నిదానంగా కదులుతూ... ముక్కుసూటిగా మాట్లాడుతూ... విలువలను ఎత్తిపడుతూ కూడా అన్యులకు అసాధ్యమైన సమున్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆరు దశాబ్దాల తన ఆచరణతో దేశానికి చాటిచెప్పిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన అక్షరాలా రత్నం. సార్థక నామధేయుడు. చెదరని వినమ్రత, సడలని దృఢ సంకల్పం, లక్ష్యసాధనకు ఎంత దూరమైనా వెళ్లే లక్షణం... విశాల టాటా సామ్రాజ్యంలో ఆయనను విలక్షణ వ్యక్తిగా నిల బెట్టాయి.
కనుకనే మూడు దశాబ్దాల పాటు ఆ సామ్రాజ్యానికి ఆయన అక్షరాలా చక్రవర్తిగానే వ్యవహరించారు. నిజమే... ఆయన 1962లో సాధారణ ఉద్యోగిగా చేరిననాటికే దేశంలో అదొక అత్యున్నత శ్రేణి సంస్థ కావొచ్చుగాక. పైగా సంస్థ సారథులకు ఆయన అతి దగ్గరివాడు, బంధు వర్గంలో ఒకడు కూడా! కానీ ఆయన ఎదుగుదలకు తోడ్పడినవి అవి కాదు. ఆయన అంకితభావం, దీక్షాదక్షతలు, నిరంతర తపన ఆయనను అంచెలంచెలుగా పైపైకి చేర్చాయి.
పేరుకు ఒక సంఘటిత సంస్థే అయినా, అప్పటికే లక్షలమంది సిబ్బందికి చల్లని నీడనిచ్చే కల్పవృక్షంగా పేరుతెచ్చుకున్నా... టాటాల సామ్రాజ్యం విభిన్న సంస్థల సమాహారం మాత్రమే! అందులో సమష్టితత్వం, దిశ, దశా నిర్దేశించే ఉమ్మడి తాత్విక భూమిక శూన్యం. జమ్‌షెడ్జీ టాటా, జేఆర్‌డీ టాటా వంటివారు నేతృత్వం వహించిన ఆ సంస్థలో నాయకత్వ స్థానం దక్కాలంటే అడుగడుగునా అవరోధాలు తప్పలేదు. నెత్తురు చిందకపోవచ్చు... గాయాల జాడ లేకపోవచ్చు, కానీ రోమన్ సామ్రాజ్యకాలం నాటి కలోసియంలను తలపించే బోర్డు రూంలో తన ఆలోచనలనూ, తన భావనలనూ బలంగా వినిపించి ప్రత్యర్థుల వాదనలను పూర్వపక్షం చేయటం మాటలు కాదు.
తన ప్రతి పలుకూ, ప్రతి వివరణా నిశితంగా గమనించే, ప్రశ్నించే ఆ బోర్డు రూంలో గెలవటం సాధారణం కానే కాదు. కానీ రతన్ అవన్నీ అవలీలగా చేయగలిగారు. నిష్క్రమిస్తున్న చైర్మన్‌జేఆర్‌డీ టాటా ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నా అప్పటికే భిన్న సంస్థలకు సారథులైనవారు సామాన్యులు కాదు. అప్పటికింకా టిస్కోగానే ఉన్న టాటా స్టీల్‌కు రూసీ మోదీ సారథి. పారిశ్రామిక రంగంలో ఆయన మోత మోగిస్తున్నాడు. జమ్‌షెడ్‌ఫూర్‌లో కొలువుదీరిన ఆ సంస్థకాయన మకుటంలేని మహారాజు. అజిత్ కేర్కర్ ఇండియన్ హోటల్స్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు.
దర్బారీ సేల్ టాటా కెమికల్స్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వీళ్లెవరూ రతన్ టాటాను సీరియస్‌గా తీసుకోలేదు. అతన్ని అవలీలగా అధిగమించవచ్చనుకున్నారు. రతన్ తన పేరులో చివరున్నరెండక్షరాల పుణ్యమా అని ఇంత దూరం వచ్చాడు తప్ప ‘సరుకు’ లేదనుకున్నారు. ఆయన రాకపై ఆలోచించటం సమయాన్ని వృథా చేసుకోవడమే అనుకున్నారు. కానీ రతన్ పరిశీలనాశక్తి అమోఘ మైనది, అనితర సాధ్యమైనది. ఈ మహాసామ్రాజ్యంలో ఏం జరుగుతున్నదో, లోపాలేమిటో అచిర కాలంలోనే పసిగట్టాడు.
తళుకుబెళుకులకు తక్కువేం లేదు. మదుపుపరులకు ఎప్పటికప్పుడు లాభాల పంటా పండుతోంది. కానీ అట్టడుగున అవాంఛనీయమైన పోకడలు కనబడుతున్నాయి. వాటిని చక్కదిద్దితేసంస్థను మరిన్ని రెట్లు పెంచి ఘనతరమైనదిగా తీర్చిదిద్దటం అసాధ్యమేమీ కాదని ఆయన నిర్ణయించుకున్నాడు. 1991 నాటికే దేశంలో అడుగుపెట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పాత పద్ధతిలోనే టిస్కోను కొనసాగిస్తే త్వరలోనే అది గ్రూపు చేజారటం ఖాయమన్న నిర్ణయానికొచ్చాడు.
జేఆర్‌డీ మంచితనమో, గమనించలేని తత్వమో గానీ... టాటా స్టీల్‌లో అప్పటికి టాటాలకున్న ప్రమోటర్ వాటా కేవలం అయిదు శాతం మాత్రమే. ఇదే కొనసాగితే ఏదోనాటికి అది ఎవరి చేతుల్లోకైనా పోవచ్చని రతన్ గ్రహించారు. అదొక్కటే కాదు... గ్రూపు సంస్థల్లో ఏ ఒక్కటీ చేజారకుండా ప్రమోటర్ వాటాను గణనీయంగా పెంచారు. సొంత సంస్థలను పదిలపరచుకోవటమే కాదు, ఖండాంతర ఆంగ్లో–డచ్ స్టీల్ సంస్థ కోరస్‌ను వశపరుచుకున్నారు. ఒకప్పుడు తనకు అవరోధంగా నిలిచిన అమెరికన్ దిగ్గజ సంస్థ ఫోర్డ్ నుంచి జాగ్వార్ ల్యాండ్‌రోవర్‌ను టాటాల తీరానికి చేర్చారు.
వర్తమానంలో పారిశ్రామికవేత్తల ఎదుగుదల ఎలా సాధ్యమవుతున్నదో బాహాటంగానే కనబడుతోంది. కానీ రతన్ టాటా ఇందుకు భిన్నం. టాటా సంస్థలపై మచ్చపడకుండా, వక్రమార్గాల జోలికిపోకుండా నిదానంగా తన ప్రస్థానం సాగించారు. ఆయన పట్టిందల్లా బంగారమేనని చెప్పడానికి లేదు. కోరస్ టేకోవర్ అయినా, నానో కారు ఉత్పత్తి ఉబలాటమైనా, టాటా గ్రూప్ సంస్థల చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ ఆగమన, నిష్క్రమణల్లో అయినా రతన్ వైఫల్యాలు స్పష్టంగా కనబడతాయి. అందుకాయన విమర్శలను ఎదుర్కొనక తప్పలేదు. అలాగే టాటా స్టీల్‌ను దాదాపు 1,200 కోట్ల డాలర్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దినప్పుడూ, దేశీయ విద్యుత్ ఆధారిత వాహన రంగంలో టాటా మోటార్స్‌ను మార్కెట్ లీడర్‌గా ముందుకు ఉరికించినప్పుడూ ఆయన గర్వం తలకెక్కించుకోలేదు.
ఇవాళ్టి రోజున బహుళజాతి సంస్థల సమాహారంగా ఖండాంతరాల్లో వెలుగు లీనుతున్న టాటా గ్రూప్ నిరుటి రెవెన్యూ 16,500 కోట్ల డాలర్లు. ఆయన వ్యక్తిగత ఆదాయమే కొన్ని వందల కోట్లు. అయినా చివరి వరకూ అతి సాధారణ జీవితం గడిపి, అసహాయులకు అండదండలందించి జీవితాన్ని ధన్యం చేసుకున్న రతన్‌కు కొందరు కోరుకుంటున్నట్టు ‘భారతరత్న’ ప్రకటిస్తే అది ఆ అత్యున్నత పురస్కారానికి మరింత వన్నె తెస్తుంది. ఆ మహామనీషికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తున్నది.
Comments
Please login to add a commentAdd a comment