రంగుల కళ
మీరే పారిశ్రామికవేత్త
రైతు పండించిన పత్తి నుంచి దారం తీయడం ఓ పరిశ్రమ. ఆ దారానికి వస్త్ర రూపాన్నిచ్చేది మరో పరిశ్రమ. ఆ వస్త్రాన్ని అందమైన చీరగా, చుడీదార్ మెటీరియల్‌గా దిద్దేది మరో పరిశ్రమ. అందమైన డిజైన్లను అచ్చుల్లో ఇమిడ్చి అలవోకగా అద్దేదే బ్లాక్ ప్రింటింగ్ పరిశ్రమ!
రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి
ఫొటో: శివమల్లాల
బ్లాక్ ప్రింటింగ్ యూనిట్ నిర్వహణలో రాణించాలంటే సృజనాత్మకతతో కొత్త డిజైన్లకు రూపకల్పన చేయగలగాలి. డిజైన్లలో ప్రయోగాలు చేస్తుండాలి. ఈ యూనిట్ పెట్టడానికి కనీసం వెయ్యి చదరపు అడుగుల స్థలం కావాలి. అందులో 500 అడుగుల గది, 500 అడుగుల ఎండ తగిలే ఖాళీ స్థలం ఉండాలి.
కావల్సిన వస్తువులు: ప్రింటింగ్ టేబుల్ -1 (ఐదున్నర మీటర్ల పొడవు, 50 అంగుళాల వెడల్పు ఉండాలి); ట్రాలీలు - 2; ట్రేలు - 3; తాపీలు - 6; చింతాలు - 6; రెగ్జిన్ షీట్లు - 6 (ఒక్కొక్కటి అర మీటరు); క్లిప్పులు - 12; గుండు సూదులు.
డై చేయడానికి... ఇరవై లీటర్ల నీరు పట్టే కడాయి (స్వీట్ షాపుల్లో వాడుతారు)-1; గ్యాస్ స్టవ్ - 1 (కమర్షియల్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలి); తొట్టెలు - 4; చిన్న బకెట్లు - 6; మీడియం సైజు బకెట్లు -4 స్టీలు గిన్నెలు - ఐదులీటర్లవి 2, రెండు లీటర్లవి 2 ఇదంతా పరిశ్రమ ఏర్పాటు కోసం ఒకసారి పెట్టుబడి. ఇందుకు కనీస అంచనా వ్యయం డెబ్భై వేల రూపాయలు.
రా మెటీరియల్ కోసం... మూడు నెలల పాటు ఉత్పత్తి కొనసాగడానికి తగినంత వస్త్రాన్ని, రంగులను కొనాల్సి ఉంటుంది. ముడి సరుకులో మనం ఎంపిక చేసుకునే క్వాలిటీని బట్టి రెండు నుంచి మూడు లక్షల రూపాయలవుతుంది. ఒక టేబుల్‌తో రోజుకు పది చీరలు లేదా డ్రెస్సుల అద్దకం చేయవచ్చు. ఆదివారాలు, సెలవులు పోను సరాసరిన నెలకు 25 రోజులు పనిచేస్తే 250 పీసులు (చీరలు, చుడీదార్లు కలిపి) తయారవుతాయి. ఒక చీర విత్ బ్లౌజ్‌కు దాదాపుగా ఆరున్నర మీటర్ల వస్త్రం కావాలి. చుడీదార్‌కూ దాదాపుగా అంతే. రంగులు కానీ, వస్త్రం కానీ టోకుగా తీసుకోవడమే మంచిది. ఈ ఖర్చులతోపాటు గది అద్దె, కరెంటు, ఇద్దరు సహాయకుల వేతనాలు కూడా కలుపుకోవాలి.
శిక్షణ, రిజిస్ట్రేషన్ కోసం: 1800 123 2388 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించండి.
‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో...
‘ఆంటీ, నాకు పెళ్లి కుదిరింది’
చిన్నప్పటి నుంచి ఎంబ్రాయిడరీ అంటే ఇష్టం. స్కూల్లో కుట్లు, అల్లికల పోటీల్లో నాకే బహుమతులు వచ్చేవి. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చాను. యాభై వేల పెట్టుబడితో ఒక టేబుల్, నలుగురు వర్కర్లు, ఇద్దరు సహాయకులతో బ్లాక్ ప్రింటింగ్ యూనిట్ పెట్టాను. ప్రస్తుతం నెలకు లక్షరూపాయలు ఖర్చవుతోంది. మొదట్లో కాటన్‌తో మొదలు పెట్టాను. ఇప్పుడు క్రేప్ వంటి ఇతర మెటీరియల్స్ మీద కూడా ప్రింట్స్ వేస్తున్నాను.
ఒక ప్రైమ్ కలర్‌లో మరో పాస్టల్ కలర్‌ని ఎంత మోతాదులో కలిపితే ఎలాంటి షేడ్ వస్తుందనే విషయంలో ప్రయోగాలు చేస్తుంటాను. ఏ రెండు రంగుల కలయికలో చీర కానీ, చుడీదార్ కానీ ఆకర్షణీయంగా కనిపిస్తుందోనని ఎప్పటికప్పుడు కాంబినేషన్స్ మారుస్తుంటాను. నాకేమో ఇద్దరూ అబ్బాయిలే. డ్రెస్సులు డిజైన్ చేద్దామంటే అమ్మాయి లేదు. ఈ పరిశ్రమతో వేలాది మంది అమ్మాయిలకు డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. పెళ్లి కుదిరిన అమ్మాయిలు వచ్చి ‘ఆంటీ! మీకెలా బావుంటుందనిపిస్తే అలా డిజైన్ చేసివ్వండి’ అంటుంటారు.
- పి.లక్ష్మీస్వరూప (పై ఫొటో మధ్యలో) వసుంధర బొటిక్, ఈఎస్‌ఐ, హైదరాబాద్
9703444386