గ్యాస్ట్రో కౌన్సెలింగ్
కడుపులో విపరీతమైన నొప్పి, మంట!
నా వయసు 40 ఏళ్లు. గత నెలరోజులుగా కడుపులో మంట, నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. పరీక్షల్లో కడుపులో చిన్న పుండు ఉంది అని తేలింది. అల్ట్రాసౌండ్‌లో పిత్తాశయంలో రాయి ఉన్నట్లుగా వచ్చింది. ఈ సమస్య మందులతో తగ్గుతుందా, ఆపరేషన్ అవసరమా?
- సుధీర్‌కుమార్, వరంగల్
సాధారణంగా వయసు పెరిగేకొద్దీ పిత్తాశయంలో (గాల్‌బ్లాడర్‌లో) రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నంతమాత్రాన ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రాళ్ల వల్ల తరచూ నొప్పి వస్తుంటే అప్పుడు గాల్‌బ్లాడర్‌ను తొలగించాల్సి ఉంటుంది. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీరు యాసిడ్ పెప్టిక్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీకు వచ్చే నొప్పి పిత్తాశయానికి సంబంధించినది కాదు. కాబట్టి మీరు భయపడాల్సిందేమీ లేదు. ఒకసారి వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.
నా వయసు 65 ఏళ్లు. నాకు గత ఆర్నెల్ల నుంచి మలవిసర్జనలో మార్పు కనిపిస్తోంది. మలవిసర్జనకు ముందు రక్తం పడుతోంది. ఆకలి కూడా బాగా తగ్గింది. మలవిసర్జనకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా?
- శంకర్, సంగారెడ్డి
మలవిసర్జనకు ముందు రక్తం పడటానికి చాలా కారణాలు ఉంటాయి. హెమరాయిడ్స్ (పైల్స్) అంటే మొలలు, పెద్దపేగుల్లో కణితులు, క్యాన్సర్ కణితులు, పుండ్లు, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్‌లో ఇలా రక్తం పడటం కనిపిస్తుంది. మీ వయసునూ, ఆకలి మందగించడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటే మీరు పెద్దపేగుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారనిపిస్తోంది. మలవిసర్జనలో మార్పు కనిపిస్తోందని రాశారుగానీ, అది ఏ రకమైన మార్పు అన్నది రాయలేదు. పెద్దపేగుల్లో కణితులు ఉంటే మొదట మల విసర్జన ప్రక్రియలో తేడా వస్తుంది. రానురానుపూర్తిగా మలవిసర్జన కష్టమవుతుంది. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోండి. దీని వల్ల రక్తం పడటానికి కారణం తెలుస్తుంది. దాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను
కలవండి.
డాక్టర్ పి. భవానీ రాజు
కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
హైదరాబాద్