వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మహిళకు ఐదేళ్ల తరువాత న్యాయం లభించింది. ఈ ఉదంతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన నాగపూర్ కోర్టు ప్రభుత్వ వైద్యశాల డీన్ రాజ్ గజ్భియేతో సహా 11 మంది వైద్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని అజ్ని పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే 2019లో నాగపూర్‌కు చెందిన కేవల్‌రామ్ పాండురంగ్ పటోలే భార్య పుష్ప తన గొంతులో చిన్నపాటి గడ్డకు చికిత్స కోసం నాగ్‌పూర్‌లోని మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. ఈ సమయంలో సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ గజ్భియే బాధిత మహిళ భర్త కేవల్‌రామ్ పాండురంగ్ పటోలేతో శస్త్రచికిత్స ద్వారా బాధితురాలి గడ్డను తొలగించవచ్చని తెలిపారు. ఆ వైద్యుని సలహా మేరకు పటోలే తన భార్య పుష్పను 2019 జూలై 5న ఆసుపత్రిలో చేర్చారు. 6న ఉదయం 8 గంటలకు ఆమెకు ఆపరేషన్ జరిగింది.
ఈ ఆపరేషన్ తర్వాత పుష్ఫ పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఐసీయూలో ఆమెకు చికిత్సనందించారు. అయితే జూలై 7న ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పుష్ఫ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు పేర్కొన్నారు. అయితే తన భార్య ఆపరేషన్‌లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పటోలే 2020 జూన్ 30న డాక్టర్ గజ్భియేతో పాటు ఇతర వైద్యులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వైద్యాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేసి, కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికలో బాధితురాలు గుండెపోటుతో మృతి చెందిందని కమిటీ పేర్కొంది.
అయితే పటోలే దీనిపై రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో వైద్యశాఖ ఈ ఉదంతంపై విచారణకు కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధితురాలికి ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా పటోలే నాగపూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఆ వైద్యులపై కేసు నమోదు చేయాలని అజ్ని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment