బోర్డర్‌లైన్ డిజార్డర్స్... హెచ్చరించే జబ్బులు... తప్పించుకోగల ముప్పులు!! | Borderline Disorders ... to warn the risk of avoidable disease ... !! | Sakshi
Sakshi News home page

బోర్డర్‌లైన్ డిజార్డర్స్... హెచ్చరించే జబ్బులు... తప్పించుకోగల ముప్పులు!!

Published Tue, Oct 14 2014 12:00 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

బోర్డర్‌లైన్ డిజార్డర్స్... హెచ్చరించే జబ్బులు... తప్పించుకోగల ముప్పులు!! - Sakshi

బోర్డర్‌లైన్ డిజార్డర్స్... హెచ్చరించే జబ్బులు... తప్పించుకోగల ముప్పులు!!

మనిషి శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారన్‌హీట్ డిగ్రీలు ఉండాలి. అంతకంటే ఏ ఒకటో రెండో డిగ్రీలు ఎక్కువైనా అది జ్వరమే గానీ... ప్రమాదకరం కాదు. కానీ ఒకవేళ ఆ ఉష్ణోగ్రత 102 ఫారిన్‌హీట్ దాటితే..? అలాగే మనలోని షుగర్ పాళ్లు పరగడుపున ఎప్పుడూ 90 - 100 లోపు ఉండాలి. ఒకవేళ ఆ సంఖ్య 126 చేరేప్పటివరకూ రోగికి మందులతో అవసరం లేకుండా... శారీరక వ్యాయామాలు, ఆహార నియమాలు తదితర పద్ధతులతోనే సరిపెడతారు డాక్టర్లు. అలాగే రక్తపోటు... ఇది సాధారణంగా 120/80 ఉండాలి. నూట  ఇరవై వరకు ఉండే పై విలువను సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. కింద ఉండే 80 విలువను డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఈ విలువల్లో కొద్దిపాటి తేడాలను డాక్టర్లు పరిగణనలోకి తీసుకోరు. ఉదాహరణకు 120 ఉండాల్సిన చోట 130 పెద్ద పెరుగుదల కాబోదు. కానీ... అదేపనిగా ఎప్పుడూ ఆ ప్రెషర్ 140 కంటే పైనే ఉంటుందనుకుందాం. అప్పుడు దానికి కారణాలను పరిగణనలోకి తీసుకుని వైద్యం చేయాల్సిందే. పై ఉదాహరణలను బట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే... శరీర ఆరోగ్యాన్ని సూచించే కొన్ని అంశాల కొలతలు నిర్ణీత ప్రమాణంలో ఉండాలి. దాని కంటే కొంత పెరగడాన్ని తక్షణం పెద్ద ప్రమాదంగా పరిగణించకపోయినా... సమీప భవిష్యత్తులో వచ్చే పెను ప్రమాద హెచ్చరికగా భావించవచ్చు. జబ్బు ఒక్కసారిగా  రాకుండా... తాను త్వరలో తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఇలా హెచ్చరికలు పంపుతుంటుంది. ఇటువంటి దశలో ఉన్న జబ్బులను ‘బార్డర్‌లైన్ డిజార్డర్స్’గా పేర్కొనవచ్చు. తమ హెచ్చరికలతో భవిష్యత్తు ఆరోగ్యాన్ని అప్రమత్తం చేసే ఆ జబ్బుల గురించి, అవి మరింత ముదరకుండా అవగాహన కోసమే ఈ కథనం.
 
1- హైపర్‌టెన్షన్
 
ప్రతి వ్యక్తి రక్తనాళాల్లోనూ రక్తం కొంత వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వేగం ఇలా కొనసాగాలంటే రక్తనాళాల్లో రక్తం కొంత ఒత్తిడితో ప్రవహించాలి. ఇలా రక్తానికి ఒత్తిడి ఉండాలంటే అది గుండె స్పందనల వల్ల సాధ్యమవుతుంది. గుండె స్పందిస్తోంది అంటే... అది ఒకసారి పూర్తిగా ముడుచుకుంటుందని అర్థం. రక్తనాళాల్లోకి రక్తం కొంత ఒత్తిడితో ప్రవహించడానికి గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు మంచి రక్తనాళాల్లో (ఆర్టరీస్)లో రక్తం ఎంత పీడనంతో ప్రవహిస్తుందో తెలుసుకునే కొలత (రీడింగ్)ను ‘సిస్టోలిక్ ప్రెషర్’ అంటారు. అలాగే రెండు సిస్టోలిక్ ప్రెషర్స్ మధ్యన రక్తనాళాల్లో రక్త పీడనాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఇలా రక్తపోటుకు రెండు విలువలు ఉంటాయి. దీన్నే సాధారణంగా 120/80 గా పేర్కొంటుంటారు. ఇది సాధారణ విలువ.

 ప్రీ-హైపర్‌టెన్షన్: సాధారణంగా వైద్యుడి వద్దకు రోగి వెళ్లగానే చూసేది రక్తపోటు కొలతనే. ఈ కొలత 120/80 ఉంటే అది ప్రమాదరహిత స్థితిగా గుర్తించి ఇక దాని గురించి ఆలోచించరు. కానీ ఈ కొలతలు ఎప్పుడూ ఇదే దశలో ఉండకుండా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉందనుకోండి. అలాగే కింది విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉందనుకోండి. ఆ కొలతలు ఉన్న దశను పూర్తిగా రక్తపోటు ఉన్న దశగా చెప్పలేం. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్‌టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్‌టెన్షన్’ దశ భవిష్యత్తులో ప్రమాదకరమైన ‘హైబీపీ’కి దారితీయవచ్చు.
 
 వెసులుబాటు ఇదే...
 ప్రీ-హైపర్‌టెన్షన్‌లో ఉండే వెసులుబాటు ఏమిటంటే... రోగి వెంటనే మందులు వాడాల్సిన అవసరం లేదు. జీవనశైలిని చక్కబరచుకుని రక్తపోటును స్వాభావికంగానే అదుపులోకి తెచ్చుకునే నష్టనివారణ చర్యలు ప్రారంభించవచ్చు.
 
 తోడుగా ప్రమాదకరమైన పరిస్థితి కూడా...
 రక్తపోటు పెరగడం వల్ల ఏర్పడే దీర్ఘకాలిక అనర్థాలు వెంటనే కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం మొదట్లో అసలు రోగికి తెలియకపోవచ్చు కూడా. అందువల్ల దీనివల్ల జరిగే అనర్థాలు కొనసాగుతూ పోతాయి... ఇదో ప్రమాదకరమైన పరిస్థితి. సాధారణంగా హెచ్చరికలు పంపడం మామూలు పరిస్థితుల్లో తెలియకపోవచ్చు. అందుకే బార్డర్‌లైన్ అనే దశ హైబీపీకి ఉండి, హెచ్చరికలు పంపుతుందిలే అన్న నిర్లక్ష్యం ‘హైబీపీ’ విషయంలో కుదరదు. అందుకే నలభై దాటిన వారు అప్పుడప్పుడూ బీపీని పరీక్షించుకుంటూ ఉండి, అది పంపించే హెచ్చరికలను పరిశీలించుకుంటూ ఉండటం మేలు.
 
 హైపర్‌టెన్షన్ అనర్థాలకు కారణాలు
 బీపీ క్రమంగా పెరుగుతూ పోతే దీర్ఘకాలంలో జరిగే అనర్థాలు చాలా ఎక్కువే. ఉదాహరణకు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అథెరోస్క్లిరోసిస్, గురక వల్ల మెదడుకు, గుండెకు తగినంత ఆక్సిజన్ అందని స్లీప్ ఆప్నియా, శరీరాన్ని ఉత్తేజ పరిచేందుకు ఉపయోగపడే ఎడ్రినల్ గ్రంథులు మితిమీరి పనిచేయడం, కొన్ని మందులు తీసుకోవడం (ఉదా: గర్భనిరోధకమందులు, జలుబు, నొప్పినివారణ మందుల వంటివి), మాదకద్రవ్యాలు తీసుకోవడం వంటి అనేక అంశాలు రక్తపోటును పెంచేందుకు దోహదపడే విషయాలే.
 
 రిస్క్ ఫ్యాక్టర్లు: పెరుగుతున్న వయసు, స్థూలకాయం, హైబీపీ ఉన్న కుటుంబ చరిత్ర, ఒకేచోట కుదురుగా కూర్చుని పనిచేసే జీవనశైలి, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగాకు నమలటం, మద్యం తీసుకోవడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు హైబీపీకి రిస్క్ ఫ్యాక్టర్లు.
 
 నిర్ధారణ: తరచూ రక్తపోటును పరీక్షింపజేసుకుంటూ ఉండాలి. అది తరచు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటే దాన్ని హెచ్చరికగా భావించి వెంటనే జాగ్రత్తపడాలి. రెండు లేదా ఎక్కువసార్లు  బీపీ అధికంగా ఉంటే... దాన్ని రక్తపోటుగా నిర్ధారణ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 
 ఈ జాగ్రత్త తీసుకోండి...
 ప్రీహైపర్‌టెన్షన్ అన్నది ప్రమాదకర దశ కాదు అని రిలాక్స్ కావద్దు. అది పంపే  హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తం కండి. వెంటనే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోండి. ఎందుకంటే అప్పటికీ జాగ్రత్త తీసుకోకపోతే అది గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలంలో మతిమరపు, మెదడుకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాల సమస్యలను తీసుకురావచ్చు.
 
 2- డయాబెటిస్...
 
మనం ఏ పని చేయాలన్నా రక్తంలోని చక్కెర పాళ్లే ఆ శక్తిని సమకూరుస్తాయి. అయితే మనం ఏ పనీ చేయనప్పుడు రక్తంలోని అవే చక్కెరపాళ్లు మాయమై... భద్రపరచుకునే వ్యవస్థ ఒకటి మన శరీరంలో పనిచేస్తుంటుంది. ఇలా... రక్తంలోని చక్కెర పాళ్లను శరీరం తనంతట తానే నియంత్రించుకునే శక్తి శరీరానికి ఉంటుంది. ఒకవేళ ఈ శక్తి లోపించడం ప్రారంభమైతే...? అదే ప్రీ-డయాబెటిస్ దశ.
 
 ప్రీ-డయాబెటిస్ అంటే...

 శరీరం తనలోని చక్కెర పాళ్లను తనంతట తానే అదుపులోకి తెచ్చుకోలేకపోతోందనే హెచ్చరికలు పంపేందుకు సూచనగా చక్కెర కొలతల్లో కొద్దిపాటి తేడాలు కనిపిస్తాయి. నిజానికి ఆ సమయంలో రక్తంలో చక్కెర విలువలు నార్మల్ కంటే ఎక్కువగా ఉంటాయి. అది నిజంగా ఒక హెచ్చరిక లాంటిదే. ఒకవేళ అప్పటికీ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులోని పదేళ్ల వ్యవధిలో ఆ వ్యక్తికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50 శాతం కంటే ఎక్కువ. కాబట్టి ఇది డయాబెటిస్ వచ్చేవారికి ఒక మంచి సూచన లాంటిది. ఈ హెచ్చరిక సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని టైప్-2 డయాబెటిస్‌గా మారకుండా ముందుగానే నివారించుకునే అవకాశం ఉందన్నమాట.
 కారణాలు: డయాబెటిస్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు... రోజూ ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడం లేదా తొమ్మిది గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం, కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉండటం, శరీరంలో ట్రైగ్లిసరైడ్స్ పాళ్లు 250 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉండటం, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పాళ్లు 35 మి.గ్రా. కంటే తక్కువగా ఉండటం, రక్తపోటు, మహిళల్లో గర్భధారణ సమయంలో డయాబెటిస్ రావడం (జెస్టెషనల్ డయాబెటిస్), కడుపులో పిండం బరువు చాలా ఎక్కువగా ఉండటం (4.1 కిలోల కంటే ఎక్కువగా), మహిళకు పీసీఓడి వంటి వ్యాధులు ఉండటం, వయసు 45 ఏళ్ల కంటే అధికంగా ఉండటం వంటివి డయాబెటిస్‌కు రిస్క్‌ఫాక్టర్లు.
 
 పై కారణాలు ఉన్న పరిస్థితుల్లో రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచే హార్మోన్లను స్రవించే పాంక్రియాస్ గ్రంథి సరిగా పనిచేయకపోవచ్చు. అంటే రక్తంలోని చక్కెర పాళ్లను సరిగా అదుపు చేయగలంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవచ్చు. లేదా మన కణాలే ఆ హార్మోన్‌కు ప్రతిస్పందించడం మానేయవచ్చు. (ఈ  కండిషన్‌నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు). లేదా ఈ రెండు ప్రక్రియలూ ఏకకాలంలో జరగవచ్చు.
 
నిర్ధారణ: రక్తపరీక్షతో రక్తంలోని చక్కెర పాళ్లను తెలుసుకోవచ్చు. ఆ పరీక్షల తీరుతెన్నులివి...
 
 1) ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రక్త పరీక్ష:
ఇందులో పరగడపున నిర్వహించిన రక్తపరీక్షలో చక్కెర పాళ్లు 100 నుంచి 125 ఎంజీ/డీఎల్ ఉండాలి. ఇది అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రమాణాల ఆధారంగా. అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 110-125 ఎంజీ/డీఎల్ ఉంటే దాన్ని ప్రీ-డయాబెటిక్ కండిషన్‌గా... అంతకంటే ఎక్కువగా ఉంటే  దాన్ని డయాబెటిస్‌గా పరిగణిస్తారు.
 
 2) గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ): నోటి ద్వారా  75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి, దాని ఆధారంగా నిర్ణీత వ్యవధుల్లో రక్తంలోకి వెలువడే చక్కెర పాళ్లను పరీక్షించి, డయాబెటిస్ వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలో గరిష్ట పరిమితి 140-199 ఎంజీ/డీఎల్.
 
 3) హెచ్ బీ ఏ 1 సీ పరీక్ష: ఈ పరీక్ష నిర్వహించినప్పుడు విలువలు 5.7 - 6.4 మధ్య ఉంటే అది నార్మల్‌గా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం దాన్ని తప్పనిసరిగా డయాబెటిస్‌గా పరిగణించి, తగిన వైద్య చికిత్సలు, సూచనలు, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
 
మీరు ప్రీ-డయాబెటిక్ అని తేలితే ఆ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోండి. తగినట్లుగా జాగ్రత్తలు తీసుకుని, జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే రాబోయే రెండు నుంచి మూడేళ్ల వ్యవధిలో ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో 25 శాతం మంది, వచ్చే పదేళ్ల వ్యవధిలో ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో 50 శాతం మంది తప్పనిసరిగా డయాబెటిక్‌గా మారుతారు. అందుకే ప్రీ-డయాబెటిస్ అనే హెచ్చరిక సూచనలను (వార్మింగ్ సిగ్నల్స్‌ను) తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని, వాకింగ్ లాంటి వ్యాయామాలు మొదలుపెట్టడం వల్ల ప్రయోజనాలే తప్ప నష్టం ఉండదు. దీని వల్ల భవిష్యత్తులో రాబోయే ఎన్నో ఆరోగ్యపరమైన అనర్థాలను, ముప్పులను సమర్థంగా ఎదుర్కోవచ్చు.
 
 లక్షణాలు
 ప్రీ-డయాబెటిస్‌లో నిత్యం ఆకలిగా అనిపించడం, కారణాలు తెలియకుండా బరువు కోల్పోవడం లేదా బరువు పెరగడం, ఎప్పుడూ నీరసంగా, అలసటగా అనిపించడం, కళ్లు మాటిమాటికీ మసకబారిపోవడం, గాయాలు మానడంలో ఆలస్యం, చిగుర్లకు, మూత్రం, చర్మం లేదా ఏదైనా శరీర భాగాల్లో ఇన్ఫెక్షన్ ఉంటే అది మాటిమాటికీ తిరగబెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే విధిగా రక్తంలో చక్కెర పాళ్ల పరీక్షలు చేయించుకోవాలి.
 
 3- ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ)
 
 ఇది రాబోయే పక్షవాతానికి ఒక ముందస్తు సూచనగా భావించవచ్చు. పక్షవాతం వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయో, అవి తాత్కాలికంగా కనిపించి పోతాయి. కానీ పక్షవాతం వచ్చినప్పుడు జరిగే ఎలాంటి నష్టాలూ ఈ దశలో ఉండవు. కాబట్టి పక్షవాతం రాబోయే వారికి ఇది ముందస్తు హెచ్చరికలా భావించి, జాగ్రత్త పడటానికి ఒక చక్కని అవకాశం ఇస్తుందీ ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అనే ఈ దశ.
 
 ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్‌కు కారణాలు:
 1) మెదడుకు రక్తాన్ని చేరవేసే మెడ దగ్గర ఉండే రక్తనాళాలు లేదా మెదడులోని రక్తనాళాలు బాగా సన్నబారడం 2) గుండె వద్ద ఉన్న రక్తనాళాల్లోనే రక్తం గడ్డకట్టి, ఆ రక్తపు గడ్డలు రక్తప్రవాహంతో పాటు కొట్టుకుపోయి మెదడు దగ్గర పోగుపడినట్లుగా కావడం వల్ల మెదడుకు తగినంత రక్తసరఫరా జరగకపోవడం.
 
రిస్క్ ఫాక్టర్లు: అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉండటం, పొగతాగే అలవాటు, మద్యపానం చాలా ఎక్కువగా తీసుకోవడం, రాత్రివేళల్లో నిద్రలో గురకరావడం (స్లీప్ ఆప్నియా), రక్తంలో కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండటం
 
 నిర్ధారణ: రోగి లక్షణాల ఆధారంగా టీఐఏను నిర్ధారణ చేస్తారు. ఒక్కోసారి రోగికి ఐటీఏ లక్షణాలు ఉన్నాయని తెలిశాక... ఎమ్మారై బ్రెయిన్ (యాంజియోగ్రామ్‌తో పాటు); కెరోటిడ్ డాప్లర్ ఈసీజీ, 2డీ ఎకో, బ్లడ్ కోయాగ్యులేషన్ పారామీటర్స్ పరీక్షలు వంటివి చేస్తారు. వీటివల్ల టీఐఏ ఎందుకు వచ్చిందో తెలియడానికి ఆస్కారం ఉంది.
 
 చికిత్స: రోగికి తక్షణ చికిత్సగా రక్తాన్ని పలుచబార్చే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, అసిట్రోమ్, స్టాటిన్స్ వంటి మందులతో చికిత్స చేయాలి. ఒకవేళ రక్తనాళాలు సన్నబారడం అనే ప్రక్రియ 70 శాతం కంటే ఎక్కువగా జరిగితే ఈ వ్యాధి విషయంలో స్టెంటింగ్ లేదా ఎండరాక్టమీ వంటి చికిత్స ప్రక్రియలు అవసరమవుతాయి.
 
 లక్షణాలు
అకస్మాత్తుగా ముఖంలోని ఒకవైపు బలహీనంగా అనిపించవచ్చు. ఒకవైపు చేయి లేదా కాలు బలహీనంగా అనిపించవచ్చు. కాలు, చేయి పడిపోయినట్లుగా ఉండవచ్చు. ఆ తర్వాత మాట సరిగా రాకపోవడం, నిలకడ లేకుండా నడవడం, అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్లూ కనిపించకుండా పోవడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి కొద్దినిమిషాలు మొదలుకొని, గంటలోపే తగ్గిపోతాయి.
 
 4- మినిమల్ కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్ (ఎమ్‌సీఐ)
 
 మీ తెలివితేటలు, జ్ఞాపకశక్తి వంటి మెదడు సామర్థ్యాలు మీరు గుర్తించేటంతగా తగ్గిపోతే దాన్ని ‘మినిమల్ కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్ (ఎమ్‌సీఐ) రుగ్మతగా భావించవచ్చు. ఒకవేళ ఎవరైనా తమలో ఇలాంటి లక్షణాలను గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
 
పైన పేర్కొన్న వ్యాధి లక్షణాలు వెన్వెంటనే బయటపడవు. లేదా గుర్తించడానికి వీలుగా ఉండవు. అయితే వాళ్ల కుటుంబ సభ్యులు లేదా మిత్రుల గమనింపు ఆధారంగా వారిలో మిత్రులను గుర్తించడం, పేర్లను గుర్తుపెట్టుకోవడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని, అతడి వయసు ఆధారంగా అతడిలోని జ్ఞాపకశక్తిని అంచనా వేయవచ్చు. ఇందులో ఏవైనా తేడాలు వస్తున్నాయని తెలిసిన వెంటనే రోగిని డాక్టర్‌కు చూపించాలి.
 
నిర్ధారణ: ఈ వ్యాధిని నిర్ధారణ చేయడానికి నిర్ణీత పరీక్ష అంటూ ఏదీ లేకపోయినా రోగి ఆరోగ్య చరిత్ర, అతడి మిత్రుల/కుటుంబ సభ్యుల నుంచి లభ్యమయ్యే సమాచారం, జ్ఞాపకశక్తి, ఏదైనా విషయంలో అతడు ప్రణాళికలు రచించే తీరు, నిర్ణయాత్మక శక్తి, ఆలోచనావిధానం, న్యూరలాజికల్ ఇవాల్యువేషన్/న్యూరోసైకలాజికల్ ఇవాల్యుయేషన్ వంటి ప్రక్రియలతో అతడు నిజంగా ఎంసీఐతో బాధపడుతున్నాడో లేదో నిర్ధారణ చేయవచ్చు.

రిస్క్ ఫాక్టర్లు : పెరిగే వయసు, రోగి కుటుంబ సభ్యుల్లో అల్జైమర్స్ వంటి వ్యాధులు ఉండటం, కుటుంబ చరిత్రలో వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి లోపించే లక్షణాలు కనిపిస్తుండటం వంటివన్నీ ఎంసీఐకి రిస్క్ ఫాక్టర్లే.
 
లక్షణాలు: ఒకవ్యక్తి పేరును ఒకటికి, రెండుసార్లు గుర్తు తెచ్చుకుంటే గానీ గుర్తురాకపోవడం వంటివి మామూలే. అయితే చాలా కీలకమైన సమాచారం కూడా మరచిపోవచ్చు. గతంలో తేలిగ్గా గుర్తుంచుకున్న అంశాలు, గత పరిచయాలను మరచిపోవడం, గతంలోలా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోవడం, ఆయా సందర్భాల్లో తగిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తార్కికమైన రీతిలో స్పందించలేకపోవడం వంటివి తరచు జరుగుతుంటే ఎంసీఐ అనే కండిషన్ ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇవే లక్షణాలు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి లక్షణాలు ఉన్నప్పుడూ కనిపించవచ్చు. అందుకే డాక్టర్‌ను సంప్రదించి తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం.
 
 చికిత్స: ఎంసీఐకి నిర్దిష్ట చికిత్స ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే దీని వల్ల రాబోయే అనర్థాలను తగ్గించడానికి, గుండెజబ్బుల రిస్క్ వంటి ప్రమాదాలను నివారించడానికి, రోగి పరిస్థితి విషమించకుండా ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉంచవచ్చు. రోగితో జ్ఞాపకశక్తి పెరిగే బ్రెయిన్‌గేమ్స్ ఆడిస్తూ, పుస్తకాలు చదివిస్తూ, సుడోకు వంటి పజిల్స్ చేయిస్తూ ఉంటే  పరిస్థితి  మెరుగయ్యే అవకాశం ఉంది.
 
ఒకసారి ఎంసీఐ ఉన్నట్లుగా తేలితే ప్రతి ఆరు నెలలకోమారు తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయిస్తుండాలి. ఈ తరహా రోగులకు రివాస్టగ్మైన్, డోనెపెజిల్, గాలాంటమైన్, మెమాంటైన్ వంటి మందుల వాడకాన్ని మొదలుపెట్టాల్సి ఉంటుంది.
 
 భవిష్యత్ అనర్థ సూచన
 రాబోయే జ్ఞాపకశక్తి లేమి (డిమెన్షియా)కి సూచన  ఎంసీఐ. భవిష్యత్తులో డిమెన్షియా తీవ్రమైతే రోగికి కలగబోయే అనర్థాలను ముందుగా హెచ్చరించేదే ఈ ఎంసీఐగా భావించవచ్చు. ఒకవేళ ఎంసీఐ అని నిర్ధారణ అయితే ఇందులో ఏడాదికి 6 - 15 శాతం రోగులు డిమెన్షియాకు (తీవ్రమైన జ్ఞాపకశక్తి లోపానికి) గురయ్యేందుకు అవకాశం ఉంది.
 
 జీవనశైలి మార్పులతో...
 
జీవనశైలిలో మార్పులే పై అన్ని వ్యాధులకూ ఒక మంచి నివారణ. వ్యాధి ఏదైనా అది ముందస్తు హెచ్చరికలు చేసింది కాబట్టి దాన్ని మరింత ముదరకుండా చూసుకోవడం రోగి బాధ్యత. అందుకే కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో పై వ్యాధులన్నింటికీ మరింత ముదరకుండా, మరింత ఎక్కువ కాకుండా తప్పనిసరిగా నివారించుకునే అవకాశం ఉంది. అందుకు చేయాల్సింది కూడా చాలా సులభం. ఆ జాగ్రత్తలు ఏమిటంటే...
 
 ఆహారంలో ఇవి ముఖ్యం...
 హెచ్చరిక చేస్తున్న రోగ లక్షణాలు మనలో ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే... ఆహారంలో ఆకుకూరలు, పొట్టు ఉన్న ధాన్యంతో చేసిన పదార్థాలు, కొవ్వు తక్కువగా ఉండేవి తీసుకోవాలి.
     
 వంటల్లో ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం.
     
 వాల్‌నట్ వంటి ఆరోగ్యకరమైన నట్స్ వాడటం, గ్రీన్ టీ తాగడం వంటివి వ్యాధులు ముదరకుండా చూస్తాయి.
     
 మాంసాహారులు కొవ్వు తక్కువగా ఉండే చేపలు, చికెన్ తీసుకోవడం మంచిది. మేలు చేసే ఈ అలవాట్లను అందరూ నిరభ్యంతరంగా అనుసరించవచ్చు.
     
 ఆహారంలో ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి.
 
 వ్యాయామం తప్పనిసరి...
 బరువు పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ బరువు పెరుగుతుంటే కారణాలు కనుగొని, దాన్ని నివారించుకోవాలి.  
     
 రోజూ కనీసం 30 నిమిషాలు  నడవడం, ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటి ప్రక్రియలను అనుసరించాలి.
     
 ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయాలి.
 
 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement