గుండెజబ్బు, పక్షవాతం ముప్పుల వెనక జన్యుమార్పు
న్యూయార్క్: గుండెజబ్బు, పక్షవాతం ముప్పులకు కారణమయ్యే ఓ కీలక జన్యు ఉత్పరివర్తనాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో కూడిన మెటబాలిక్ సిండ్రోమ్ (జీవక్రియల సంబంధమైన సమస్య) వల్ల గుండెజబ్బు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది. అయితే శరీరంలో కొవ్వులు, గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే ‘డీవైఆర్‌కే1బీ’ అనే జన్యువులో మార్పే మెటబాలిక్ సిండ్రోమ్‌కు కారణమవుతోందని తాజాగా అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ అర్యమణి నేతృత్వంలోని బృందం కనుగొంది.
డీవైఆర్‌కే1బీ జన్యువులో ఉత్పరివర్తనం వల్ల.. అది శరీరంలో కొవ్వు, గ్లూకోజ్ నిల్వలను స్థిరంగా ఉంచే వ్యవస్థను నిరోధిస్తోందని, ఫలితంగా గ్లూకోజ్, కొవ్వులు పెరిగిపోయి మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తోందని మణి తెలిపారు. డీవైఆర్‌కే1బీ జన్యువులో ఉత్పరివర్తనాన్ని సరిచేసేందుకు కొత్త చికిత్సలు రూపొందిస్తే గనక.. మెటబాలిక్ సిండ్రోమ్‌ను నివారించవచ్చని, తద్వారా గుండెజబ్బు, పక్షవాతం ముప్పులూ తగ్గుతాయన్నారు. వీరి పరిశోధన వివరాలు ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి