడ్ బాల్స్తయారుచేస్తారు. కాగితాలతో బొమ్మలు తయారుచేస్తారు. కూరగాయలు, పువ్వులతో రంగులు తయారుచేస్తారు. తొమ్మిదేళ్ల పాప ఫిక్షన్ స్టోరీస్ రాసి, బుక్ కూడా పబ్లిష్ చేసింది.ఆరుబయట చెట్ల కింద రాలిపడిన పూలు, విత్తనాలను ఏరుకొచ్చి, ఒక్కోదాని గురించి వివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారికి ఇష్టమైన పండ్లు, కూరగాయలతో సలాడ్స్ చేస్తుంటారు. ప్రతీదీ నిశితంగా పరిశీలించడం వల్ల వారిలో ఎంతటి అవగాహన పెరుగుతుందో స్వయంగా చూస్తుంటాం. ఇది వారి మానసిక వికాసానికి ఎంతో మేలు కలిగిస్తుంది. హ్యాండీ క్రాఫ్ట్ తయారీలో పిల్లల చూపే ప్రతిభ చాలా సృజనాత్మకంగా ఉంటుంది. పిల్లలను స్వతంత్రంగా ఎదగనిస్తే ఎన్ని అద్భుతాలు చూపుతారో స్వయంగా నేనే తెలుసుకుంటూ ఆశ్చర్యపోతుంటాను. రెండేళ్ల నుంచి పద్నాలుగేళ్ల పిల్లలు ఈ గ్రూప్‌లో ఉన్నారు. పిల్లలు వేసే ప్రశ్నలే ఈ ఎకో థీమ్‌లో పాఠ్యాంశాలు. ఎవరికీ నచ్చలేదు... మా దగ్గరకు వచ్చే పిల్లల్లో ఇప్పుడు స్పెషల్ కిడ్స్ కూడా ఉన్నారు. వారిలో ఎంత ఆర్ట్ ఉందో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాను. చాలా మంది పేరెంట్స్ ముందు నా థీమ్‌ను ఏ మాత్రం నమ్మలేదు. ‘పిల్లలకు ఈమె ఏమీ నేర్పడం లేదు. ఆడుకోవడానికి వదిలేస్తున్నారు. క్రమశిక్షణగా పిల్లలు ఒక్క దగ్గర కూర్చోవడం లేద’ని చాలా మంది తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. కోవిడ్ టైమ్‌లో అయితే అందరూ మూసేయమనే సలహాలే. మా ఇంటి నుంచి మరీ ఎక్కువగా వచ్చాయి. ‘జాబ్ మానేసి, ఇలాంటి ప్రాజెక్ట్ వద్దు, ఎలాంటి లాభాలూ ఉండవు’ అనే మాటలే నా చుట్టూ విన్నాను. కానీ, లాభం కోసం ఈ థీమ్‌ని ఎంచుకోలేదు. నా పిల్లల కోసం ఎంచుకున్నాను. నేను నమ్మిన ఈ సిస్టమ్‌పై నాకు చాలా నమ్మకం ఉంది. నా ఈ థీమ్‌కు తగిన టీచర్లను ఎంపిక చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. దీంతో నేనే కొందరిని ఎంపిక చేసుకొని, నాకు తగినవిధంగా ట్రైన్ చేసుకున్నాను. అదే పట్టుదలతో కొనసాగించాను. ఫైనాన్షియల్‌గా ఇది సక్సెస్ఫుల్ అని చెప్పలేం. కానీ, ఎప్పటికీ నిలిచే ఉండేది, నాకు సంతృప్తిగా అనిపించిన ప్రపంచం ఇదే. దానినే పిల్లలకు పరిచయం చేయాలనుకున్నాను. నా పిల్లలనూ ఈ ప్రపంచంలో పెంచడం చాలా హ్యాపీగా ఉంది. అవగాహన కార్యక్రమాలు... ఈ థీమ్ వల్ల పిల్లల్లో జరిగే మానసిక వికాసం ఎంతగా ఉంటుందో తెలియజేస్తూ కార్పోరేట్ స్కూళ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. పిల్లల్లోని స్వయంప్రతిభ ఎలా ఉంటుందో, వారిని వారిలాగే ఎలా ఎదగనివ్వాలో మా నేచర్ పిల్లలను పరిచయం చేసి, మరీ చూపుతుంటాను. రోజువారీ మనకు ఏం అవసరమో వాటన్నింటినీ స్వయంగా ఇక్కడి పిల్లలు చేస్తుంటారు. వాళ్లే వంట చేయడం, తినడం.. ఏదీ కూడా చెప్పకుండానే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ, తమ ప్రతిభను చూపుతుంటారు. లాభాపేక్ష లేకుండా చేసే ఈ పని రాబోయే తరాలకు ప్రయోజనం కలిగించడమే నాకు వచ్చే ఆదాయం’ అని చెబుతోంది భార్గవి. – నిర్మలారెడ్డి ఫొటో: మోహనాచారి -
అందుకే కాటన్ ఫ్యాబ్రిక్‌కు డిమాండ్ ఎక్కువ, వాటినుంచి కాపాడుకోవచ్చు
సహజ రంగులు అద్దుకున్న ఫ్యాబ్రిక్ స్కిన్ ఫ్రెండ్లీగా అమరిపోతుంది. ఆ దుస్తుల్లో ఎక్కడ ఉన్నా హుందాతనం కనిపిస్తుంది. అందుకే స్లో ఫ్యాషన్‌గా పేరున్న దుస్తులు ఇప్పుడు ఫాస్ట్‌గా యువతను ఆకట్టుకుంటున్నాయి. టై అండ్ డై తోనూ అట్రాక్ట్ చేస్తున్నాయి.హైదరాబాద్‌లోని తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సెల్లో సహజ రంగులతో దారాలను, ఫ్యాబ్రిక్‌ను ఎంత కలర్ఫుల్గా మార్చేయవచ్చో కళ్లకు కడుతున్నారు. పోచంపల్లి, ఇకత్, పటోల వంటి.. మన చేనేతల్లో రంగుల వాడకం తెలిసిందే. అయితే ఈ రంగులు అన్నీమొక్కల బెరడు, పండ్లతొక్కలు, ఆకులు, పువ్వులు, వేర్లు.. మొదలైనవాటితో తయారు చేసి, ఆ ప్రింట్లను దుస్తుల మీదకు తీసుకురావడం పెద్ద ప్రక్రియే. కానీ, వీటివల్ల ప్రకృతికి దగ్గరగా ఉంటాం. పైగా కాటన్ ఫ్యాబ్రిక్, సహజ రంగుల వల్ల సూర్యుని నుంచి హానికరమైన అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. డై చేసిన ఈ సహజ రంగులు ఎంతకాలమైనా మన్నికగా ఉండటంతో ఈ కాటన్ వస్త్రాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. మన దేశీయ కళను మరింత విస్తృతంగా కళ్లకు కడుతుంది. సహజరంగు దారాలు కాటన్, పట్టుదారాలను ముందుగా రంగులో ఉడికించి, తర్వాత వాటిని నీడలో ఆరబెట్టి, మగ్గం మీద నేయడానికి వాడుతారు. ఈ రంగు దారాలతో చీరలు, ఫ్యాబ్రిక్‌ను తయారుచేస్తారు. సేంద్రీయ రంగులతో తయారైన ఫ్యాబ్రిక్ రంగులు, ప్రింట్స్ కాలక్రమేణా వెలిసిపోతాయి అనుకుంటారు. కానీ, సరైన జాగ్రత్తలతో వేసిన సహజ రంగులు చాలాకాలం పాటు ఉంటాయి. ఫ్యాబ్రిక్ మన్నికను మించి కూడా రంగులు తమ సహజ గుణాన్ని చూపగలవు. ప్రక్రియలో నేర్పు అవసరం టై అండ్ డై, యార్న్ డై టెక్నిక్స్‌కు నేచరల్, సింథటిక్ రెండింటికీ వాడచ్చు. మనకు ఎన్ని రంగులు కావాలో ముందు డిసైడ్ చేసుకోవాలి. డైయింగ్ పద్ధతి పూర్తయ్యాకే మనకు కావాల్సిన డిజైన్ వస్తుంది కాబట్టి, టై చేసే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. దానిమ్మ, బంతిపువ్వు, బీట్రూట్, ఆలివ్స్.. ఇలా అన్నింటినుంచి లేత, ముదురు రంగులను సహజంగా తయారు చేసుకోవచ్చు. – డా. లక్ష్మీ పూజ శంకు అసిస్టెంట్ ప్రొఫెసర్, జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్శిటీ ►ముందు నీళ్లను బాగా మరిగించి, అందులో ఎంపిక చేసుకున్న పువ్వు లేదా బెరడు వంటివి వేసి ఉడికించాలి. పదార్థంలో ఉన్న రంగు అంతా నీళ్లలోకి వచ్చేశాక, వడకట్టుకొని, ఆ నీటిని మళ్లీ మరిగించాలి ∙ ►మిషనరీ లేదా మగ్గంపై తయారైన కొత్త క్లాత్‌లో స్టార్చ్, దుమ్ము ఉంటుంది. ఎంపిక చేసుకున్న క్లాత్‌ని ముందుగానే బాగా ఉతికి, ఆరేసి ఉంచాలి. ► డిజైన్‌ను బట్టి క్లాత్‌ను మడిచి, గట్టిగా ముడివేసి, ఉడుకుతున్న రంగులో ముంచి, అరగంట ఉంచి, తీసి, తర్వాత నీడలో ఆరబెట్టాలి. ►యార్న్ అయినా అదేవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, రంగు తయారీలో సమయం, పీహెచ్ లెవల్స్ ని పెంచడంలో మరికొన్ని పద్ధతులు ఉన్నాయి. ► వీటిని అనుసరిస్తే రంగుల్లో రకరకాల షేడ్స్ తీసుకురావచ్చు ∙నేచరల్ కలర్స్ అంత ఫాస్ట్ కలర్స్ మరేమీ ఉండవు. ► ప్రాచీన సౌందర్యం, ఆ హుందాతనం మనల్ని ఎలాగైతే ఆకట్టుకుంటుందో అంత బాగా ఈ సహజ రంగుల అందం కట్టిపడేస్తుంది. – నిర్మలారెడ్డి -
గోగుపూల హోలీ.. ప్రతీ పండుగ ప్రకృతితో మమేకమే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రతీ పండుగ ప్రకృతితో మమేకమే. కాలక్రమేణా ప్రకృతిని వీడి ఆధునికత వైపు పరుగులు తీస్తూ.. పండుగల్లోని సహజ వేడుకలకు కృత్రిమ రంగులను అద్దుతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ కొన్ని సంప్రదాయ అలవాట్లు అలాగే సజీవంగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ పండుగకు కొంతమంది నేటికీ రంగుల కోసం మోదుగు పూలనే వాడుతున్నారు. ఈ పూలు హోలీ పండుగకు ముందే అడవుల్లో చెట్ల నిండా పూలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ పూలు తెచ్చుకునే రంగులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోగుపూల రంగులు ఎక్కువమందికి చేరేలా నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి ఓ యత్నం చేశారు. మోదుగు పూలను సేకరించి.. పదిహేను రోజుల క్రితం ఉపాధి కూలీలతో స్థానిక అడవిలో మోదుగు పూలను సేకరించారు. వాటి పూల కాడలను తీసి శుభ్రపరిచారు. తేమ పోయేలా ఎండలో ఆరబెట్టారు. ఆ తర్వాత గిర్నీలో మర పట్టించి, పొడిలా మార్చారు. ఆ పొడిలో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి, ప్యాకెట్లలో నింపారు. ఇప్పటికి పదిహేను కిలోల మోతాదులో సేకరించారు. ఆ పొడిని కొద్దిగా నీటిలో వేసుకుని మరిగిస్తే ఆరెంజ్ కలర్ రంగు వస్తుంది. ఈ రంగును నీటిలో కావాల్సినంత మేర కలుపుకొని హోలీ వేడుకల్లో చల్లుకునేందుకు వాడుకోవచ్చు. జిల్లాలోని ప్రభుత్వశాఖల అధికారులకు ఉచితంగా అందజేశారు. రసాయనాలు లేని ఈ సహజ రంగులతో ఎలాంటి చర్మ, అనారోగ్య సమస్యలు తలెత్తవు. చిన్నా, పెద్దా అందరూ ఈ సహజ రంగులను వాడుకోవచ్చని చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్కెట్లోకి.. గతంలో చాలామంది ఈ మోదుగు పూలను హోలీ రంగుల్లో వాడేవారు. ప్రస్తుతం తగ్గిపోయింది. మళ్లీ అందరికీ సహజ సిద్ధ రంగును వాడేలా చేసేందుకు ఈ పొడిని తయారు చేశాం. వచ్చే ఏడాదికి మార్కెట్లో అందుబాటులో ఉండేలా చేస్తాం. దీని ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం కల్పించవచ్చు. – విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిణి. -
హోలి హోలీల రంగ హోలీ... మంచి రంగులే మంచిది చమ్మకేళీ!
హోలీ పండగరోజు ‘రంగు పడుద్ది’ అని అరవడం, రంగు ఇష్టంగా పడిపించుకోవడం బాగానే ఉంటుంది గానీ అది ఏ ‘రంగు’ అనేది ముఖ్యం. ఎందుకంటే అన్ని రంగులు ఒక్కటి కాదు! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి రోజు రంగుల రూపంలో చెడు రసాయనాలు చేటు చేస్తున్నాయి. చర్మం, కళ్లు...మొదలైన వాటికి హాని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, థానే జిల్లాలోని ముర్బాద్, సరగామ్ ప్రాంతాలకు చెందిన ఆదివాసీల కోసం అగ్రికల్చరల్ సైన్స్డిపార్ట్మెంట్ వర్క్‌షాప్ నిర్వహించింది. హోలీ సందర్భంగా వాడే రంగులలోని కెమికల్స్ వల్ల జరిగే హాని గురించి వివరించారు. ‘అలా అని పండగ సంతోషం దూరం చేసుకోనక్కర్లేదు’ అని చెబుతూ... మందారం, టొమాటో, క్యారట్లతో ఎరుపు రంగు, గోరింటాకుతో పచ్చని రంగు, బీట్రూట్తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగు... ఎలా తయారు చేయాలో నేర్పించారు. మరిచిపోయిన మోదుగుపూల రసాన్ని మళ్లీ రంగం మీదికి తీసుకువచ్చారు. ‘మీ ఇంటి దగ్గర ఏ చెట్టు ఉంది?’ అని అడిగారు. చింతచెట్టు, నిమ్మచెట్టు, నీలగిరి చెట్టు... ఇలా రకరకాల సమాధానాలు వినిపించాయి. ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవడం, ఆ రంగులను అందంగా ఎలా ప్యాక్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి?.. మొదలైన విషయాలు నేర్పించారు. దీనిద్వారా వారికి ఉపాధి అవకాశం దొరికింది. ‘మేము పచ్చటి చెట్ల మధ్య నివసిస్తున్నాం. అయితే హోలీ పండగ రాగానే రంగుల కోసం పట్టణం వెళ్లేవాళ్లం. ఎదుటి వ్యక్తిని ఎంతగా రంగుల్లో ముంచెత్తితే పండగ అంత ఘనంగా జరిగింది అనుకునేవాళ్లం. ఇక్కడికి వచ్చిన తరువాత నా దృష్టి మారింది. రసాయన రంగులను ఉపయోగించడం వల్ల జరిగే హాని గురించి తెలుసుకున్నాను. నేను ఇక్కడ విన్న విషయాలను మా కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వాళ్లకు కూడా చెబుతాను’ అంటుంది వర్క్‌షాప్‌కు హాజరైన శాంతి పవార్. ‘ఈసారి పండగ కొత్తగా జరుపుకుందాం. ఆరోగ్యకరంగా జరుపుకుందాం’ అనే నినాదంతో ముందుకు కదిలారు వర్క్‌షాప్‌కు హాజరైన మహిళలందరూ తాము తయారు చేసిన సహజమైన రంగులను ఇంటింటికి పరిచయం చేస్తున్నారు. వర్క్‌షాప్ లో విన్న విషయాలను చెబుతున్నారు. తాము తయారు చేసిన రంగులు అమ్ముడుపోతున్నాయనే సంతోషం కంటే, తమ ద్వారా మంచి సందేశం చేరుతుందనే తృప్తి వారి కళ్లలో కలర్ఫుల్గా కనిపిస్తుంది. -
సహజరంగులనే వాడాలంట..
సాక్షి, సిటీబ్యూరో: వినాయక ప్రతిమలు తయారు చేస్తున్న కళాకారులు తాము తయారుచేసే గణపతి ప్రతిమలకు సహజరంగులనే వినియోగించాలని పీసీబీ శాస్త్రవేత్తలు సూచించారు. ఈమేరకు పలువురు కళాకారులకు ఆదివారం హయత్‌నగర్‌లో నిర్వహించిన శిబిరంలో పీసీబీ శాస్త్రవేత్తలు రవీందర్ తదితరులు సహజరంగుల వినియోగంపై అవగాహన కల్పించారు.