హోలీ పండగరోజు ‘రంగు పడుద్ది’ అని అరవడం, రంగు ఇష్టంగా పడిపించుకోవడం బాగానే ఉంటుంది గానీ అది ఏ ‘రంగు’ అనేది ముఖ్యం. ఎందుకంటే అన్ని రంగులు ఒక్కటి కాదు! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి రోజు రంగుల రూపంలో చెడు రసాయనాలు చేటు చేస్తున్నాయి. చర్మం, కళ్లు...మొదలైన వాటికి హాని చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, థానే జిల్లాలోని ముర్‌బాద్, సరగామ్ ప్రాంతాలకు చెందిన ఆదివాసీల కోసం అగ్రికల్చరల్ సైన్స్‌డిపార్ట్‌మెంట్ వర్క్‌షాప్ నిర్వహించింది. హోలీ సందర్భంగా వాడే రంగులలోని కెమికల్స్ వల్ల జరిగే హాని గురించి వివరించారు.
‘అలా అని పండగ సంతోషం దూరం చేసుకోనక్కర్లేదు’ అని చెబుతూ... మందారం, టొమాటో, క్యారట్‌లతో ఎరుపు రంగు, గోరింటాకుతో పచ్చని రంగు, బీట్‌రూట్‌తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగు... ఎలా తయారు చేయాలో నేర్పించారు. మరిచిపోయిన మోదుగుపూల రసాన్ని మళ్లీ రంగం మీదికి తీసుకువచ్చారు.
‘మీ ఇంటి దగ్గర ఏ చెట్టు ఉంది?’ అని అడిగారు.
చింతచెట్టు, నిమ్మచెట్టు, నీలగిరి చెట్టు... ఇలా రకరకాల సమాధానాలు వినిపించాయి.
ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవడం, ఆ రంగులను అందంగా ఎలా ప్యాక్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి?.. మొదలైన విషయాలు నేర్పించారు. దీనిద్వారా వారికి ఉపాధి అవకాశం దొరికింది.
‘మేము పచ్చటి చెట్ల మధ్య నివసిస్తున్నాం. అయితే హోలీ పండగ రాగానే రంగుల కోసం పట్టణం వెళ్లేవాళ్లం. ఎదుటి వ్యక్తిని ఎంతగా రంగుల్లో ముంచెత్తితే పండగ అంత ఘనంగా జరిగింది అనుకునేవాళ్లం. ఇక్కడికి వచ్చిన తరువాత నా దృష్టి మారింది. రసాయన రంగులను ఉపయోగించడం వల్ల జరిగే హాని గురించి తెలుసుకున్నాను. నేను ఇక్కడ విన్న విషయాలను మా కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వాళ్లకు కూడా చెబుతాను’ అంటుంది వర్క్‌షాప్‌కు హాజరైన శాంతి పవార్.
‘ఈసారి పండగ కొత్తగా జరుపుకుందాం. ఆరోగ్యకరంగా జరుపుకుందాం’ అనే నినాదంతో ముందుకు కదిలారు వర్క్‌షాప్‌కు హాజరైన మహిళలందరూ తాము తయారు చేసిన సహజమైన రంగులను ఇంటింటికి పరిచయం చేస్తున్నారు. వర్క్‌షాప్ లో విన్న విషయాలను చెబుతున్నారు.
తాము తయారు చేసిన రంగులు అమ్ముడుపోతున్నాయనే సంతోషం కంటే, తమ ద్వారా మంచి సందేశం చేరుతుందనే తృప్తి వారి కళ్లలో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment