రెండు దశాబ్దాల్లో 180 శాతం పెరుగుదల
1999లో లక్ష మంది పురుషుల్లో 2.1గా ఉన్న మరణాల రేటు..
2020 నాటికి 7.2కు పెరుగుదల
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడి
ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి... అన్ని వయసుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వెరసి కొన్ని అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇందులో ఊబకాయం కూడా ఆ కోవకు చెందినదే. వివిధ జబ్బులకు కారణమవుతున్న ఈ సమస్య మరణాల ముప్పును కూడా పెంచుతోంది. ఊబకాయుల్లో గుండె జబ్బుల మరణాలు గడచిన రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగినట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. 1999 నుంచి 2020 నాటికి ఊబకాయంతో ముడిపడి ఉన్న గుండె జబ్బుల మరణాల రేటు సుమారు 180 శాతం పెరిగినట్టు నిర్ధారించారు.
పురుషుల మరణాల రేటులో పెరుగుదల
అధ్యయనంలో భాగంగా ఊబకాయ సంబంధిత ఇస్కిమిక్ గుండె జబ్బుతో ముడిపడిన 2.26 లక్షల మరణాలపై పరిశోధన నిర్వహించారు. 1999లో ప్రతి లక్ష మంది పురుషుల్లో 2.1గా మరణాలు రేటు ఉన్నట్టు గుర్తించారు. ఇది 2020నాటికి 243 శాతం పెరిగి 7.2కు చేరుకున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా మహిళల్లో 1999లో ప్రతి లక్ష మందికి 1.6గా ఉన్న మరణాల రేటు... 131 శాతం పెరిగి 2020 నాటికి 3.7కు చేరుకుంది. అధ్యయనంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఇస్కిమిక్ హార్ట్ స్ట్రోక్‌కు ఊబకాయం తీవ్రమైన ప్రమాదకారిగా నిర్ధారించారు. బరువు పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం వృద్ధి చెందుతోందని అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ అలీనా మోహ్సిన్ తెలిపారు.
ఏమిటీ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్
గుండెకు రక్తం సరఫరాలో ఏర్పడే ఇబ్బందిని ‘ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్’ అంటారు. దీనికి పొగతాగడం, బీపీ, షుగర్, రక్తంలో కొలె్రస్టాల్, ఊబకాయం ప్రధాన కారణం. గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు కొన్ని రోజులకు గుండె కండరం
క్రమేణా క్షీణిస్తూ... దెబ్బతింటుంది. ఈ డ్యామేజ్ శాశ్వతంగా అవ్వకముందే గుర్తించి వైద్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అరికట్టవచ్చు. యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులను వైద్యులు గుర్తిస్తారు. అడ్డంకులు ఉన్నట్లయితే అవసరమైన మేరకు చికిత్స చేయడం, స్టెంట్ వేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ]
ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మృతికి గుండె జబ్బే కారణం
ప్రపంచవ్యాప్తంగా గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఊబకాయుల్లో గుండె వైఫల్యం, ఆకస్మిక గుండెపోటు, ధమనుల గోడల్లో కొవ్వు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టడం, గుండె కొట్టుకోవడంలో అసమతుల్యత ప్రమాదాలు ఉన్నట్టు ఆ సర్వేలో గుర్తించారు. సాధారణ బరువున్న వారితో పోలిస్తే ఊబకాయుల్లో టైప్–2 డయాబెటీస్ బారినపడే ప్రమాదం మూడు రెట్లు అధికమని పేర్కొన్నారు. 20–49 ఏళ్ల వయసున్న పురుషుల్లో 78 శాతం, మహిళల్లో 65 శాతం అధిక రక్తపోటుకు బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ) ఎక్కువగా ఉండటమే కారణమని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment