antacids
-
సీపీఆర్ చేస్తే బతికేవారేమో
కోల్‌కతా/ముంబై: గుండెపోటుతో మరణించిన ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే)కు సకాలంలో సీపీఆర్ చేసుంటే ప్రాణాలు నిలిచేవని కోల్‌కతా వైద్యులు అభిప్రాయపడ్డారు. ‘‘ఆయన గుండెలో ఎడమవైపు ధమనిలో 80 శాతం బ్లాకేజీ ఉంది. మిగతా ధమనులు, రక్తనాళాల్లోనూ చిన్నచిన్న బ్లాక్‌లున్నాయి. చాలా రోజులుగా ఈ సమస్య ఉన్నట్టుంది. దీనికి తోడు లైవ్ షోలో ఉద్విగ్నంగా గడపటంతో గుండెకు రక్తం సరిగా అందక మరణానికి దారితీసింది. స్పృహ కోల్పోగానే సీపీఆర్ చేసుంటే బతికేవారు’’ అని ఒక వైద్యుడు పీటీఐకి చెప్పారు. కేకే యాంటాసిడ్ ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకున్నట్టు పోస్టుమార్టంలో తేలింది. గుండెనొప్పిని అజీర్తిగా భావించి వాటిని వాడి ఉంటారని వైద్యులు చెప్పారు. కోల్‌కతా నుంచి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఛాతిలో నొప్పిగా ఉందని, చేతులూ భుజాలూ లాగుతున్నాయని చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. అభిమానుల కన్నీటి నడుమ కేకే అంత్యక్రియలు ముంబై వెర్సొవా హిందు శ్మశానవాటికలో గురువారం జరిగాయి. కుమారుడు నకుల్ అంతిమ సంస్కారం నిర్వహించారు. శ్రేయఘోషల్, అల్కాయాజ్ఞిక్, హరిహరన్, సలీమ్ మర్చంట్ వంటి సింగర్లు నివాళులర్పించారు. -
ఆ మాత్రలతో క్యాన్సర్ ముప్పు
లండన్ : గ్యాస్, అజీర్తి సమస్యలతో నిత్యం యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వాడితే పెనుముప్పు తప్పదని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఏడాది పాటు రోజూ ఈ మాత్రలను వాడితే పొత్తికడుపు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఐదు రెట్లు పెరుగుతాయని, మూడేళ్లు వాడితే క్యాన్సర్ ముప్పు ఎనిమిది రెట్లు పెరుగుతుందని తేలింది. క్యాన్సర్ కణాలను పెంచే గ్యాస్ర్టిన్ హార్మోన్ కారణంగా ఈ రిస్క్ పొంచిఉందని యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతంలోనూ యాంటాసిడ్స్ తరచూ తీసుకుంటే గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, డిమెన్షియా వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని కొన్ని అథ్యయనాలు వెల్లడించాయి. హాంకాంగ్‌లో 63,000 మందిపై తాజా అథ్యయనం నిర్వహించారు. ఏడేళ్ల పాటు వీరిని గమనించగా వారానికి ఒకసారి యాంటాసిడ్ మాత్రలను తీసుకున్న వారిలో పొత్తికడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని రోజూ వాడేవారిలో క్యాన్సర్ ముప్పు నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. దీర్ఘకాలం వీటిని వాడటం మంచిది కాదని, వైద్యులు సైతం దీనిపై రోగులను అప్రమత్తం చేయాలని పరిశోధకులు సూచించారు. -
యాంటాసిడ్స్ ఎక్కువైతే గుండెకు చేటు..
కాస్త అజీర్తి చేసినా, కడుపు ఉబ్బరంగానూ, ఛాతీలో మంటగానూ అనిపించినా వెంటనే యాంటాసిడ్లు వాడటం చాలామందికి అలవాటే. కొందరైతే దాదాపు ప్రతిరోజూ యాంటాసిడ్లు వాడుతుంటారు. అయితే, ఇలా ఎడాపెడా యాంటాసిడ్లను వాడటం ఏమాత్రం క్షేమం కాదని, తరచు యాంటాసిడ్లు వాడేవారు గుండెజబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అమెరికన్ వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యాంటాసిడ్లను తరచూ వాడని వారితో పోలిస్తే కాస్త ఎక్కువగా యాంటాసిడ్లు వాడేవారికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలు 16-21 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని స్టాన్ఫోర్డ్ వర్సిటీ పరిశోధకుడు నిగమ్ హెచ్ షా హెచ్చరిస్తున్నారు. హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ సహకారంతో నిగమ్ హెచ్ షా నేతృత్వంలో స్టాన్ఫోర్డ్ వర్సిటీ పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో తరచు యాంటాసిడ్ల వాడకం వల్ల గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధన సారాంశాన్ని పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ జర్నల్ ఇటీవల ప్రచురించింది.