ఏటా పెరుగుతున్న మానసిక సమస్యలు
స్మార్ట్‌ఫోన్ల వాడకంతో అధిక ప్రభావం
మానసిక ఆరోగ్య అవగాహన నెల మే
గుంటూరు మెడికల్: ఇంట్లో పిల్లలు అదే పనిగా వీడియోగేమ్స్ ఆడుతూ మిగతా పనులను పక్కన పెట్టేస్తున్నారా.. తదేకంగా గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయి ఉంటున్నారా.. అయితే వారిని ఓ కంట కనిపెట్టి ఉండాల్సిందే. లేకుంటే చిన్నవయస్సులోనే వారు మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని మానసిక వ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చుని చాటింగ్‌లు చేయటం, ఫేస్‌బుక్‌లో తలమునకలవుతూ ఉండటం మానసిక వ్యాధులకు కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
సెల్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వినియోగం బాగా పెరగడం వల్ల మానసిక జబ్బులు ఎక్కువయ్యాయని ఈ–ఎడిక్షన్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. మానసిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా మే నెలను ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా 35 మంది మానసిక వైద్యనిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ 20 మంది వరకు వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడే వారు వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో రోజూ 100 నుంచి 130 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్నారు.
మానసికవ్యాధి లక్షణాలు...
చికాకు, కోపం, విసుగు తదితర లక్షణాలు వారానికి పై బడి ఉంటే వారు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాలి. తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా తనొక్కడే ఉండి నవ్వుకోవటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోవటం, చేసిన పనిని పదేపదే చేయాలనుకోవటం, అనవసరమైన ఆలోచల్ని ఆపుకోలేకపోవటం, నిద్రలోపం, బరువుపెరగటం, నిర్ణయాలు తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేసి తనమీద ఆధారపడే వారందరిని ఇబ్బందికి గురిచేస్తూ తానూ ఇబ్బందులకు గురికావడం, ఎక్కువ సమయం పనిమీద ఏకాగ్రత లేకుండా కాలక్షేపం చేసే ధోరణిలో ఉండటం, తనకు హాని చేస్తున్నట్లు ఊహించుకుని తగాదాల వరకు వెళ్ళటం, తిరగబడి దాడి చేయటం, వ్యక్తిలో ఉన్న అనుమానాలు ఎన్ని రూపాల్లో నివృత్తి చేసే యత్నం చేసినా ఒప్పుకోకపోవటం తదితర లక్షణాలు మానసిక వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి.
హార్మోన్ల లోపమే కారణం
ఒత్తిడి, వ్యసనాలు, మితిమీరిన సెల్‌ఫోన్, ఎల్రక్టానిక్ పరికరాల వినియోగం వల్ల ప్రస్తుతం మానసిక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ జబ్బులు వంశపారంపర్యంగానూ అధికంగా వస్తుంటాయి. మెదడులో రసాయనాలు ఊరటంలో మార్పు, మెదడులో గడ్డలు ఏర్పటం, మెదడులో ‘డోపమిన్’ హార్మోన్ లోపం, హార్మోన్ అసమతుల్యం, అసమానత్వం, పుట్టుకతో మెదడు సరిగ్గా ఎదగకపోవటం, ఫిట్స్, నిద్రలేమి వల్ల కూడా మనో వ్యాధులు వస్తాయి. మానసిక వ్యాధులతో ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు ఎక్కువగా బాధపడుతున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళనకు గురిచేసే విషయాలను పట్టించుకోకూడదు. మద్యం, పొగతాగటం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆరు నుంచి తొమ్మిది గంటలపాటు నిద్రపోవాలి. కుటుంబ సభ్యులందరితో సమయం గడపాలి. రోజూ వ్యాయామం చేయాలి. మానసిక వ్యాధులకు అనేక ఆధునిక మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఇవటూరి శరత్‌చంద్ర, మానసిక వైద్య నిపుణులు సంఘం రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు
పిల్లలు, పెద్దలు తేడా లేదు
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ప్రస్తుతం మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్రమశిక్షణ లేని ఆధునిక జీవనశైలే దీనికి కారణం. ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే త్వరగా నయం చేసేందుకు అవకాశం ఉంది. మందులతోపాటుగా రోగులకు కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. వ్యాధి గ్రస్తులను కుటుంబ సభ్యుల పర్యవేక్షిస్తూ మందులు సక్రమంగా మింగేలా చేస్తే వ్యాధి నుంచి త్వరితగతిన బయటపడతారు. –డాక్టర్ ఐవీఎల్ నరసింహారావు, మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గుంటూరు
నాలుగేళ్లుగా జీజీహెచ్‌లో మానసిక సమస్యలతో చికిత్స తీసుకున్న వారు ఇలా..
సంవత్సరం రోగుల సంఖ్య
2020 16,529
2021 22,726
2022 28,579
2023 29,371
2024 2,505
జీజీహెచ్‌లో ఉచిత వైద్యం
మానసిక వ్యాధులకు జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలను అందించటంతోపాటుగా మందులూ పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ 21 నబర్ ఓపీలో వైద్య సేవలు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment