సేఫ్‌ కిడ్నీ | Today is World Kidney Day | Sakshi
Sakshi News home page

సేఫ్‌ కిడ్నీ

Published Wed, Mar 8 2017 10:34 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

సేఫ్‌ కిడ్నీ

సేఫ్‌ కిడ్నీ

నేడు వరల్డ్‌ కిడ్నీ డే

అర్థంచేసుకోకపోతే...
కిడ్నీ ఒక పెద్ద పజిల్‌
అర్థం చేసుకుంటే... చాలా సేఫ్‌


ఇల్లూడ్చకపోతే ఆ ఇల్లెలా ఉంటుందో అందరికీ తెలుసు.
ఇల్లూడ్చే బాధ్యతలాగే... మన ఒళ్లూడ్చే పని చేస్తుంది కిడ్నీ.
మన ఒంట్లోని ప్రతి రక్తబ్బొట్టునూ శుభ్రంగా కడుగుతుంది.
అలా బుద్ధిగా రక్తం మొత్తాన్ని శుద్ధి చేస్తుంది.
ఒంటి లోపల ఒళ్లూడ్చీ, కడిగే ఈ కీలకవయవాలు
నడుములోపల ఇరువైపులా సగం వంచిన బాణచాపాల్లా ఉంటాయి.
సురక్షాత్మక రక్షణ కవచాల్లా ఉంటాయి.
బక్కెట్ల కొద్దీ మాలిన్యాలను వెలికి తీస్తుంటాయి.
అలా అవి మన రక్షణ బాధ్యత తీసుకున్నప్పుడు వాటిని కాపాడుకునే బాధ్యత మనమూ తీసుకోవాలి కదా.
అదెలాగో తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక కథనం.


మీ దేహానికి మీరే దేవదేవుడు. మీ ఒళ్లే మీ కొవెల. మీ దేహాలయపు గర్భగుడి  లోపల ద్వారపాలకుల్లా మిమ్మల్ని నిరంతరం రక్షించేందుకు మీకు ఇరుపక్కలా ఉంటాయి రెండు కిడ్నీలు. మీ దేహక్రియలూ, మీ జీవక్రియల మాలిన్యాలతో వచ్చే అనేక గండాలను కడిగిపారేసే ఆ రక్షకులే మీ మూత్రపిండాలు.

కేవలం రక్షించే పనేనా...
కిడ్నీ అంటే కేవలం రక్తంలోని మలినాలను మాత్రం కడిగేసే హౌజ్‌కీపింగ్‌ పని మాత్రమే చేస్తాయని అనుకుంటున్నారా? కాదు... దేహానికి మాస్టర్‌కెమిస్ట్‌లు అవి. ఎర్ర రక్తకణాల ఉత్పాదనలోనూ వాటా తీసుకుంటాయి. ఒంట్లో నీటిసరఫరాను నియంత్రిస్తాయి. మీ దేహమే ఒక దేశమైతే అందులోని ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ బాధ్యత అంతా కిడ్నీలదే.

ఆ చీపురు పేరే నెఫ్రాన్‌...
ఒంట్లోని ప్రతి రక్తపు బొట్టునూ కడిగేయడానికి పనిచేసే కిడ్నీలోని చీపురు లాంటి దాన్ని ‘నెఫ్రాన్‌’ అంటారు. అలాంటి పది లక్షల చీపుర్లు నిరంతరం, అనునిత్యం పనిచేస్తూ ఒంట్లోంచి కసవును ఊడ్చేస్తుంటాయి. జీవక్రియల వల్ల వెలువడ్డ అడుసును కడిగేస్తుంటాయి.  ఈ కిడ్నీ నెఫ్రాన్‌ అనే చీపురులో సన్నటి తీగలుగా చుట్టుకునే ఉండే చీపురుపుల్ల పొడవెంతో తెలుసా? అక్షరాలా 105 కిలోమీటర్లు. మూత్రపిండాల్లోని నెఫ్రాన్‌లు తొండాలతో తోడినట్లుగా మలినాలను తోడేసి దేహ గండాలను తొలగిస్తాయి. అలాంటి నెఫ్రాన్లు పది లక్షలు విలక్షణంగా పనిచేస్తూ దేహాన్ని లక్షణంగా ఉంచుతాయి. అలా నిస్వార్థంగా వ్యర్థాలను బయటకు నెట్టే అర్ధవంతమైన పనిని అనునిత్యం చేస్తూ ఉంటాయవి.

మనలో ఉండి... మల్టీ టాస్కింగ్‌
ఒంటిని శుభ్రం చేసే ఒక్క పనిని ప్రధానంగా పెట్టుకోకుండా, అనుబంధంగా కొనరు పనులెన్నో కోరి చేస్తుంటాయవి. ఉదాహరణకు ∙ఒంట్లో నీళ్ల పాళ్లను ఎప్పుడూ సమంగా ఉంచడం. ∙రక్తపోటును అదుపులో పెట్టడం ∙మూలుగ ఇండస్ట్రీలో ఉత్పత్తి అయ్యే  ఎర్రరక్తకణాల తయారీకి అనుబంధ పరిశ్రమలాగా సహాయపడటం ∙చర్మం, ఎముకలు... ఇలా దేహం మొత్తంలో ‘డి‘ విటమిన్‌ ఉత్పత్తి జరిగేలా ప్రేరేపించడం. ∙అంతేకాదు... సోడియమ్, పోటాషియమ్‌ పీహెచ్‌ పాళ్లను సరిచూస్తాయి. ఇవి కిడ్నీ చేసే పనుల్లో కొన్ని మాత్రమే. మనలో ఇలా మల్టీ టాస్కింగ్‌ చేసే కిడ్నీ సేఫ్‌గా ఉంచడం మన కర్తవ్యం కదా. మరి వాటి రక్షణకు ప్రతికూలంగా  పనిచేసే అంశాలనూ ముందుగా తెలుసుకుందాం.

మన రక్షణ కోసం ఆ రెండూ... ఆ రెండింటి శత్రువులు మరిరెండూ...
మన దేహాన్ని కాపాడటం కోసం రెండు మూత్రపిండాలు పనిచేస్తుంటాయి కదా. మరి ఆ ఇద్దరి వెనకా నిత్యం చెరో ఇద్దరు శత్రువులూ పొంచి ఉంటారు.
మొదటిది డయాబెటిస్‌... ఆ రెండింటిలో మొదటిది డయాబెటిస్‌.

రెండోది అధిక రక్తపోటు (హైబీపీ). నూరుమంది కిడ్నీ బాధితులను తీసుకుంటే అందులో 40 శాతం మంది డయాబెటిస్‌తో కిడ్నీలను చెడగొట్టుకున్నవారే. రెండోది హైబీపీ... మరో 30 శాతం మంది హైబీపీలను నియంత్రణలో ఉంచుకోకపోవడం వల్ల కిడ్నీలను దెబ్బతీసుకున్నవారే. అందుకే ఈ రెండు సమస్యలను నియంత్రణలో ఉంచుకోగలిగితే కిడ్నీలు దెబ్బతినకుండా చూసుకోవడం చాలా సులభం.

చక్కెర చేటు... రక్తపోటు వేటు...
ప్రపంచంలోనే చక్కెరవ్యాధిగ్రస్తుల విషయంలో మనదేశం అగ్రస్థానంలో ఉంది. ఐదుగురు సభ్యులున్న ప్రతి కుటుంబంలోనూ ఇద్దరు చక్కెర వ్యాధిగ్రస్తులున్నారని ఒక అంచనా.చిన్నతనంలోనే వచ్చే (టైప్‌–1) డయాబెటిస్ బాధితుల్లో 10–30 శాతం మంది, పెద్దయ్యాక వచ్చే (టైప్‌–2) డయాబెటిస్‌ బాధితుల్లో 40 శాతం మంది మూత్రపిండాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిస్‌ ఉందంటే అటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలతో పాటు, కిడ్నీలు పాడయ్యే అవకాశాలూ ఉన్నాయని గుర్తుంచుకోవాలి.ఇక ఆధునిక జీవనశైలిలోని ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడితో కూడిన వృత్తులు వంటివి మన రక్తపోటు (హైబీపీ) సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. దాంతో హైబీపీ కారణంగా దెబ్బతినే ప్రధాన అవయవాల్లో కిడ్నీ ప్రధానమైనది.

ఆ రెండింటి నుంచి కిడ్నీల రక్షణ ఎలాగంటే...
కిడ్నీలు మన రక్తంలోని వ్యర్థాలను వడగడుతుంటాయి కదా. ఈ క్రమంలో వ్యర్థాలను సేకరించి శరీరానికి హాని చేసేవాటిని బయటకు పంపే కీలక బాధ్యతను నిర్వహిస్తుంటాయి. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి విఫలం కావడం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నార్మల్‌కు రావడం చాలా కష్టం. అదేగాని పూర్తిగా విఫలమైతే ఇక నిత్యం కృత్రిమంగానే రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్‌ అంటారు.

ఆర్థికంగానూ కుంగదీసే అంశమది...
డయాలసిస్‌ ప్రక్రియ కుటుంబాలపై ఎంతో ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఎంత కాదన్నా ప్రతి నెల ఐదారువేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాడైపోయిన మూత్రపిండానికి చికిత్స తీసుకుంటూ ఉన్నా అది పూర్తిగా సమర్థంగా మారదు. క్రమంగా గుండెజబ్బులు, అవయవాలు దెబ్బతినడం వంటివి మొదలవుతాయి. పోనీ... దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలన్నా కిడ్నీ దాతలు దొరకడం కష్టం. ఆపరేషనే పెద్ద ప్రయత్నం అనుకుంటే... ఇక ఆ తర్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ చాలా ఎక్కువగా ఖర్చవుతుంది. ఇలా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారి కుటుంబానికి అటు డయాలసిస్‌ కోసం, ఇటు మందుల కోసం ఆర్థికంగా ఎంతో ఖర్చు అవుతుంటుంది. సరే... ఖర్చును ఎలాగోలా భరిద్దామనే అనుకున్నా మందులతో ఇతర సమస్యలు, దుష్ప్రభావాలు, ఇబ్బందులు కలుగుతాయి. ఈ అన్ని అంశాల సమగ్ర ఫలితాలతో మీ జీవనప్రమాణాలు, ఆయుర్దాయం తగ్గవచ్చు. అందుకే కిడ్నీలు దెబ్బతినకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైన మంచిది, అది అవసరం కూడా.

కీలకమైన కిడ్నీలను కాపాడుకోవాలంటే...
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. చక్కెరవ్యాధిగ్రస్తులు ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా హెచ్‌బీఏ1సీ అనే పరీక్షను మూడు నెలలకు ఒకసారి చేయిస్తూ దాని ఫలితం 6.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఏమీ తినకముందు షుగర్‌ 100 ఎంజీ/డీఎల్‌ లోపల ఉండాలి. తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్‌ ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు ఉన్నవారు తమ బీపీని నిత్యం 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

రక్తంలో కొలెస్ట్రాల్‌ పాళ్లు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ∙మన ఆహారంలో ఉప్పును పరిమితం చేసుకోవాలి. బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. ∙మూత్ర విసర్జన సమయంలో మూత్రంలో సుద్దలా పోతున్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

కిడ్నీల పరిరక్షణకు తేలికైన పరీక్షలు...
చిన్నప్పుడే వచ్చిన (టైప్‌–1) డయాబెటిస్‌ బాధితులు, ఆ వ్యాధి బారిన పడిన ఐదేళ్ల నుంచి ప్రతి ఏటా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే పెద్దయ్యాక వచ్చిన (టైప్‌–2) డయాబెటిస్‌ బాధితులు దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరును తెలుసుకునే పరీక్షను చేయించుకోవాలి. ఆ తర్వాతినుంచి ప్రతి ఏడాది ఒక్కసారైనా క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్ష చేయించుకుంటూనే ఉండాలి. దీనివల్ల కిడ్నీ సమస్యలేవైనా తలెత్తుతున్నాయా అన్న విషయాన్ని గుర్తించి దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవచ్చు. ఆ తేలికైన పరీక్షలివి...
     
మూత్రంలో ఆల్బుమిన్‌ : ఇది ఒక రకం ప్రోటీన్‌. మూత్రంలో సుద్దలా పోతుందంటే కిడ్నీల వడపోత సామర్త్యం తగ్గినట్లే. అందుకే మధుమేహ బాధితులు ప్రతిఏటా మూత్రంలో ఆల్బుమిన్‌ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు.

రక్తంలో సీరమ్‌ క్రియాటినిన్‌ : మన కిడ్నీల వడపోత సామర్థ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగానే కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని (ఎస్టిమేటెడ్‌ గ్లోమెరూలార్‌ ఫిల్టరేషన్‌ రేట్‌ – ఈజీఎఫ్‌ఆర్‌)ను లెక్కించి, కిడ్నీ సమస్య తలెత్తే అవకాశం ఎంత ఉందని అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. ఉంటుంది. ఇది 60 మి.లీ. కంటే తక్కువగా ఉంటే మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. అలాగే కేవలం సీరమ్‌ క్రియాటినిన్‌ అనే పరీక్ష మాత్రమే సరిపోదు. ఎందుకంటే కిడ్నీలు 50 శాతం దెబ్బతినేవరకూ రక్తపరీక్షలో సీరమ్‌ క్రియాటినిన్‌ పెరిగినట్లుగా తెలిసే అవకాశం లేదు. కాబట్టి ‘ఈజీఎఫ్‌ఆర్‌’ను చూసుకోవడం ముఖ్యం. సీరమ్‌ క్రియాటినిన్‌ను పరీక్షించి, రోగి వయసు, బరువు, ఎత్తు వంటి కొన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా ‘ఈజీఆర్‌ఎఫ్‌’ను లెక్కిస్తారు.

డాక్టర్‌ ఊర్మిళ ఆనంద్‌
సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌ అండ్‌
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement