సాక్షి, విజయవాడ: ప్రస్తుతం ఆధునిక జీవన విధానంలో ప్రజలను జంట భూతాలు పీడిస్తున్నాయి. నిండా నాలుగు పదులు దాటకుండానే చాలామంది వీటి బారిన పడి ఇల్లు, వళ్లు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజల జీవన శైలి, ఆహార అలవాట్లే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
►విద్యాధరపురానికి చెందిన 30 ఏళ్ల సురేష్ ఓ ప్రయివేటు సంస్థలో పనిచేస్తుంటాడు. ఇటీవల విధి నిర్వహణలో తీవ్ర వత్తిడికి గురవుతున్నాడు. ఒకరోజు ఎక్కువ నీరసంగా ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా, అధిక రక్తపోటు ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు కిడ్నీల సమస్య కూడా తలెత్తింది.
►నీటిపారుదల శాఖలో పనిచేసే 26 ఏళ్ల వెంకట్‌కు ఇటీవల ఆకలి ఎక్కువగా ఉండటం, చెమటలు పట్టడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. శరీరంలో అధిక షుగర్ లెవల్స్‌తో పాటు హెచ్‌బీఏ1సీ 11కు చేరింది. అదృష్టవశాత్తు ఇంకా అవయవాలపై ప్రభావం చూపలేదు.
►ఇలా వీరిద్దరే కాదు మధుమేహం, రక్తపోటులకు గురై చికిత్సకోసం ప్రభుత్వాస్పత్రికి 30 నుంచి 40 ఏళ్ల మధ్యవారు నిత్యం 10 నుంచి 15 మంది వరకూ వస్తున్నారు. వీరిలో కొందరికి అప్పటికే అవయవాలపై ప్రభావం చూపడంతో ఆయా విభాగాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని వైద్యులు అంటున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో 30 సంవత్సరాలు దాటిన వారిలో 13 శాతం మంది మధుమేహులు, 11.5 శాతం మంది బీపీతో బాధపడుతున్నట్లు తేలింది.
జంట వ్యాధులకు కారణాలివే...
►కదలిక లేని జీవన విధానం (శరీరానికి వ్యాయామం లేక పోవడం)
►ఆధునిక జీవనశైలిలో వత్తిళ్లు పెరిగిపోవడం
►ఆహారపు అలవాట్లలో మార్పులు
►కార్పోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం,
►వంశపారంపర్యం(తల్లిదండ్రులకు షుగర్, బీపీలు ఉండటం)
అదుపునకు ఏమి చేయాలి
►ప్రతిరోజూ 45 నిమిషాలు, కనీసం వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పక చేయాలి.
►విధి నిర్వహణలో, జీవితంలో ఎదుర్కొనే వత్తిళ్లను అధిగమించేందుకు యోగా చేయడం మంచిది.
►ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి, మాంసాహారం, జంక్‌ఫుడ్స్‌ను తగ్గిస్తే మంచిది.
►పీచు పదార్ధాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తాజా పళ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి.
►శరీరంలో బీపీ, చక్కెర స్థాయిలు, కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకునేలా తరచూ పరీక్షలు చేయించుకోవాలి.
►ప్రతి మనిషి నెలకు 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం.
►ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది.
జీవనశైలిలో మార్పులతోనే...
అధిక రక్తపోటుతో తలెత్తే దుష్పలితాలతో ప్రభుత్వాస్పత్రికి వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నారు. ముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారు సైతం బీపీతో పక్షవాతం వంటి వాటికి గురై చికిత్సకోసం వస్తున్నారు. అదుపులో లేని మధుమేహం, రక్తపోటుకు జీవనశైలిలో మార్పులే కారణం. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, విధి నిర్వాహణలో వత్తిళ్లు కూడా కారణమే. వ్యాయామం అసలు ఉండటం లేదు. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. త్వరగా డైజీషన్ అయ్యే అహారం, కార్పోహైడ్రేడ్స్ ఎక్కువుగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌ను తీసుకోవడం కూడా రక్తపోటుకు కార ణమే.
– డాక్టర్ ఎస్.దుర్గాప్రసాద్, ఫిజీషియన్, ప్రభుత్వాస్పత్రి
మధుమేహులు పెరుగుతున్నారు
యువతలో మధుమేహులు రోజు రోజుకు పెరుగుతున్నారు. శరీరంలో షుగర్ స్థాయిలో అదుపులో లేకున్నా, యువత మందులు సరిగా వాడక పోవడంతో దాని ప్రభావం కిడ్నీలు, గుండె, కన్ను వంటి అవయవాలపై పడుతుంది. తమ వద్దకు మధుమేహంలో కిడ్నీలు డ్యామేజ్ అయిన మధ్య వయస్సు వారిని చూస్తున్నాం. మధుమేహాన్ని ఆశ్రద్ద చేయడం మంచిది కాదు. ప్రతిరోజూ వ్యాయామం, శ్రమైక జీవన విధానం, సమతుల్య ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు ప్రీ డయాబెటీస్ స్టేజ్‌లో ఉన్న వారు ముందస్తు జాగ్రత్తలతో మేలుకోవాలి.
– డాక్టర్ కొండా వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment