శిల్పగురు అవార్డుకు ఎంపికైన మామిడి పండు
పెడన: కలంకారీ పరిశ్రమకు కేరాఫ్‌గా కృష్ణాజిల్లా పెడన చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఆ పరిశ్రమకు వెన్నెముకగా నిలిచిన కొండ్ర బ్రదర్స్ గంగాధర్, నరసయ్య తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ధిల్‌గల్ నుంచి వలస వచ్చి పెడనలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని కలంకారీకి ఊపిరి పోశారు. జాతీయస్థాయి అవార్డులెన్నో దక్కించుకున్న కొండ్ర బ్రదర్స్ ప్రస్థానం సాగిందిలా..
పెదనాన్న నుంచి వారసత్వంగా..
పెదనాన్న నుంచి కలంకారీ వృత్తిలో మెళకువలు నేర్చుకున్న కొండ్ర బ్రదర్స్ తొలుత హైదరాబాద్‌లో హ్యాండ్ బ్లాకుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అయితే వీరికి పెడన నుంచి ఎక్కువగా గిరాకీ వస్తుండడంతో అక్కడే పరిశ్రమ పెట్టుకుంటే బాగుంటుందని భావించి.. 1986–87లో పెడనలో కళంకారీ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పలు రకాల డిజైన్లతో బ్లాకులు తయారు చేస్తూ దేశ, విదేశీయులను ఆకట్టుకుంటున్నారు. ‘కలంకారి పండు’ డిజైన్‌కు 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా జాతీయస్థాయి అవార్డులను పొందారు. అలాగే మామిడి పండు, ఆర్చి, స్తంభం వంటి బ్లాకులకు కూడా మెరిట్ అవార్డులు దక్కాయి. 1998 నుంచి 2001 వరకు రూపొందించిన డిజైన్ బ్లాకులకు గానూ 2005లో అవార్డులు అందుకున్నారు. వీరి కళను గుర్తించిన కేంద్ర ప్రభుత్వ డెవలప్‌మెంటు హ్యాండీ క్రాఫ్ట్ కమిషనరేట్ శిక్షణ కేంద్రాన్ని 2002లో ఏర్పాటు చేసింది. ఐదారు సంవత్సరాల పాటు సుమారు వంద మంది వరకు కొండ్ర బ్రదర్స్ శిక్షణ ఇచ్చారు.
అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న నరసయ్య
డిజైన్ల తయారీ ఇలా..
రాజమండ్రి నుంచి టేకును తీసుకొచ్చి.. ఆ చెక్క ముక్కలపై అన్నదమ్ములైన గంగాధర్, నరసయ్యలు డిజైన్లు గీసి బ్లాకులను తయారు చేస్తారు. ఆ బ్లాకులను వారం రోజులపాటు వంట నూనెలో నానబెట్టి.. కలంకారీ హ్యాండ్ ప్రింటింగ్ వ్యాపారస్తులకు విక్రయిస్తారు.
ట్రీ ఆఫ్ లైఫ్‌కు మంచి స్పందన..
పట్టణానికి చెందిన కలంకారీ హ్యాండ్ ప్రింటింగ్ వ్యాపారి పిచ్చుక శ్రీనివాసరావు ట్రీ ఆఫ్ లైఫ్ డిజైన్‌కు సంబంధించిన బ్లాకులు తయారు చేయాల్సిందిగా కోరడంతో 233 బ్లాకులతో డిజైన్ రూపొందించారు. బెంగళూరు తదితర ప్రాంతాలకు సైతం ఈ బ్లాక్‌లను సరఫరా చేసేవారు. నెదర్లాండ్స్, థాయ్‌లాండ్ తదితర దేశాలకు చెందిన విదేశీయులు సైతం ఈ బ్లాక్‌లను కొనుగోలు చేసి తీసుకెళ్లడం విశేషం. వీరు తయారు చేసిన బ్లాకులు ఒక కళ అయితే.. వాటితో ప్రింటింగ్ వేయడం మరో కళ.
శిల్పగురుకు ఎంపికైన ఆర్చి
తప్పని కరోనా దెబ్బ..
కలంకారీ హ్యాండ్ ప్రింటింగ్‌తో ఎప్పుడూ రద్దీగా ఉండే వీరి వద్ద రోజూ 25 మందికి పైగా పనిచేసేవారు. అయితే అన్ని రంగాలనూ దెబ్బ తీసిన విధంగానే.. కరోనా వీరి వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రస్తుతం ఐదారుగురు మాత్రమే పని చేస్తున్నారు.
ప్రతిష్టాత్మక ‘శిల్పగురు’కు ఎంపిక..
అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి అవార్డు ‘శిల్పగురు’కు కొండ్ర గంగాధర్ ఎంపికయ్యారు. ఆయన రూపొందించిన మామిడి పండు, పండు, ఆర్చి డిజైన్ బ్లాకులను తయారు చేసినందుకు గానూ కేంద్ర ప్రభుత్వం జాతీయ హస్తకళల అభివృద్ధి సంస్థ ఎంపిక చేసింది. త్వరలోనే ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
చాలా సంతోషంగా ఉంది..
చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా జాతీయస్థాయి ‘శిల్పగురు’ వంటి అవార్డులకు ఎంపికవడం చాలా కష్టంగా ఉండేది. అవార్డుకు ఎంపికైన వారిని క్షేత్రస్థాయిలో పలువురు ఉన్నతాధికారులు స్వయంగా వచ్చి పరిశీలించి ఎంపిక చేయడంతో చాలా ఆనందం వేసింది. త్వరలోనే శిల్పగురు అవార్డు అందుకుంటా.
–కొండ్ర గంగాధర్, శిల్పగురు అవార్డు గ్రహీత, పెడన
చేతి వృత్తులకు కరువైన ఆదరణ
ప్రస్తుతం చేతివృత్తులు బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు పెడనలో మంచి గీరాకీ ఉండేది. ప్రస్తుతం తగ్గడంతో విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాం. ట్రీ ఆఫ్ లైఫ్‌ను చూసేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా వచ్చారు. స్థానికంగా కార్మికులు లభించకపోవడంతో ఉత్తరప్రదేశ్ నుంచి 10 మందిని తీసుకొచ్చాం.
–కొండ్ర నరసయ్య, జాతీయ అవార్డు గ్రహీత, పెడన
Comments
Please login to add a commentAdd a comment