సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రతీ పండుగ ప్రకృతితో మమేకమే. కాలక్రమేణా ప్రకృతిని వీడి ఆధునికత వైపు పరుగులు తీస్తూ.. పండుగల్లోని సహజ వేడుకలకు కృత్రిమ రంగులను అద్దుతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ కొన్ని సంప్రదాయ అలవాట్లు అలాగే సజీవంగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ పండుగకు కొంతమంది నేటికీ రంగుల కోసం మోదుగు పూలనే వాడుతున్నారు. ఈ పూలు హోలీ పండుగకు ముందే అడవుల్లో చెట్ల నిండా పూలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ పూలు తెచ్చుకునే రంగులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోగుపూల రంగులు ఎక్కువమందికి చేరేలా నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి ఓ యత్నం చేశారు.
మోదుగు పూలను సేకరించి..
పదిహేను రోజుల క్రితం ఉపాధి కూలీలతో స్థానిక అడవిలో మోదుగు పూలను సేకరించారు. వాటి పూల కాడలను తీసి శుభ్రపరిచారు. తేమ పోయేలా ఎండలో ఆరబెట్టారు. ఆ తర్వాత గిర్నీలో మర పట్టించి, పొడిలా మార్చారు. ఆ పొడిలో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి, ప్యాకెట్లలో నింపారు. ఇప్పటికి పదిహేను కిలోల మోతాదులో సేకరించారు. ఆ పొడిని కొద్దిగా నీటిలో వేసుకుని మరిగిస్తే ఆరెంజ్ కలర్ రంగు వస్తుంది. ఈ రంగును నీటిలో కావాల్సినంత మేర కలుపుకొని హోలీ వేడుకల్లో చల్లుకునేందుకు వాడుకోవచ్చు. జిల్లాలోని ప్రభుత్వశాఖల అధికారులకు ఉచితంగా అందజేశారు. రసాయనాలు లేని ఈ సహజ రంగులతో ఎలాంటి చర్మ, అనారోగ్య సమస్యలు తలెత్తవు. చిన్నా, పెద్దా అందరూ ఈ సహజ రంగులను వాడుకోవచ్చని చెబుతున్నారు.
వచ్చే ఏడాది మార్కెట్‌లోకి..
గతంలో చాలామంది ఈ మోదుగు పూలను హోలీ రంగుల్లో వాడేవారు. ప్రస్తుతం తగ్గిపోయింది. మళ్లీ అందరికీ సహజ సిద్ధ రంగును వాడేలా చేసేందుకు ఈ పొడిని తయారు చేశాం. వచ్చే ఏడాదికి మార్కెట్‌లో అందుబాటులో ఉండేలా చేస్తాం. దీని ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం కల్పించవచ్చు.
– విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిణి.
Comments
Please login to add a commentAdd a comment