నాకు డెలివరీ అయ్యి సంవత్సరం అవుతోంది. నార్మల్ డెలివరీనే! కానీ ఇప్పటికీ ఎక్స్‌టర్నల్ వెజైనా ఏరియాలో చాలా నొప్పిగా ఉంటోంది. ముట్టుకున్నా నొప్పి అనిపిస్తుంది. ఏ మందులు వాడినా, ఇన్ఫెక్షన్‌కి మందులు వాడినా ఏమీ తగ్గలేదు. నాకు సలహా ఇవ్వండి.
విశాల, నాచారం
మీరు చెప్పే నొప్పిని వల్వల్ పెయిన్ అంటారు. ఏ ఇన్ఫెక్షన్ లేనప్పుడు, ఏ కారణం తెలియనప్పుడు దీనిని డయాగ్నైజ్ చేస్తారు. కొన్నిసార్లు ప్రసవం జరిగే సమయంలో గాయపడినా, భయానికీ ఒత్తిడికీ గురైనా ఈ నొప్పి మొదలవుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా వస్తుంది. ఈ నొప్పికి గైనకాలజిస్ట్‌ని కలవాలి. ఇంటర్నల్‌గా చెక్ చేసి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూస్తారు. అవసరమైతే వెజైనల్ స్వాబ్ చేస్తారు. లిడోకేయిన్ 2% లోకల్ అప్లికేషన్ జెల్లీ వాడమని చెబుతారు. ఈ ఆయింట్‌మెంట్‌ని వెజైనా, వల్వా భాగంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి. ఇది బాగా పని చేస్తుంది.
ఈ ఆయింట్‌మెంట్‌ని ప్రతిరోజూ 3–4 సార్లు అప్లై చేసుకుంటూ, మీరు రోజువారీ పనులు చేసుకోవచ్చు. నడుము కండరాలు బలం పుంజుకోవడానికి ఎక్సర్‌సైజ్ కూడా చెయ్యాలి. ఈ క్రీమ్‌కి అలర్జీ చాలా అరుదుగా రావచ్చు. చాలా మందికి ఈ క్రీమ్‌తో నొప్పి తగ్గుతుంది. వెజైనల్ వాషెస్, స్ట్రాంగ్ సోప్స్, ఫెర్‌ఫ్యూమ్‌లు వాడకూడదు. కొంతమందికి సెన్సిటివిటీ తగ్గడానికి ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నొప్పి ఎక్కువకాలం కొనసాగుతుంటే, ఫిజియోథెరపిస్ట్ ద్వారా నడుము కండరాల బలానికి ఎక్సర్‌సైజెస్ నేర్పిస్తారు.
నాకు మొదటి నుంచీ రక్తంలో ఐరన్ శాతం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు 3వ నెల. వయసు 22 సంవత్సరాలు. రక్త పరీక్ష చేయించినప్పుడు ఐరన్ శాతం మాత్రమే ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
– సృజన, శంకరపల్లి
ఐరన్ తక్కువ ఉన్న వాళ్లకి నీరసం, అలసట ఎక్కువ ఉంటాయి. హీమోగ్లోబిన్ 10 శాతం కన్నా తక్కువ ఉంటే రక్తహీనత అంటారు. గర్భధారణ సమయంలో రక్తంలో ఐరన్ శాతం బాగా ఉన్నప్పుడే రక్తకణాలు బాగా ఉంటాయి. ఈ రక్తకణాలు ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని అవయవాలకు పంపిస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ శాతం పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహార పదార్థాలు అంటే చికెన్, మటన్, చేప, పౌల్ట్రీలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. లివర్, లివర్ ఉత్పత్తుల్లో ఐరన్ శాతం ఎక్కువ ఉన్నా గర్భధారణ సమయంలో తీసుకోకూడదు.
వాటిలోని విటమిన్–ఎ పెరిగే బిడ్డకి ప్రమాదం. శాకాహార పదార్థాలు చాలావాటిలో ఐరన్ శాతం ఎక్కువగానే ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, రాజ్మా, బఠాణీ వంటి గింజలు, బ్రొకొలీ, సోయా ఉత్పత్తులు, పనీర్‌లలో ఐరన్‌శాతం ఎక్కువ ఉంటుంది. ఐరన్ శాతం పెరగాలంటే విటమిన్–సి కూడా అవసరం. అందుకే ఐరన్ ఎక్కువ ఉండే ఆహర పదార్థాలతో పాటు విటమిన్–సి కూడా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్– నారింజ, కివీ, నిమ్మ వంటివి తీసుకోవాలి. టీ, కాఫీలు తాగకూడదు. భోజనంతో పాటు అస్సలు తీసుకోకూడదు.
గర్భిణీలకు 3, 7, 9 నెలల్లో తప్పనిసరిగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్తపరీక్ష చేస్తారు. దీనిలో మీ ఐరన్ శాతం తెలుస్తుంది. డైట్‌తో పాటు కొంతమందికి ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వవలసి వస్తుంది. కొంతమందికి రక్తహీనతతో పాటు విటమిన్– బి12 కూడా తక్కువ ఉండొచ్చు. అలాంటి వారికి అదనంగా సప్లిమెంట్స్ ఇవ్వాలి. డైట్, మందులతో ఐరన్ పెరగనప్పుడు హెచ్‌బి ఎలక్ట్రోఫోరెసిస్, ఐరన్ స్టడీస్ అనే అడ్వాన్స్‌డ్ టెస్ట్ చేసి సమస్య ఎక్కడ ఉందో కనిపెట్టి, ఫిజీషియన్ సూచన మేరకు ట్రీట్‌మెంట్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment