పోషకాలే అయినా... ఎక్కువైతే కష్టం!
ఆహారం- ఆరోగ్యం
ఆహారం, ఆరోగ్యం ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఆరోగ్యంగా ఉండడానికి, అనారోగ్యం పాలవడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. ఆహారాన్ని మితంగా తీసుకుంటూ దానికి తగినట్లుగా వ్యాయామం ఉండేటట్టు జాగ్రత్తపడాలి.అధునాతన జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం వల్ల ఆహారంలో తీసుకున్న పోషకాలు ఖర్చు కాకుండా నిల్వ చేరుతున్నాయి. కాబట్టి కొవ్వు పదార్థాలను తగ్గించాలి. మన సంప్రదాయ ఆహారపదార్థాలతో శరీరానికి కావలసిన అన్ని పోషకాలూ సమృద్ధిగా అందుతాయి.
గింజల పొట్టును తీయకుండా వాడడం వల్ల పూర్తిస్థాయిలో ఆరోగ్యాన్నిచ్చే గుణం మన వంటకాలకు ఉంది. మన తెలుగువారి సంప్రదాయ పిండివంటలన్నీ రుచితోపాటుగా శక్తిని, పోషణను ఇచ్చేవే. తగుమోతాదులో సుగంధద్రవ్యాలు తీసుకోవడం మంచిదే కాని ఉప్పు, నూనెల విషయంలో కచ్చితంగా ఉండాలి.
హోటల్‌లో, ఇతర బయట ఆహారపదార్థాలకు వీలయినంత వరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో రుచి మాత్రమే ప్రధానం అన్నట్లుగా నూనె, ఉప్పు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లే కొద్దీ దీర్ఘకాలంలో హైపర్‌టెన్షన్, డయాబెటిస్, హార్ట్‌ఎటాక్‌లకు దారి తీసే అవకాశం ఎక్కువ.కోలా వంటి శీతల పానీయాలలో ఉండే చక్కెర శరీరంలోకి చేరి కొవ్వుగా రూపాంతరం చెందుతుంది.