ఈమధ్య ‘హార్ట్ ఫెయిల్యూర్’తో చనిపోయారు అనే వార్తలు తరచూ వింటున్నాం. అసలు హార్ట్‌ఫెయిల్యూర్ అంటే ఏమిటి? ఎందుకిలా జరుగుతుంది? అసలు హార్ట్ ఫెయిల్యూర్ అయితే మనిషి ఎలా బతుకుతాడు? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరంగా తెలపండి.
గుండె మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం. శరీరంలో అవయవాలన్నింటికీ నిరంతరం రక్తం సరఫరా చేస్తుండే ఒక అద్భుతమైన పంపింగ్ మోటార్ ఇది. ఈ రక్తప్రసరణ వల్లనే అన్ని అవయవాలకూ పోషకాలు, ఆక్సిజన్ అందడం మాత్రమే కాకుండా రక్తంలో చేరిన కార్బన్ డై ఆక్సైడ్, శరీరంలోని జీవక్రియల వల్ల ఉత్పన్నమైన ఇతర వ్యర్థపదార్థాల తొలగింపు జరుగుతుంటుంది. ఈ విధంగా దేహంలో ప్రసరణ వ్యవస్థ నిర్వహణలో గుండె కీలకమైన బాధ్యతను నిర్వహిస్తూ ఉంటుంది.ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను గ్రహించడం, కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు పంపించే ప్రక్రియను నిర్వహించడంలో ఊపిరితిత్తులతో కలిసి పనిచేస్తుంది.
అనేక రకాల పరిస్థితుల్లో గుండె దెబ్బతింటుంది. వీటిలో ముఖ్యమైనది అధికరక్తపోటు (హైపర్‌టెన్షన్/హైబీపీ), కరోనరీ ఆర్టరీ డిసీజ్, డయాబెటిస్, స్థూలకాయం (ఒబేసిటీ). వీటితో పాటు వాల్వ్‌లార్ డిసీజ్, వైరల్ ఇన్ఫెక్షన్లు, మితిమీరిన మద్యపానం, పోషకాహార లోపం, కీమో–రేడియేషన్‌ల (క్యాన్సర్ చికిత్సల్లో) అనంతర స్థితి, వాపు (ఇన్‌ఫ్లమేటరీ స్టేట్) వల్ల కూడా గుండె దెబ్బతింటుంది.ఈ పరిస్థితులను నివారించడం, ఇందుకు కారణమయ్యే అంశాల నుంచి దూరంగా ఉండటం వల్ల గుండెకు జరిగే నష్టాన్ని చాలావరకు తగ్గించే అవకాశం ఉంటుంది.
ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలకు దూరంగా ఉండటం వల్ల గుండెకు వాటిల్లబోయే నష్టాన్ని చాలావరకు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలను గుర్తించడం ముఖ్యం. ఒకసారి గుండె దెబ్బతింటే మళ్లీ మునపటి స్థితిని పునరుద్ధరించుకునే సామర్థ్యం గుండెకు ఉండదు. అందుకే గుండె దెబ్బతినకుండానే తీసుకునే నివారణ చర్యలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా కీలకమైన భూమిక నిర్వహిస్తాయి.
లక్షణాలు
ఇటు డాక్టర్లు, అటు పేషెంట్లు హార్ట్‌ఫెయిల్యూర్ లక్షణాలను వెంటనే గుర్తించాలి. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా, పడుకొని ఉన్నా శ్వాస అందకపోవడం, అలసట, కాళ్లవాపు, ఊపిరితిత్తుల్లో ఒత్తిడి ఏర్పడటం, పొట్ట ఉబ్బడం మొదలైనవి హార్ట్‌ఫెయిల్యూర్ లక్షణాలు. ఇవి కనిపించిన వెంటనే రోగి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి, తీవ్రతను అంచనా వేయాల్సి ఉంటుంది.
నిర్ధారణ పరీక్షలు
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈసీజీ, 2–డి ఎకో కార్టియోగ్రఫీ, మరికొన్ని రక్తపరీక్షల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్‌ను డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.ఇటీవల మరిన్ని ఆధునిక విధానాలు వాడుకలోకి వచ్చాయి. బయోమార్కర్లను ఉపయోగించి హార్ట్‌ఫెయిల్యూర్‌ను గుర్తించడం, వర్గీకరించడం చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఇమేజింగ్ పద్ధతులు కూడా చాలా అభివృద్ధి చెందాయి. వీటివల్ల వ్యాధిని వేగంగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయగలుగుతున్నారు.
వీటిలో 3–డితో కూడిన ఎకోకార్డియోగ్రఫీ వ్యాధి నిర్ధారణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచింది. ఇది గుండెపనితీరు, గుండె కవాటాల పనితీరు, గుండెలోని ఒత్తిడిని అధ్యయనం చేయడానికి సాయపడుతుంది. ఎకో ద్వారా పూర్తిగా నిర్ధారణకు రాలేని సందర్భాల్లో కార్డియాక్ ఎమ్మారై ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం. వీటితోపాటు కార్డియాక్ కాథటరైజేషన్, న్యూక్లియార్ స్కాన్ (పెట్, స్పెక్), ఎండోకార్డియల్ బయాప్సీ, టాక్సికాలజీతో రోగనిర్ధారణ చేస్తున్నారు.
గుండెను కాపాడుకోవడం ఇలా...
మనం ముందుగా మన అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవాలి. అయితే అధిక రక్తపోటు విషయంలో చాలామంది నిర్లక్ష్యంగానో లేదా ఉదాసీనంగానో వ్యవహరిస్తుంటారు. అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచడం ద్వారా రక్తనాళాలకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. అలా జరగకపోతే గుండె దమనులు తీవ్రంగా దెబ్బతీసి, గుండెకండరాలను మందంగా తయారుచేస్తుంది. దాంతో గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం చాలావరకు తగ్గిపోతుంది. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నప్పుడు కూడా దాదాపు ఇలాంటి అంశాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అటు హైబీపీ, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం, ఇటు స్థూలకాయాన్ని నివారించుకొని ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం అవసరమవుతుంది.
జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా గుండెకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. రోజుకు కనీసం 30 – 35 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, తాజా పండ్లు, కూరగాయలు–ఆకుకూరలతో కూడిన పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో ఉప్పు చాలా తక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత వంటి ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగతాగడం వల్ల గుండె మీద తీవ్రమైన భారం పడుతుంది. మద్యం కూడా గుండెకు అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఆ అలవాట్లను వెంటనే ఆపేయాలి.
ఇక రక్తంలో కొలస్ట్రాల్ ఉంటే దానివల్ల కరొనరీ దమనల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి.మొత్తంమీద పూర్తిగా నష్టం జరగకమునుపే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం వల్ల గుండెకు వాటిల్లే నష్టం నివారించడానికి వీలవుతుంది. తద్వారా హార్ట్‌ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఒకసారి గుండెపోటుకు గురైతే ఆలస్యం చేయకుండా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరించడం కూడా చాలా కీలకం. దానివల్ల తక్షణ రక్షణతో పాటు మున్ముందు మరింత నష్టం జరగకుండా చూసుకోడానికి, దీర్ఘకాలంలో దుష్ఫలితాలు ఏర్పడకుండా చూడవచ్చు.
డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment