సాధారణంగా కొత్తసంవత్సరం వస్తోంది అంటే పండుగ వాతావరణం నెలకొంటుంది. సంవత్సరంతోపాటు తమ జీవితాలలో కూడా మార్పు వస్తుందనే ఆశతో అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఎవరి పద్ధతులలో వారు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కొత్తసంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. విందులు, వినోదాలు, శుభాకాంక్షలు తెలుపుకోటం. ఒకటే సంబరం.
రాబోయే కాలం ఆనందదాయకంగా ఉండాలనే ఆకాంక్ష, ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేయటంతోపాటు ఇంతకాలం జీవితాన్ని ఆనందంగా గడిపినందుకు, ఆ విధంగా గడిపే అవకాశం ఇచ్చినందుకుభగవంతుడికి కృతజ్ఞతని ఆవిష్కరించటం వీటిలోని అసలు అర్థం. సంవత్సరంలో మొదటిరోజు ఏ విధంగా గడిపితే సంవత్సరం అంతా అదేవిధంగా ఉంటుందని అందరి విశ్వాసం. కనుక వీలైనంత ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కాలాన్ని నారాయణ స్వరూపంగా భావించి పూజించటం, ఆరాధించటం భారతీయ సంప్రదాయం. అంటే, ఆయా సమయాలలో ప్రకృతిలో వచ్చే మార్పులకి తగినట్టుగా ప్రవర్తించటం అందులో ఒక భాగం. నిత్యవ్యవహారానికి ప్రధానంగా చాంద్రామానాన్నేపాటించినా సంక్రమణాలు, విషువులు మొదలయినవి సూర్యమానానికి సంబంధించినవి. ప్రస్తుతం ప్రపంచం చాలావరకు సౌరమానాన్ని అనుసరిస్తోంది. ఇందులో సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఒకరకంగా లెక్క తేలిక. కాలచక్ర భ్రమణం వర్తులాకారంలో ఉంటుంది. ఎక్కడి నుండి లెక్క పెట్టటం మొదలుపెట్టామో అక్కడికి వచ్చి ఆగి మరొక ఆవృతం ప్రారంభం అవుతుంది. అందుకని ఎక్కడి నుండి అయినా లెక్కించటం మొదలు పెట్టవచ్చు.
రాజకీయమైన అనేక వత్తిడుల కారణంగా చాలా మార్పులు, సద్దుబాట్లు జరిగిన తరువాత తయారైన గ్రెగేరియన్ కాలెండర్ ప్రకారం జనవరి ఒకటవ తేదీని కొత్త సంవత్సరప్రారంభ దినంగా నిర్ణయించటం జరిగింది. భూగోళాన్ని ఒక కుగ్రామంగా పరిగణిస్తున్న ఈ రోజుల్లో అందరూ ఒకే కాలమానాన్నిపాటించటం సౌకర్యం. వ్యక్తిగత ఇష్టానిష్టాలని పక్కకిపెట్టి అందరూ ‘‘కామన్ ఎరా’’ అని ప్రపంచంలో ఎక్కువ దేశాలలో అమలులో ఉన్న ఈ కాలమానాన్ని అనుసరిస్తున్నారు.
చాంద్రమానాన్నిపాటించే భారతీయులు కూడా లౌకిక వ్యవహారాలకి కామన్ ఎరానే అనుసరిస్తున్నారు. విద్యాలయాలలో ప్రవేశానికి, ఉద్యోగ దరఖాస్తుకి,పాస్‌పోర్ట్, వీసా మొదలయిన వాటికి తేదీనే ఇస్తున్నాం కాని, తిథి, మాసం మొదలయిన వివరాలు ఇవ్వటం లేదు కదా! తమ వ్యక్తిగత, ఆధ్యాత్మిక వ్యవహారాలకి చాంద్రమానాన్నిపాటిస్తున్నారు. ఉదాహరణకి పుట్టిన రోజులు,పెళ్లి, గృహప్రవేశం మొదలయిన శుభ కార్యాల ముహూర్తాలు, పితృకార్యాలు మొదలైన వాటిని చాంద్రమానాన్ని అనుసరించి నిర్ణయిస్తారు.
కాలం ఎవరికోసం ఆగదు. కాలచక్రంలో మరొక ఆకు ముందుకి కదిలింది. కొత్త ఆవృతం మొదలవుతోంది. అంటే మరొక సంవత్సరం కాలగర్భంలో కలిసింది. కొత్త సంవత్సరంప్రారంభం కాబోతోంది.
కాని, అనుభవజ్ఞులైన పెద్దలు చేసే సూచన ఏమంటే జరిగిపోయిన సంవత్సరంలో ఏం చేశాము అని సమీక్షించుకుని, తీపి,చేదు అనుభవాలని నెమరు వేసుకుని, గెలుపోటములని, మానావమానాలని, బేరీజు వేసుకుని, తమ లక్ష్యాలని, లక్ష్యసాధన మార్గాలని నిర్ధారించుకుని, పనికిరానివాటిని పక్కకిపెట్టి, అవసరమైనవాటిని చేపడతామని నిర్ణయించుకోవలసిన సమయం ఇది అని. తమ ఆయుర్దాయంలో మరొక సంవత్సరం గడిచిపోయింది, చేయవలసిన పనులు త్వరగా చేయాలి అని తమని తాము హెచ్చరించుకోవాలి. అందుకే ఎంతోమంది ఒక చెడు అలవాటుని మానుతామనో, కొత్తపని ఏదైనా మొదలు పెడతామనో అని నూతన సంవత్సర నిర్ణయాలని ప్రకటిస్తూ ఉంటారు.
రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆనందాన్ని ఇతోధికంగా ఇవ్వాలని, యుద్ధవాతావరణం ఉపశమించి ప్రపంచంలో శాంతి నెలకొనాలని, చేసుకున్న తీర్మానాలు అమలు జరిపే శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని ఒకరికొకరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుందాం.
– డా. ఎన్.అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment