Metabolic syndrome
-
‘ఐటీ’కి మెటబాలిక్ సిండ్రోమ్!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగం మందిలో మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య కనిపిస్తోందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పేర్కొంది. ఉద్యోగ హడావుడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. మధుమేహం, తీవ్ర రక్తపోటు, గుండె జబ్బుల బారినపడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. ఐటీ కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని.. సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతోపాటు వ్యాయామాలు చేయించడం, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను చేపట్టడం మంచిదని సూచించింది. –సాక్షి హైదరాబాద్ ఐసీఎంఆర్ నేతృత్వంలో.. భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) నేతృత్వంలో ఎన్ఐఎన్ ఈ అధ్యయనం నిర్వహించింది. దేశంలో ప్రముఖ ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో పెద్ద, మధ్య తరహా, చిన్న ఐటీ కంపెనీల్లో విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించింది. ఉద్యోగాల తీరుతెన్నులు, వాటిలో పనిచేస్తున్నవారి ఆహార అలవాట్లు, జీవనశైలి, వారి ఆరోగ్యం వంటి వివరాలను సేకరించి విశ్లేషించింది. వారిలో 46శాతం మందికిపైగా మెటబాలిక్ సిండ్రోమ్ బారినపడినట్టు గుర్తించింది. చాలా మందిలో హెచ్‌డీఎల్ (మంచి) కొవ్వులు తక్కువగా ఉండటం, రక్తపోటు, నడుము చుట్టుకొలత వంటివి ఎక్కువగా ఉండటాన్ని గమనించింది. ఐటీ ఉద్యోగులు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు కూర్చునే ఉంటున్నారని.. 22 శాతం మంది మాత్రమే వారానికి కనీసం 150 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలన్న సూత్రాన్ని పాటిస్తున్నారని తేల్చింది. వ్యాయామం లేకపోవడం, తీవ్ర ఒత్తిడి, పోషకాలు లేని జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి శరీరంలో ఇన్ఫ్లమేషన్కు కారణం అవుతున్నాయని.. ఇది కాలం గడిచిన కొద్దీ మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తోందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఉద్యోగుల సగటు వయసు 30 ఏళ్లు మాత్రమేనని.. చిన్నవయసులోనే సమస్యల బారినపడుతున్నారని వివరించారు. ఏమిటీ మెటబాలిక్ సిండ్రోమ్! మన శరీరంలో క్రమంకొద్దీ జరగాల్సిన జీవక్రియల్లో తేడాలు రావడం, లోపాలు చోటు చేసుకోవడమే మెటబాలిక్ సిండ్రోమ్. ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు.. అనే ఐదు ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్లను బట్టి దీన్ని నిర్ధారిస్తారు. నడుము చుట్టుకొలత, అధిక బరువు ఊబకాయాన్ని సూచిస్తాయి. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. నడుము చుట్టుకొలత పురుషుల్లోనైతే 90 సెంటీమీటర్లకన్నా, మహిళలకు 80 సెంటీమీటర్లకన్నా ఎక్కువగా ఉండటం ఊబకాయానికి సూచిక. ఇక రక్తంలో ట్రైగ్లిజరైడ్లు 150ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండటం అనారోగ్యకరం. ఆరోగ్యకరమైన కొవ్వులైన హెచ్‌డీఎల్ (హైడెన్సిటీ లిపిడ్స్) పురుషుల్లోనైతే 40 ఎంజీ/డెసిలీటర్ కంటే, మహిళల్లో 50 ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. రక్తపోటు 135/85 కన్నా తక్కువగా ఉండాలి. కనీసం ఎనిమిది గంటలకన్నా ఎక్కువ సమయం ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్నాక రక్తంలో గ్లూకోజు స్థాయిలు 100 ఎంజీ/డెసిలీటర్ కన్నా తక్కువగా ఉండాలి. ఈ ఐదింటిలో ఏ మూడు వ్యతిరేకంగా ఉన్నా.. సదరు వ్యక్తులు మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టేనని వైద్యులు చెప్తున్నారు. జీవన శైలిలో మార్పులే పరిష్కారం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు చెప్తున్నారు. తరచూ బయటి ఆహారం (ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్) తినడం తగ్గించుకోవాలని.. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని, వీలైనంత వరకూ కాయగూరలు, పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు చాలామంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదని వెల్లడైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.సుబ్బారావు గవరవరపు తెలిపారు. దీనికితోడు ఒత్తిడికి లోనవుతుండటం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురయ్యేందుకు దారితీస్తోందని వివరించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సంఖ్య తక్కువే అయినా.. సగటున అందరు ఉద్యోగుల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి దాదాపు ఒకేలా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ సమస్య నుంచి ఐటీ ఉద్యోగులు బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలనివేదికను ఎన్ఐఎన్ శాస్త్రవేత్త భానుప్రకాశ్‌రెడ్డితో కలసి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. న్యూట్రియంట్స్’ఆన్లైన్ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. -
ఒబెసిటీ, హైబీపీ ఎక్కువే.. పన్నీర్, జంక్ ఫుడ్, నాన్ వెజ్ వల్ల..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీవనశైలి వ్యాధుల సూచికల్లో తెలంగాణ పరిస్థితి అత్యంత పేలవంగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. అలాగే స్థూలకాయం, రక్తపోటు కేసుల సంఖ్య సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ‘మెటబాలిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎంఆర్ ఐఎన్‌డీఐఏబీ) పేరిట లాన్సెట్ రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 25 శాతం మంది సెంట్రల్ ఒబేసిటీ, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 మధ్య మొత్తం 1,13,043 మంది (గ్రామీణ ప్రాంతాల నుంచి 79,506 పట్టణ ప్రాంతాల నుంచి 33,537 మంది)పై నిర్వహించిన అధ్యయన ఫలితాలను లాన్సెట్ ఇటీవల ప్రచురించింది. ఊబకాయం కేసులలో తెలంగాణ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మణిపూర్, మిజోరం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హరియాణా, ఢిల్లీల సరసన నిలుస్తోంది. దీనికి కారణం ఉదర ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్‌కు మధ్య దగ్గరి సంబంధం ఉండటమేనని వైద్య నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం.. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం.. లాన్సెట్ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజల్లో ఊబకాయం, రక్తపోటు, ట్రైగ్లిజరిడెమియా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ‘ఇది తక్కువస్థాయి శారీరక శ్రమతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల పెరుగుతున్న సమస్య. ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న రోగులను ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. ఇవి మెటబాలిక్ సిండ్రోమ్ సంకేతాలు. చికిత్స తీసుకోకుంటే గుండె, మూత్రపిండాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి’’ అని నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరించారు. హైపర్ టెన్షన్... స్లీప్ అప్నియాలకూ దోహదం.. ‘పన్నీర్, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధికస్థాయి కొలస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. దీనికితోడు డెస్క్ జాబ్‌లు సెంట్రల్ ఒబేసిటీకి దారితీస్తున్నాయి. ఊబకాయంతో గుండె జబ్బులు, మధుమేహమే కాకుండా హైబీపీ, స్లీప్ యాప్నియా వంటి ఇతర జబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సమస్యలకు అధిక మద్యపానం కూడా ఒక ప్రధాన కారణం’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలవాట్లను కట్టడి చేస్తేనే.. పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు అధికంగా చేరడాన్నే సెంట్రల్ ఒబేసిటీగా పేర్కొంటారు. పెరిగిన విసరల్ ఫ్యాట్ పోర్టల్ బ్లడ్ సిస్టమ్ ద్వారా సరఫరా అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోని అదనపు కొవ్వు రక్తప్రవాహంలోకి కొవ్వు నిల్వలను విడుదల చేస్తుందన... ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపధ్యంలో వ్యాయామం, శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం తప్పనిసరని వారు సూచిస్తున్నారు. -
గుండెజబ్బు, పక్షవాతం ముప్పుల వెనక జన్యుమార్పు
న్యూయార్క్: గుండెజబ్బు, పక్షవాతం ముప్పులకు కారణమయ్యే ఓ కీలక జన్యు ఉత్పరివర్తనాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో కూడిన మెటబాలిక్ సిండ్రోమ్ (జీవక్రియల సంబంధమైన సమస్య) వల్ల గుండెజబ్బు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది. అయితే శరీరంలో కొవ్వులు, గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే ‘డీవైఆర్కే1బీ’ అనే జన్యువులో మార్పే మెటబాలిక్ సిండ్రోమ్‌కు కారణమవుతోందని తాజాగా అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ అర్యమణి నేతృత్వంలోని బృందం కనుగొంది. డీవైఆర్కే1బీ జన్యువులో ఉత్పరివర్తనం వల్ల.. అది శరీరంలో కొవ్వు, గ్లూకోజ్ నిల్వలను స్థిరంగా ఉంచే వ్యవస్థను నిరోధిస్తోందని, ఫలితంగా గ్లూకోజ్, కొవ్వులు పెరిగిపోయి మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తోందని మణి తెలిపారు. డీవైఆర్కే1బీ జన్యువులో ఉత్పరివర్తనాన్ని సరిచేసేందుకు కొత్త చికిత్సలు రూపొందిస్తే గనక.. మెటబాలిక్ సిండ్రోమ్‌ను నివారించవచ్చని, తద్వారా గుండెజబ్బు, పక్షవాతం ముప్పులూ తగ్గుతాయన్నారు. వీరి పరిశోధన వివరాలు ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి