వేరుశెనగలతో గుండెకు మేలు..
మూడు ముచ్చట్లు
వేరుశెనగలు తింటే గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేరుశెనగ గింజల్లో దాదాపు 48 శాతం కొవ్వుపదార్థాలు ఉన్నా, వాటిలో గుండెకు మేలుచేసే మోనో శాచ్యురేటెడ్, పోలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వేరుశెనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్-బి 1, బి 6, ఫొలిక్ యాసిడ్, విటమిన్-ఇ, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు శరీరానికి చాలా మేలు కలిగిస్తాయని అంటున్నారు.
వేరుశెనగలే కాకుండా బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి ఎలాంటి గింజలనైనా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే, గుండెజబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని వివరిస్తున్నారు. అమెరికన్ నిపుణులు, చైనీస్ నిపుణులు నిర్వహించిన వేర్వేరు పరిశోధనల్లో వేరుశెనగలు సహా వివిధ రకాల గింజలు తినడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు ఇటీవల గుర్తించారు.