సాక్షి, అమరావతి: ఎంతగా కష్టపడితే అంతగా సుఖపడతారు అనేది జీవితానికే కాదు శరీరానికి సైతం వర్తిస్తుంది. ఆధునిక జీవనశైలి అనారోగ్యాన్ని ఆహ్వానిస్తోంది. నేటితరం మనుషులకు వ్యాయామం అంటే ఏమిటో తెలియకుండా పోతోంది. ఫలితంగా మధుమేహం, హైపర్ టెన్షన్, గుండెపోటు, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ–అసాంక్రమిక వ్యాధులు) సంక్రమిస్తున్నాయి. ఒకప్పుడు జీవిత చరమాంకంలో వచ్చే మధుమేహం ఇప్పుడు మూడు పదుల వయసులోనే పలుకరిస్తోంది. చాలామంది నలభై ఏళ్ల వయసుకు ముందే గుండెపోటు బారిన పడుతున్నారు. ఇక రక్తపోటు కామన్ డిసీజ్‌గా (సాధారణ జబ్బు) మారిపోయింది. అధిక రక్తపోటు కారణంగా ఏటా వేలాది మంది పక్షవాతం (పెరాలసిస్) బారిన పడి శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. అసాంక్రమిక వ్యాధుల వల్ల బాధిత కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.
అగ్నికి ఆజ్యం పోసినట్టు...
శరీరానికి తగిన వ్యాయామం లేక జబ్బులకు గురవుతుండగా, మరోవైపు జంక్ ఫుడ్ వినియోగం పెరుగుతుండడం తీవ్ర అనర్థాలకు దారి తీస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) సర్వే ప్రకారం.. ఆధునిక యుగంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం బాగా తగ్గిపోయింది. దీనివల్ల చిన్నతనం నుంచి రకరకాల జబ్బులు సోకుతున్నాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక ఉండాలని, లేదంటే చాలా జబ్బులు చుట్టుముడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు 20 శాతం మంది మధుమేహ(డయాబెటిస్) బాధితులేనని అంచనా. జీవనశైలి జబ్బులు అమాంతం పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌తో(ఐసీఎంఆర్) కలిసి పైలెట్ ప్రాజెక్టు కింద విశాఖ, కృష్ణా జిల్లాల్లో హైపర్ టెన్షన్ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. తర్వాతి దశలో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment