యాంటాసిడ్స్ ఎక్కువైతే గుండెకు చేటు..
కాస్త అజీర్తి చేసినా, కడుపు ఉబ్బరంగానూ, ఛాతీలో మంటగానూ అనిపించినా వెంటనే యాంటాసిడ్లు వాడటం చాలామందికి అలవాటే. కొందరైతే దాదాపు ప్రతిరోజూ యాంటాసిడ్లు వాడుతుంటారు. అయితే, ఇలా ఎడాపెడా యాంటాసిడ్లను వాడటం ఏమాత్రం క్షేమం కాదని, తరచు యాంటాసిడ్లు వాడేవారు గుండెజబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అమెరికన్ వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
యాంటాసిడ్లను తరచూ వాడని వారితో పోలిస్తే కాస్త ఎక్కువగా యాంటాసిడ్లు వాడేవారికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలు 16-21 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ పరిశోధకుడు నిగమ్ హెచ్ షా హెచ్చరిస్తున్నారు. హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ సహకారంతో నిగమ్ హెచ్ షా నేతృత్వంలో స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో తరచు యాంటాసిడ్ల వాడకం వల్ల గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధన సారాంశాన్ని పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ జర్నల్ ఇటీవల ప్రచురించింది.