ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఉరుగుల పరుగుల జీవితం. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనకు తోడు, పొట్ట, పిరుదుల్లో బాగా కొవ్వు చేరడం, ఊబకాయం వెరసి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అన్నింటికంటే బెల్లీ ఫ్యాట్ అనేది తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. అధిక బరువు లేదా పొట్ట పెరగడానికి గల కారణాలను తెలుసుకుందాం!
పౌష్టికాహారం లోపించడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఒకేచోట గంటలతరబడి కూర్చోడం, ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోని పని చేయడం వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. హార్మోన్లు, ఆహారం, వివిధ కారకాలు పొత్తికడుపు కొవ్వును ప్రభావితం చేస్తాయి.
ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారాలు కాకుండా కొవ్వు, సుగర్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం. వీటన్నింటితోపాటు జీవనశైలి విషయంలో కొన్ని తప్పులు కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతున్నాయి.
రోజులో అతి కీలకమైన అల్పాహారం మానేయడం ఒక కారణం. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మీ జీవక్రియ దెబ్బతింటుంది. మీ బరువు తగ్గాలంటే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. అల్పాహారం రాజులా , మధ్యాహ్న భోజనం యువరాజులా , రాత్రి భోజనం పేదలా తినాలి అనేది పెద్దల మాట.
సమయానికి తినకపోవడం పెద్ద తప్పు అయితే, ఇష్టం వచ్చినట్టు ఉపవాసాలు ఉండటం మరో తప్పు. సమయం ప్రకారం తినడంతోపాటు ప్రొటీన్, ఫైబర్‌తో నిండిన ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. భోజనానికి, భోజనానికి మధ్యలో పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి భోజనంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు కాకుండా, ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. దీంతో జీర్ణక్రియ సులభమవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. రాత్రి భోజనం చేసిన నిద్రకు ఉపక్రమించడం కూడా పొత్తికడుపు కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. రాత్రి భోజనం తరువాత కనీసం 10-20 నిమిషాల నడక అటు జీర్ణక్రియకు, ఇటు బరువు నియంత్రణకు సాయపడుతుంది.
వీటన్నింటి కంటే ప్రధానమైంది. తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి కీలకం. మనిషి రోజుకు 6-7 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర పోనివారు రోజువారీ ఎక్కువ కేలరీలు తీసుకుంటారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. సరిపడినన్ని నీళ్లు తాగడం కూడా చాలా కీలకం. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
వాకింగ్, జాకింగ్, యోగా లాంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే బెల్లీ ఫ్యాట్‌కు దూరంగా ఉండటమేకాకుండా, మంచి ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.
నోట్: ఇవి కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. వేరే ఇతర అనారోగ్య కారణాలతో కూడా పొట్ట పెరిగే అవకాశం ఉంది. ఈ తేడాను గమనించి సరైన వైద్య పరీక్షలు చేయించుకొని, చికిత్స తీసుకోవడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment