ఈ వ్యాధులున్నాయా... ఓ కన్నేయండి..! | be careful this Diseases | Sakshi
Sakshi News home page

ఈ వ్యాధులున్నాయా... ఓ కన్నేయండి..!

Published Mon, Jun 16 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

ఈ వ్యాధులున్నాయా... ఓ కన్నేయండి..!

ఈ వ్యాధులున్నాయా... ఓ కన్నేయండి..!

అప్పటివరకూ మనకు ఎలాంటి వ్యాధీ లేదనుకుంటాం... ఏదో పరీక్ష చేయించుకోవడానికి వెళితే షుగర్ ఉన్నట్లు తేలుతుంది. అంతే... వెంటనే డాక్టర్ ఎందుకైనా మంచిదంటూ మరికొన్ని పరీక్షలతో పాటు కంటి పరీక్ష విధిగా చేయిస్తారు. అలాగే ఎందుకో అనుకోకుండా రక్తపోటు చూపించుకుంటారు. ఉండాల్సినదాని కంటే అది చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు పరీక్షల తర్వాత... రక్తపోటు ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యాక... డాక్టర్లు ముందుగా మూత్రపిండాలనూ, తర్వాత కంటినీ పరీక్షించి అక్కడి రక్తనాళాలు బాగున్నాయా, లేదా అని చూస్తారు. ఇలా... వచ్చిన  వ్యాధి గుండెపోటు నుంచి మైగ్రేన్ వంటి తలనొప్పి వరకు ఏదైనప్పటికీ... కంటిపై అది తన దుష్ర్పభావాన్ని చూపవచ్చు. అందుకే, కొన్ని  వ్యాధులు ఉన్నవారు విధిగా కన్ను విషయంలోనూ జాగ్రత్త వహించాలి. చాలా మందికి అంతగా తెలియని ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతూ తమ కళ్లను రక్షించుకునేందుకు ఉపకరించేదే ఈ ప్రత్యేక కథనం...
 
మనలో ఎన్నో కణాలుంటాయి. ఆ కణాలన్నీ కలిసి కణజాలంగా ఏర్పడతాయి. ఆయా కణజాలాలు కొన్ని విధులు నిర్వహించడానికి ప్రత్యేకంగా కొన్ని అవయవాలుగా ఏర్పడతాయి. ఆ అవయవాలు ఒక వ్యవస్థలా రూపొంది కొన్ని జీవక్రియలు నిర్వహిస్తుంటాయి. మనకు ఏదైనా వ్యాధి వచ్చిందంటే చాలా సందర్భాల్లో అది ఆ అవయవానికో, ఆ అవయవం నిర్వహించే జీవవ్యవస్థకో పరిమితమవుతుందని అనుకుంటాం. ఉదాహరణకు థైరాయిడ్ అనే అవయవానికి ఏదైనా జబ్బు వస్తే అది థైరాయిడ్‌కే పరిమితం కాదు. అలాగే రక్తప్రసరణ వ్యవస్థలో ఏదైనా హెచ్చుతగ్గులు ఏర్పడితే అది అంతవరకే తన ప్రభావం చూపదు. కంటి మీదా దాని దుష్ర్పభావం కనిపించవచ్చు. అలా కంటిపై ప్రభావం కనిపించేందుకు ఆస్కారం ఉన్న కొన్ని జబ్బులు, వ్యవస్థలూ, ఆరోగ్య పరిస్థితులు ఉదాహరణకు...  డయాబెటిస్  రక్తపోటు  
థైరాయిడ్  
రక్తహీనత (అనీమియా)  
కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్
ఆటో ఇమ్యూన్ డిసీజెస్  
కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్  
కొన్ని ట్యూమర్లు (గడ్డలు)
కొన్ని రకాల ఆనువంశిక (హెరిడిటరీ) వ్యాధులు  
కొన్ని రకాల మందులు
హార్మోన్లలో వచ్చే అసమతౌల్యతలు  
కొన్ని విటమిన్లు అధికంగా తీసుకోవడం... ఇవన్నీ కంటిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే కొన్ని వ్యాధులున్నవారు, కొన్ని మందులు, విటమిన్ సప్లిమెంట్లు తీసుకునేవారు విధిగా  ఆ మందుల వల్ల కంటిపై దుష్ర్పభావం కలుగుతుందా అని అడిగి తెలుసుకోవాలి. అంతేకాదు కొన్ని లక్షణాలేమైనా కనిపించినప్పుడు విధిగా కంటి డాక్టరునూ సంప్రదించాలి.
 
సోరియాసిస్
సోరియాసిస్ వ్యాధిలో చర్మం పొడిబారి పొట్టు రాలుతున్నట్లుగా ఉంటుంది. మన రోగ నిరోధకశక్తి మనకే ప్రతికూలంగా పనిచేయడంతో పాటు మరికొన్ని కారణాలతో వచ్చే ఈ జబ్బులో కన్ను కూడా ప్రభావితమవుతుంది. ఈ జబ్బు ఉన్నవాళ్లలో
 
 రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్ల్కెరా పొరకు మధ్య ఇన్‌ఫ్లమేషన్ రావడం (యువైటిస్)   
 
 కార్నియాకు ఇన్‌ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్), కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం (కంజెంక్టివైటిస్), కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి లక్షణాలు కనిపించవచ్చు.
 
 పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... సోరియాసిస్‌కు ఇప్పుడు గతంలో కంటే అధునాతనమైన చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనే ఆధునిక తరహా చికిత్సలు. వీటిని తీసుకుంటూనే ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి.
 
మియస్థేనియా గ్రేవిస్
ఇది నరాలకు, కండరాలకు వచ్చే జబ్బు. ఈ జబ్బు వల్ల కండరాలు క్రమంగా తమ శక్తిని కోల్పోయి ఒక దశలో పూర్తిగా చచ్చుబడిపోయినట్లుగా మారిపోతాయి. శక్తిహీనంగా తయారవుతాయి. ఈ వ్యాధి వల్ల కలిగే దుష్ర్పభావంతో చూపు కూడా దెబ్బతింటుంది. కంటిపై ఈ వ్యాధి కనబరిచే దుష్ర్పభావాలు...
 
 పై కనురెప్ప గాని లేదా కింది కనురెప్పగానీ వ్యక్తి ప్రమేయం లేకుండా దానంతట అదే మూసుకుపోవడం (టోసిస్)
 
 ఒకే వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం (డిప్లోపియా)  
 
 పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... మియస్థేనియా గ్రేవిస్ జబ్బు ఉన్న వారు దాన్ని నియంత్రించుకునేందుకు...
 
 డాక్లర్లు సూచించిన స్టెరాయిడ్స్ క్రమం తప్పకుండా వాడాలి.
 
 ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనే మందులను వాడాల్సి ఉంటుంది.
 
 ఒక్కోసారి శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
 
మైగ్రేన్
ఇది ఒక రకం తలనొప్పి. మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి) ఉన్నవారిలో కంటికి సంబంధించి కనిపించే లక్షణాలు ఏమిటంటే...  
 
 చూపు మసకగా అనిపించడం  
 
 ఒక పక్క కన్నుగుడ్డులో తీవ్రమైన నొప్పి   
 
 తాత్కాలికంగా చూపు తగ్గడం లేదా తాత్కాలికంగా ఏమీ కనిపించకపోవడం   
 
 కంటి కండరాలకూ, కనురెప్పలకూ తాత్కాలికంగా పక్షవాతం రావడం.
   
పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... కొన్ని రకాల అంశాలు మైగ్రేన్ తలనొప్పిని తక్షణం ప్రేరేపిస్తాయి. ఉదా: కొన్ని రకాల సుగంధద్రవ్యాల వాసన లేదా అగరొత్తుల వంటి వాసనలు మైగ్రేన్‌ను ప్రేరేపించి తక్షణం తలనొప్పి వచ్చేలా చేస్తాయి. ఈ అంశాలను ‘ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్’ అంటారు. తమకు ఏ అంశం వల్ల అది వస్తుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. మైగ్రేన్‌కు డాక్టర్లు రెండు రకాల చికిత్సలు చేస్తారు. మొదటిది... తక్షణమే నొప్పి తగ్గేందుకు చేసే చికిత్స. రెండోది... దీర్ఘకాలంలో ఈ నొప్పి మళ్లీ మళ్లీ రాకుండా నివారించేందుకిచ్చే మందులతో చేసే చికిత్స. ఈ మందులను క్రమం తప్పకుండా వాడాలి.
 
డయాబెటిస్
ఇటీవల మన సమాజంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి ఇది. పైగా ఈ వ్యాధి ఉన్నవారిలో కనీసం 20 శాతం మందిలో కంటిపై దాని తాలూకు దుష్ర్పభావం కనిపించే అవకాశం ఉంది. మధుమేహం వల్ల కంటికి వచ్చే వ్యాధులివే...
 
డయాబెటిక్ రెటినోపతి: రెటీనా అనే కంటి వెనక ఉండే తెరపై పడే ప్రతిబింబం నుంచి మెదడుకు సిగ్నల్స్ అందడం వల్లనే మనకు చూపు అనే జ్ఞానం కలుగుతుందన్న విషయం తెలిసిందే. డయాబెటిస్ కారణంగా  రక్తనాళాలు మొద్దుబారడం వల్ల రెటీనాకు అందాల్సినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందక క్రమంగా రెటీనా తన పనితీరును కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల దృష్టిలోపం కూడా రావచ్చు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. వాటి నరాలు స్పందనలు కోల్పోతున్నాయా అన్న అంశాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి.
 
గ్లకోమా: డయాబెటిస్ ఉన్నవారికి కంట్లో నల్లముత్యం లేదా నీటికాసులు అని పిలిచే గ్లకోమా రావచ్చు. కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ఒత్తిడి పెరిగి మనకు కనిపించే దృష్టి విస్తృతి క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా గ్లకోమా కండిషన్ ఉత్పన్నమైందా అన్న విషయం తెలుసుకోడానికి కంటి డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
 
క్యాటరాక్ట్: కంట్లోని లెన్స్ పారదర్శకతను కోల్పోయే స్థితిని క్యాటరాక్ట్ అంటారన్న విషయం తెలిసిందే. డయాబెటిస్ ఉన్నవారిలో క్యాటరాక్ట్ వచ్చే అవకాశమూ ఉన్నందున సంబంధిత పరీక్షలూ చేయించుకోవాలి. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవాళ్లకు క్యాటరాక్ట్ పదేళ్ల ముందే వస్తుంది.
 
ఆప్టిక్ న్యూరోపతీ: డయాబెటిస్ వల్ల నరాలు మొద్దుబారి తమ చైతన్యాన్ని కోల్పోతాయన్న విషయం తెలిసిందే. మిగతా నరాల విషయం ఎలా ఉన్నా చూపును ప్రసాదించే ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే జీవితం అంధకారమయ్యే ప్రమాదముంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పక కంటిపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
 
 పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స
 డయాబెటిస్ ఉన్నవారు  
 రక్తంలో చక్కెరపాళ్లను జాగ్రత్తగా నియంత్రించుకోవాలి
 క్రమం తప్పకుండా మందులు వాడాలి   
 కంటి డాక్టర్‌నూ సంప్రదిస్తూ ఉండాలి  
 అవసరాన్ని బట్టి లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి.
 
అధిక రక్తపోటు
అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్నవారిలో అకస్మాత్తుగా చూపు మసకబారవచ్చు. లేదా చూపు కనిపించకపోవచ్చు. దీనికి అనేక కారణాలుంటాయి. రక్తపోటు కారణంగా...
 
రెటీనాకు సంబంధించిన కేంద్ర రక్తనాళం (సిర) లేదా ఏదైనా రక్తనాళపు శాఖలో రక్తం గడ్డకట్టి అడ్డుపడవచ్చు.  
రెటీనాకు సంబంధించిన ప్రధాన ధమని లేదా ధమని శాఖలో రక్తం గడ్డకట్టి అడ్డుపవచ్చు.  
ఆప్టిక్ న్యూరోపతి అనే నరాల సంబంధమైన సమస్య రావచ్చు.  
కన్నులోని ఒక భాగమైన విట్రియల్ ఛేంబర్‌లో రక్తస్రావం కావచ్చు   
గ్లకోమా కూడా రావచ్చు.
 
 పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... రక్తపోటు ఉన్నవారు  
 బీపీని అదుపులో పెట్టుకోవాలి  
 ఉప్పు, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి  
 కంటికి సంబంధించిన సమస్య వస్తే మందులు వాడటం లేదా లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి.
 
థైరాయిడ్ సమస్య
గొంతు వద్ద ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకెళ్లే నాళం చుట్టూ ఉండే ప్రధాన గ్రంథి థైరాయిడ్. ఇది స్రవించే హార్మోన్ కారణంగా మన శరీరంలోని అనేక జీవక్రియలు సజావుగా జరుగుతాయి. దీనిలో ఏదైనా లోపం ఏర్పడితే దాని దుష్ర్పభావం కంటిపైనా పడవచ్చు. అప్పుడు కనిపించే లక్షణాలివే...  
కన్నుగుడ్డు  బయటకు పొడుచుకు వచ్చినట్లుగా కనిపించడం (ప్రాప్టోసిస్)  
ఒకే వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం (డిప్లోపియా)
 
 కంటికి రంగులను చూసే శక్తి క్షీణించడం (డిఫెక్టివ్ కలర్ విజన్)  
 కన్ను పూర్తిగా పొడిబారిపోవడం (డ్రై ఐ)  
 కార్నియాకు సంబంధించిన సమస్యలు రావచ్చు.
 
 పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... థైరాయిడ్ సమస్య ఉన్నవారు  
 డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి  
 అవసరాన్ని బట్టి స్టెరాయిడ్స్ తీసుకోవాలి  
 కొన్ని ఇమ్యునో సప్రెసెంట్స్ వాడాలి  
 అవసరాన్ని బట్టి రేడియోథెరపీ తీసుకోవాల్సిరావచ్చు.  
 తప్పని పరిస్థితుల్లో ఆర్బిటోటమీ అనే శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చు.
 
 డిస్‌లిపిడేమియా
 రక్తంలో ఉండే కొన్ని రకాల కొవ్వు పదార్థాలు (ఉదా: కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ వంటివి) ఉండాల్సిన పాళ్లలో కాకుండా వేర్వేరు విలువలతో ఉండటం వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ కంటిచూపును ప్రభావితం చేసే అవకాశం ఉంది.
 
 పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స...
 కొవ్వులు అతి తక్కువగా ఉండి, పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి  
 తమలోని కొవ్వులు దహనం అయ్యేలా వ్యాయాయం చేయాలి
 కొవ్వులను తగ్గించే మందులను వాడాలి.
 
 రక్తహీనత
 శరీరంలో దాదాపు ఐదు లీటర్ల వరకు రక్తం ఉంటుంది. రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలే శరీరంలోని అన్ని కణాలకూ అవసరమైన ఆక్సిజన్‌ను మోసుకెళ్తుంటాయి. ఈ ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువగా ఉండే కండిషన్‌ను రక్తహీనత (ఎనీమియా) అంటారు. కొందరిలో ఎర్రరక్తకణాల సంఖ్య తగినంతగా ఉన్నా ఆక్సిజన్‌ను మోసుకుపోయే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండవచ్చు. ఇలా రక్తహీనత ఉన్నవారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి.
 
 రెటీనాపై రక్తస్రావం (రెటినల్ హేమరేజ్)  
 కంటిలోని లెన్స్ పారదర్శకత కోల్పోవడం  
 నరాల సమస్య వంటివి కనిపిస్తాయి.
 
 పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స...
 ఎనీమియాను తగ్గించే ఐరన్ టాబ్లెట్లు / మందులు  వాడడం  
 విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం.
 
 గుండెజబ్బులు
 కొన్ని రకాల గుండెజబ్బులు (కార్డియో వ్యాస్క్యులార్ డిసీజెస్) కూడా కంటిపై తన దుష్ర్పభావాన్ని చూపవచ్చు. దీని వల్ల కింద పేర్కొన్న ఈ లక్షణాలు కనిపించవచ్చు.
 
 అకస్మాత్తుగా చూపు కనిపించకపోవడం  
 తాత్కాలికంగా చూపు కోల్పోవడం  
 కంటి చూపునకు దోహదపడే నరానికి (ఆప్టిక్ నర్వ్‌కు) సంబంధించిన సమస్యలు.
 
 పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... అసలు సమస్యకు చికిత్స చేయించు కోవ డమే... గుండెజబ్బుల కారణంగా వచ్చే కంటి సమస్యలకు కూడా పరిష్కారం. అలాగే, దీనితో పాటు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
 
 కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్
 కొలాజెన్ అనేది శరీరంలోని ఒక రకం ప్రోటీన్లతో కూడిన కణజాలం. మన రోగనిరోధక శక్తి మన కణజాలాన్నే శత్రువుగా పరిగణించి కొలాజెన్ అనే మన ప్రొటీన్లపై దాడి చేయడం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. వాటన్నింటినీ కలిపి కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్‌గా అభివర్ణిస్తారు. ఆ వ్యాధులు ఏమిటంటే...
 
 సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ)  
 కీళ్లనొప్పులు (జాయింట్ పెయిన్స్)  
 రుమటాయిడ్ ఆర్థరైటిస్  వెజెనెర్స్ గ్రాన్యులొమాటోసిస్ వంటి వ్యాధులు అన్నమాట.
 
 ఎస్‌ఎల్‌ఈ (లూపస్): లూపస్ అంటే ఉల్ఫ్ (తోడేలు) అని అర్థం. ముఖం మీద ముక్కుకు ఇరువైపులా మచ్చతో కనిపించే వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని సిస్టమిక్ లూపస్ అరిథమెటోసస్ (ఎస్‌ఎల్‌ఈ) అని  చెబుతారు.
 
 లక్షణాలు
 ముక్కుపై నుంచి చెంపల పైన ఇరువైపులా మచ్చల్లా కనిపించే దద్దుర్ల (ర్యాష్) లాగా వస్తుంది. సూర్యకాంతి ప్రతిస్పందన (ఫోటో సెన్సిటివిటీ)తో ఈ ర్యాష్ మరింత పెరగవచ్చు.
     
 కాళ్లూ చేతులకు సంబంధించిన రెండు మూడు కీళ్లలో వాపు వస్తుంది. రుమటాయిడ్ జబ్బుల్లోలా లూపస్‌లో జాయింట్స్ వాపు వచ్చి జాయింట్స్ ఒంగిపోతాయి. అయితే... రుమటిజంలో లాగా ఈ ఒంపు వల్ల శాశ్వత అంగవైకల్యం రాదు. ఇలా కీళ్లు ఒంగిపోవడం అన్నది తాత్కాలికంగానే జరుగుతుంది.
     
 కొందరిలో డిప్రెషన్ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. వీరి సమస్యను మానసికమైన లేదా నరాలకు సంబంధించినదిగా పొరబాటుపడే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లలో ఏఎన్‌ఏ పరీక్ష  నిర్వహించి- లూపస్ వల్ల మెదడుపై ఏదైనా దుష్ర్పభావం పడిందేమో పరీక్షించాలి.
    
 కొందరిలో ఫిట్స్ కూడా రావచ్చు.
     
 పై వ్యాధి వల్ల కంటికి జరిగే దుష్పరిణామం ఏమిటంటే... అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరిగి  (హేమరేజిక్ రెటినైటిస్) అంధత్వానికి దారితీయవచ్చు.
     
 కొందరిలో కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉండవచ్చు.
     
 కొందరిలో జుట్టు రాలిపోవచ్చు.
     
 మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు.
 
 వీటన్నింటితో పాటు కళ్లకు సంబంధించి కన్ను పొడిబారడం (డ్రై ఐ), రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరా పొరకు మధ్య ఇన్‌ఫ్లమేషన్ రావడం (యువైటిస్), స్క్లెరా పొరకు ఇన్‌ఫ్లమేషన్, కార్నియాకు ఇన్‌ఫ్లమేషన్ రావడం  (కెరటైటిస్) వంటి సమస్యలు రావచ్చు.
 
 పిల్లల్లోనూ...
 పిల్లల్లోనూ లూపస్ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అని అంటారు. పిల్లల్లో జ్వరం వచ్చి రెండు మూడు కీళ్లలో వాపు రావడం ద్వారా ఇది కనిపిస్తుంది. ఎండను చూడలేక బాధపడుతుండే పిల్లల విషయంలో జువెనైల్ లూపస్ ఉందేమోనని అనుమానించి పరీక్షలు చేయించడం ముఖ్యం. పిల్లల్లో వచ్చినప్పుడు (నియోనేటల్ లూపస్)- పుట్టుకతోనే గుండె కవాటాలలో లోపం (కంజెనిటల్ హార్ట్ బ్లాక్) రావచ్చు. ఇలా పిల్లల్లో లూపస్ వస్తే అది కళ్లపై దుష్ర్పభావం చూపుతుంది కాబట్టి స్కూళ్లకు వెళ్లే వయసు పిల్లల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్యపరీక్షలు, కంటి పరీక్షలు (మాక్యులార్ టెస్ట్) చేయించడం మంచిది.
 
 పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స...
 ప్రధానమైన సమస్యలైన ఎస్‌ఎల్‌ఈ, కీళ్లనొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి చికిత్స తీసుకోవడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలకూ తగిన చికిత్స తీసుకోవాలి. ఇక పిల్లల్లో జువెనైల్ సిస్టమిక్ లూపస్‌ను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ పిల్లలందరికీ కంటివైద్యుల ద్వారా తరచూ పరీక్షలు చేయించడం కూడా ఒక మంచి ఆలోచనే.
 
 పోషకలోపాలు
 మనం తీసుకునే ఆహారంలో విటమిన్‌లు అనే పోషకాలు లోపించడం వల్ల కూడా కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి. అందుకే ఆయా విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. లేదా అన్ని విటమిన్లూ అందేలా సమతులాహారాన్ని తీసుకోవడం మంచిది.
 
 విటమిన్ లోపం- ఏర్పడే సమస్య
 విటమిన్ ఏ-    కన్ను పొడిబారడం, రేచీకటి, అంధత్వం     (కార్నియల్ బ్లైండ్‌నెస్)
 విటమిన్ బి1- కార్నియల్ అనస్థీషియా, కార్నియల్ డిస్ట్రొఫీ
 విటమిన్ బి2- చూపు మసక బారడం, ఫొటో ఫోబియా (వెలుగు చూడలేకపోవడం), కంజెంక్టివా పొరపై దురదలు, మంటలు
 విటమిన్ సి-    కంజెంక్టివా పొరలో రక్తస్రావం, కనురెప్పలు, రెటీనా సమస్యలు.
 విటమిన్ డి-    జోన్యులార్ క్యాటరాక్ట్, ఆప్టిక్ నర్వ్ వాపు
 
 చివరగా...
 పైన పేర్కొన్న వ్యాధులేగాక రకరకాల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్, పరాన్నజీవుల కారణంగా వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కళ్లు ప్రభావితమవుతాయి. ఇందులో అతి ముఖ్యమైనది - ఎయిడ్స్ వల్ల కంటిపై పడే దుష్ర్పభావం. అందుకే ఏదైనా బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, పరాన్నజీవుల (పారసైటిక్) ఇన్ఫెక్షన్ తర్వాత ఒకసారి కంటి డాక్టర్‌తో కూడా పరీక్ష చేయించుకోవడం మేలు.  
 
 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement