హోలీ సంబరాలు, సహజ రంగులనే వాడదాం!
ఇంట్లోనే పింక్, రెడ్ గులాల్ ఈజీగా తయారు చేసుకోవచ్చు
#Holi 2024:హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా పెద్దా అంతా రంగుల్లో మునిగి తేలే పండుగ. వసంతకాల వేడుక. పల్లె పట్నం అంతా ఎల్లలు దాటేలా సంబరాలు చేసుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా, రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా ఆలయాలుముంగిళ్లు, వాకిళ్లు రంగులతో తడిసి మురిసే సంబరం.
ఇంట్లోనే సహజంగా హోలీ రంగులు
వసంతం ఆగమనానికి సూచిక హోలీ. ఒకప్పుడు ప్రకృతి ప్రసాదించిన పువ్వులు, ఆకులతో తయారుచేసుకున్న రంగులతో పండుగ జరుపుకునే వారు. కాలక్రమంలో హోలీ ప్రజాదరణ పెరిగింది. సహజ రంగుల స్థానాన్ని రసాయన ఆధారిత సింథటిక్ రంగులు ఆక్రమించేశాయి. సహజ రంగులతో పోలిస్తే చౌకగా ఉంటాయి, కానీ ఆరోగ్యానికి , పర్యావరణానికి హానికరమైనవి, చర్మానికి, ఆరోగ్యానికి మంచిదని కాదని తెలిసినా జాగ్రత్త పడటం లేదు. దీనికి తోడు సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో తెలియక చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. రానున్న హోలీ సందర్భంగా మార్కెట్‌లో లభించే అసహజ రంగులకు బదులుగా ఇంట్లోనే సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ఇంట్లోనే పింక్ గులాల్ ఇలా
పింక్ గులాల్ కోసం 1-2 మీడియం బీట్‌రూట్‌లను తీసుకోవాలి. వాటిని చక్కగాతురుముకోవాలి, దీన్ని ఒక కప్పు నీళ్లుపోసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ ద్రావణాన్ని వడకట్టుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. దీనికి మొక్కజొన్న పిండి లేదా టాల్కమ్ పౌడర్‌ని కలుపుకోవచ్చు. పొడిగా కావాలనుకుంటే మైక్రోవేవ్‌లో వేడి చేయండి. దీన్ని బాగా కలపినా లేదా మళ్లీ గ్రైండ్ చేసినా పింక్ గులాల్ రడీ.
రెడ్ కలర్ గులాల్
గులాల్ ను ఇంట్లో తయారు చేసుకోవాలంటే గులాబీ రేకులను తీసుకుని నీటిలో గంటసేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పొడిగా కావాలంటే ఎండబెట్టండి లేదా మీరు మైక్రోవేవ్‌లోపుంచి డ్రైగా చేసుకోవచ్చు.
ఎండబెట్టిన కొన్ని ఎరుపు మందార పువ్వులను తీసుకోండి. వాటిని మెత్తగా పొడి చేయండి. దీనికి కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఎర్ర చందనం కలిపిన నీళ్లు ఎర్ర రంగులోకి మారి భలే ఆకర్షణీయంగా ఉంటుంది. దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి వాటర్ కలర్ వాడుకోవచ్చు.( కానీ ఈ నీళ్ళ మరకలు ఒక పట్టాన పోవు)
పసుపు
పసుపు పొడి ఇంట్లోనే పసుపు రంగును తయారు చేసకోవచ్చు. పసుపు రంగులో ఉండే శనగపిండి, పసుపు మిశ్రమంతో ఒక కలర్ సింపుల్‌గా రడీ అయిపోతుంది. దీని వల్ల ఎలాంటి నష్టం రాదు. పైగా పసుపు, శనగ పిండి సున్ని పిండిలాగా కూడా ఉపయోగపడుతుంది. వీటినే నీటిలో కలిపే తడి రంగును తయారు చేసుకోవచ్చు. అంతేకాదు పసుపు బంతి పువ్వులను తీసుకొని నీటిలో మరగించినా చక్కటి కలర్ వస్తుంది.
గ్రీన్ కలర్:
ఇంట్లో చాలా సులభంగా లభించే గోరింటాకు పొడితో గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. అప్పుటి కప్పుడు కడిగేసుకుంటాం కాబట్టి పెద్దగా పండదు. అలాగే ఎండ బెట్టిన గోరింట పొడిని నీటిలో కలపి ఈ వాటర్‌ను వాడుకోవచ్చు. ఇంకా పుదీనీ, బచ్చలికూర లాంటి ఆకుకూరలు వేప, తులసి లాంటి ఆకులను నీటిలో ఉడకబెట్టడం ద్వారా కూడా ఆకుపచ్చ రంగును తయారు చేసుకోవచ్చు.
మెరూన్
మెరూన్, లేదా లేత పర్పుల్ రంగును సులభంగా తయారు చేయడానికి బీట్‌రూట్ రసాన్ని మించింది లేదు. బీట్‌రూట్‌ను మెత్తగా దంచుకొని, లేదా మిక్సీలో వేసి ఆ ముద్దను నీటిని రాత్రంతా నానబెట్టండి. దీన్ని చక్కగా వడకట్టుకొని వాడుకోవచ్చు.
బ్లూ కలర్: అపరాజిత
నీలి రంగు మందారం రేకుల నుండి ఇంట్లోనే చాలా సులభంగా బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు. అంతేకాదు నీలి రంగు అపరాజిత లేధా శంఖం పువ్వులు కూడా బ్లూ కలర్‌కి బాగా ఉపయోగపడతాయి. పూల రేకులను ఎండబెట్టి, దాని నుండి పొడిని తయారు చేయండి. పొడిలో కాస్త బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఈ పూలను నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లను కూడా వాడుకోవచ్చు.
ఆరెంజ్: ఎండిన నారింజ తొక్కలను ఉపయోగించి నిమిషాల్లో ఆరెంజ్రంగును తయారు చేయవచ్చు. తొక్కల్ని ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత మొక్కజొన్న పిండి, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి.
నోట్: వీటితోపాటు, మీకు తెలిసిన, మీ అమ్మమ్మ, బామ్మలను అడిగి తెలుసుకుని మరీ అనేక సహజ రంగులకు తయారు చేసుకోవచ్చు. సహజ రంగులనే వాడదాం. మన ఆరోగ్యాన్ని , ప్రకృతిని కాపాడుకుందాం!!
Comments
Please login to add a commentAdd a comment