మన శరీరంలో మూత్రపిండా(కిడ్నీ)లను చాలా సంక్లిష్టమైన, కీలకమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. అవి శరీరంలో విషతుల్యమైన పదార్థాలను మూత్రం ద్వారా వడపోసి బయటకు విసర్జిస్తాయి. అంతేకాదు... కీలకమైన హార్మోన్లు, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. చిక్కుడుగింజ ఆకృతిలో ఉండే మూత్రపిండాల్లో ఎడమవైపుది కొంచెం పెద్దగా ఉండి, కుడివైపు దానికంటే కాస్త ఎగువన ఉంటుంది. దాదాపు 150 గ్రాముల వరకు బరువుండే మూత్రపిండాలు 11–14 సెంమీ. పొడవు, 6 సెం.మీ. వెడల్పు, 4 సెం.మీ. మందంగా ఉంటాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలోనూ కిడ్నీలది ప్రధాన పాత్ర. అందుకే బీపీ ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్షలను కూడా పూర్తిగా చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు, మధుమేహం తో బాధపడేవారికి మూత్రపిండాలు వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి.
మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.
1. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ 2. కిడ్నీ స్టోన్స్
3. కిడ్నీ ఫెయిల్యూర్ 4. కిడ్నీ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్
మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ యూరినరీ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల వరకు పాకి అక్కడా ఇన్ఫెక్షన్లను కలగజేస్తుంటాయి. యాంటీబయాటిక్ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది. పురుషులలో ఎక్కువగా కనిపించే మూత్రపిండాలలోని రాళ్లలో ఇసుకరేణువు పరిమాణం మొదలుకొని గోల్ఫ్‌బాల్ సైజువరకూ ఉంటాయి. వీటిలో కొన్ని రకాలు అంత ప్రమాదకరం కాకపోయినా తీవ్రమైన నొప్పిని, బాధను కలిగిస్తాయి. సైజును బట్టి అనేకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అధిక బరువు, స్మోకింగ్, ఆల్కహాల్, రక్తపోటు, షుగర్‌లెవల్స్ అదుపులో లేకపోవడం వల్ల ఆ దుష్ప్రభావాలు మూత్రపిండాల మీద పడి అది కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యకు దారితీయవచ్చు.
మూత్రపిండాలు ఫెయిల్ అయనప్పుడు మాత్రమే లక్షణాలు బయటపడుతుంటాయి. అందుకే దీన్ని ఒక సైలెంట్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స పద్ధతులు అనుసరించడం తప్పనిసరి కావచ్చు.పుట్టుకతో వచ్చే మూత్రపిండాల్లో కణుతులు, పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ దగ్గరికి చెకప్స్‌కు తీసుకెళ్లినప్పుడు బయటపడుతూ ఉంటాయి. కణితి పరిమాణం బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి–బరువు తగ్గడం, అజీర్ణం, అధికరక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్ ట్యూమర్‌గా చెప్పుకునే మూత్రపిండాల్లో కణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతూ ఉంటాయి. వీటిని పూర్తిగా నయం చేయడం సాధ్యమే. రీనల్‌సెల్ కార్సినోమా (ఆర్‌సీసీ): ఈ రకం కణితి పెద్ద వయసు వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్‌కు ఎక్కువ. ఒక్కొక్కసారి ఇలా ఇతర చోట్లకు పాకిన (మెటాస్టాసిస్ అయిన) భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తించడం జరుగుతూంటుంది.
ఒక్కోసారి రెండు మూత్రపిండాలలో కూడా ఈ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్–టైప్‌లలో ఉండే ఈ క్యాన్సర్... ఇతర కిడ్నీ సంబంధిత పరీక్షలలో, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలలో కనుగొనడం కూడా జరుగుతూ ఉంటుంది. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే స్మోకింగ్ చేసేవారిలో చిన్నవయసు వారిలోనూ ఈ క్యాన్సర్ నమోదువుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్, అధికబరువు వంటి వాటితో పాటు జీన్‌మ్యుటేషన్స్ ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు.
క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పుడు ఫిజికల్ ఎగ్జామ్, బ్లడ్ టెస్ట్‌లు, యూరినరీ టెస్టులు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ, ఎమ్మారై, క్యాల్షియమ్ లెవల్స్ తెలిపే పరీక్షలతో పాటు, ఒక్కోసారి ఈ క్యాన్సర్ బయటపడే సమయానికి అది ఊపిరితిత్తులకు, ఎముకలు పాకి ఉండవచ్చు. కాబట్టి చెస్ట్ ఎక్స్‌రే, బోన్ స్కాన్స్ కూడా చేయిస్తూ ఉండాలి. కిడ్నీని మొత్తంగా తీసివేసే సర్జరీతో పాటు క్యాన్సర్ రకాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలను ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కిడ్నీలను లాపరోస్కోపిక్ పద్ధతిలో కూడా తొలగించడం జరుగుతోంది. క్యాన్సర్ కాని కణుతుల్లో కూడా సైజును బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా, మూత్రపిండాలలో అవి చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లో కూడా కిడ్నీని తొలగించడం జరుగుతుంది. సర్జరీ తర్వాత కిడ్నీ ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి సర్జరీని 3 రకాలుగా చేస్తుంటారు.
రాడికల్ నెఫ్రోక్టమీ: ఎక్కువగా చేసే ఈ సర్జరీలో మూత్రపిండంతో పాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలను, టిష్యూలను మొత్తంగా తీసివేయడం జరుగుతుంది. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీ చేస్తారు.
సింపుల్ నెఫ్రొక్టమీ స్టేజ్–1: కిడ్నీ క్యాన్సర్‌కు ఒక మూత్రపిండాన్ని మాత్రం తీసివేయడం జరుగుతుంటుంది.
పార్షియల్ నెఫ్రోక్టమీ: పుట్టుకతో ఒకే ఒక మూత్రపిండం ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంత మేరకే దాన్ని తీసేవేయడం జరుగుతుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలోనూ కణుతులు ఏర్పడినప్పుడు కూడా మూత్రపిండాలను ఇలా కణితి ఉన్న మేరకు మాత్రమే తీసివేయడం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తీసివేసినప్పుడు సర్జరీ అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణం జీవితాన్ని గడపగలుగుతారు.
రెండు మూత్రపిండాలను తీసివేశాక, రెండోది సరిగా పనిచేయకపోతే... వారు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం అవసరం. చికిత్స ముగిశాక కూడా ఫాలో అప్ కేర్ తప్పనిసరి. సీటీస్కాన్, చెస్ట్ ఎక్స్‌రే వంటి టెస్ట్‌లు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి విషాలకు దూరంగా ఉంటే మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలం.
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421,
Kurnool 08518273001
Comments
Please login to add a commentAdd a comment