గుండె, కిడ్నీ, మెదడు సంబంధితతీవ్ర అనారోగ్యాలకు దారి తీసే అవకాశం
హైపర్ టెన్షన్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా 27.15 శాతం మంది బాధితులు
ఏటా మే నెల 17వ తేదీన ప్రపంచ హైపర్‌టెన్షన్ డే నిర్వహిస్తారు. 2005వ సంవత్సరంలో ఇది ప్రారంభం అయింది. మనకు తెలియకుండానే మన మనసును కుంగదీసే ఈ అధిక ఒత్తిడి, దాని ద్వారా వచ్చే అధిక రక్తపోటు గురించి అవగాహన కల్పించి దానిని తరిమికొట్టడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. కాగా ‘మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, నియంత్రిం చండి, ఎక్కువ కాలం జీవించండి’ అనే నినాదంతో ఈ ఏడాది హైపర్ టెన్షన్ డేను నిర్వహిస్తున్నారు.
సాక్షి, అమరావతి: అత్యధికశాతం గుండెపోటు మరణాలకు, మెదడు, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్న రక్తపోటును (హైపర్‌టెన్షన్) సైలెంట్ కిల్లర్‌గానూ పిలుస్తుంటారు. జీవనశైలికి సంబంధించిన ఈ సమస్య ఒకప్పుడు మధ్యవయస్సు వారు, వృద్ధుల్లో అధికంగా ఉండేది.
జంక్‌ఫుడ్, శ్రమ లేని జీవనశైలి, తగినంత వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, ధూమపానం, ఒత్తిడి వెరసి యువత, పిల్లలు సైతం ప్రస్తుతం ఈ సమస్య బారినపడుతున్నారు. చాపకింద నీరులా శరీరానికి ముప్పు తెచ్చిపెడుతున్న హైపర్‌టెన్షన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
27.15 శాతం మంది
రాష్ట్రంలో 1.96 కోట్ల మంది 30 ఏళ్లు పైబడిన జనాభా ఉంది. కాగా, వీరిలో 27.15 శాతం 53.39 లక్షల మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే–5లో అంచనా వేశారు. కాగా, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 30 ఏళ్లు పైబడిన వారందరినీ స్క్రీనింగ్ చేసిన వైద్య శాఖ ఇప్పటి వరకు 23.50 లక్షల మందిలో సమస్యను గుర్తించింది. వీరందరికీ ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వ్యవస్థల ద్వారా క్రమం తప్పకుండా వైద్య పరీక్షల నిర్వహణ, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు.
కళ్ల నుంచి కాళ్ల వరకూ..
పైకి ఎలాంటి లక్షణాలు లేకుండానే లోలోపల తీవ్ర అనర్థాలకు హైపర్‌టెన్షన్ దారితీస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు మూలంగా కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని కంటి చూపు మందగిస్తుంది. గుండె మరింత బలంగా పనిచేయాల్సి రావడంతో గుండె పరిమాణంలో మార్పులు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతో శరీరానికి తగినంత రక్తం సరఫరా అవ్వక గుండె వైఫల్యంకు దారి తీస్తుంది. మెదడులోని రక్తనాళాలు దెబ్బతినడం, బలహీనపడడం, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి పక్షవాతం వంటి ఘటనలు సంభవిస్తాయి. మూత్రపిండాల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినడంతో రక్తాన్ని వడపోసే ప్రక్రియ అస్తవ్యస్తమై, చివరికిది కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.
బీపీ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
» ఆహారంలో ఉప్పును తగ్గించాలి. నిల్వ పచ్చళ్లు ఎక్కువగా తినకూడదు. పెరుగు, మజ్జిగలో ఉప్పు కలుపుకోవడం మానేయాలి.
» శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ఒక కిలో బరువు తగ్గినా ఒక ఎంఎంహెచ్‌జీ రక్తపోటు తగ్గుతుంది.
» రోజు అరగంట చొప్పున శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇతర వ్యాయామం చేస్తుండాలి.
» ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు పూర్తిగా విడనాడాలి. పొగతాగడంతో రక్తనాళాలు గట్టిపడే ప్రక్రియ ఎక్కువ అవుతుంది. అదే విధంగా మద్యపానం చేసేవారు 60 ఎంఎల్ కన్నా మించకుండా చూసుకోవాలి.
ఒత్తిడే ప్రధాన కారణం
బీపీ రెండు రకాలుగా వస్తుంది. ఒకటి వయోభారం రీత్యా, రెండోది షుగర్, థైరాయిడ్, కిడ్నీ సమస్యల కారణంగా వస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో, యువతి, యువకుల్లోను బీపీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇంటర్, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ చదివే పిల్లల్లోను ఎక్కువగా బీపీ మేం గమనిస్తున్నాం. ఇందుకు ప్రధాన కారణం ఒత్తిడి. అదే విధంగా పిజ్జా, బర్గర్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌ను పిల్లలు, యువత ఎక్కువగా తీసుకోవడం. వీటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటోంది. ఎప్పటికప్పుడు అందరూ బీపీ చెక్ చేయించుకోవాలి. – డాక్టర్ కె.సుధాకర్, ప్రిన్సిపాల్ సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ
ఏటా చెకప్ చేయించుకోవాలి
ఎటువంటి లక్షణాలు లేకున్నా బీపీ వస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఏటా రక్తపోటు చెకప్ చేయించుకోవాలి. చాపకింద నీరులా విస్తరిస్తూ ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తోంది. అదే విధంగా ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్ టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ లెవల్ టెస్ట్ చేసుకోవాలి. కొలె్రస్టాల్ గుండెపోటుకు దారితీస్తుంది. మరోవైపు ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా కంటి నిండా నిద్రపోవాలి. – కె.కళ్యాణ చక్రవర్తి, జనరల్ ఫిజిషియన్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment