
దళిత పారిశ్రామిక వేత్తల ఆగ్రహంతో దిగొచ్చిన సర్కారు
కోట్లు ఖర్చుపెట్టి భారీ ప్రచారంతో ఆరు పాలసీలు విడుదల చేసిన కూటమి సర్కారు
వాటిలో భారీ పరిశ్రమలు తప్ప ఎంఎస్‌ఎంఈ, ఎస్సీ, ఎస్టీలను విస్మరించిన ప్రభుత్వం
పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సవరణ బాట పట్టిన కూటమి సర్కారు
పారిశ్రామిక పాలసీల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రోత్సాహకాలు పునరుద్ధరణ
ఎంఎస్‌ఎంఈ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలను సవరిస్తూ జీవోలు
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యం. కొత్తగా ప్రవేశపెట్టిన ఆరు పాలసీలతో రూ.30 లక్షల కోట్లపెట్టుబడులు.. 20 లక్షల ఉద్యోగాలంటూ భారీ ప్రచారంతో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన పారిశ్రామిక పాలసీల్లో డొల్లతనం బయటపడింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ), ఎస్సీ, ఎస్టీ వర్గాలను పట్టించుకోకుండా కేవలం భారీ కార్పొరేట్లకు అనుగుణంగా రూపొందించిన పారిశ్రామిక పాలసీలపై దళిత వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడంతో కూటమి సర్కారు దిద్దుబాటు చర్యలు చేపడుతోంది.
గత ప్రభుత్వంలో ఎంఎస్‌ఎంఈలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా రాయితీలు కల్పిస్తే.. కూటమి సర్కారు రూ.కోట్లు ఖర్చుపెట్టి కన్సల్టెన్సీలతో తయారు చేసిన పాలసీల్లో వీటికి మంగళం పాడింది. గత ప్రభుత్వం ‘వైఎస్సార్ బడుగు వికాసం’ పేరిట ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక పాలసీ విడుదల చేస్తే, కూటమి ప్రభుత్వం విడుదల చేసిన 32 పేజీల పారిశ్రామిక పాలసీల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక ప్రయోజనాల గురించి కేవలం ఒక చిన్న లైన్‌తో సరిపెట్టారు.
దీనిపై దళిత పారిశ్రామిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం పాలసీల్లో సవరణలు చేస్తూ కొత్త జీవోలను జారీ చేస్తోంది. తాజాగా, ఎంఎస్‌ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0, ఏపీ సస్టెయినబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0లో పలు సవరణలు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ సోమవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రోత్సాహకాలు పునరుద్ధరణ..
ఎంఎస్‌ఎంఈ 4.0 పాలసీలో ఎస్సీ, ఎస్టీలకు ప్రోత్సాహకాలను ఎత్తివేశారు. ఇప్పుడు వాటిని తిరిగి పునరుద్ధరిస్తూ కొత్తగా అదనంగా రాయితీలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడంపై దళిత పారిశ్రామిక సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తాజాగా ఈ మూడు పాలసీల్లో ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ యూనిట్ ధరపై రూపాయి సబ్సిడీతోపాటు విద్యుత్ డ్యూటీపై 5 ఏళ్లపాటు 50 శాతం సబ్సిడీని కల్పిస్తూ సవరణ చేశారు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసిన పారిశ్రామికపార్కుల్లో ఎస్సీ, ఎస్టీలు కొనుగోలు చేసే భూమిధరపై 75 శాతం రిబేటు గరిష్టంగా రూ.25 లక్షల వరకు ఇవ్వనున్నారు. ఈ రాయితీలు కేవలం కొత్తగా యూనిట్లు ఏర్పాటు చేస్తున్న వారికే తప్ప విస్తరణ చేపట్టే యూనిట్లకు వర్తించవని పాలసీలో స్పష్టంగా పేర్కొన్నారు. జీఎస్టీపై 5 ఏళ్లపాటు 100 శాతం రాయితీ, సూక్ష్మ, చిన్న పరిశ్రమల పెట్టుబడిలో 45 శాతం, అదే మధ్యతరహా యూనిట్ అయితే 35 శాతం క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వనుంది. ఆధునీకరణకు చేసే వ్యయాలపై 20 శాతం నుంచి 40 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment