గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ | Gastroenterology counseling | Sakshi
Sakshi News home page

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్

Published Thu, Jul 16 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్

సిర్రోసిస్‌కు కాలేయమార్పిడే మార్గం

నా వయసు 55 ఏళ్లు. నేను ‘సిర్రోసిస్ ఆఫ్ లివర్’ అనే వ్యాధితో బాధపడుతున్నాను. కడుపులో నీరు వచ్చి చేరుతోంది. డాక్టర్‌కు చూపించుకుంటే ‘మీ కిడ్నీ సరిగా పనిచేయడం లేద’న్నారు. కిడ్నీ పనితీరుకూ కడుపులో నీరు చేరడానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. కడుపులో నీరు తగ్గేదెలా?
 - మనోహర్‌రావు, కర్నూలు

మీరు రాసిన లక్షణాలు బట్టి చూస్తే మీ కాలేయం పూర్తిగా చెడిన దశలో ఉన్నారు. కాలేయం చెడిపోవడం వల్ల కడుపులో నీరు చేరడం, కాళ్లల్లో వాపు రావడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సమస్యకు తొలిదశలో ఉప్పు తక్కువగా వాడుతూ, మూత్రం ఎక్కువగా వచ్చేటట్లు చేసే మందులు వాడాలి. కానీ మీ డిడ్నీ వ్యవస్థ సరిగా లేనందున ఆ మందులు వాడటం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రెండువారాలకు ఒకసారి కడుపులో నీరు తీయించుకోవడం, ఒక ఇంజెక్షన్ తీసుకోవడం చేయాలి. దీనివల్ల మీరు కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. దీంతోపాటు ఉప్పును పూర్తిగా తగ్గించుకోవాలి. నీరు కూడా తక్కువగా తాగడం మంచిది. ఈ సమస్యకు కాలేయమార్పిడి శస్త్రచికిత్సే మంచి పరిష్కారం. కాలేయ మార్పిడి వల్ల మీకు ఉన్న సమస్యను పూర్తిగా తొలగించవచ్చు. కాబట్టి మీరు కాలేయ మార్పిడి వైద్యుడిని కలిసి మాట్లాడి తగిన నిర్ణయం తీసుకోండి.

నా వయసు 45 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత రెండు నుంచి మూడేళ్లుగా ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టుకు చూపించుకుంటే తగిన పరీక్షలు చేసి, గుండె సమస్య ఏమీ లేదన్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళ నొప్పి మరీ ఎక్కువగా ఉంటోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా?
 - శంకర్‌రావు, వనస్థలిపురం

 మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు ఆహారవాహికకు సంబంధించిన రిఫ్లక్స్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. అది స్థూలకాయంతో ఉండేవారిలో సాధారణంగా కనిపించే సమస్య. అయితే ప్రస్తుతం మీరు ఏవైనా మందులు వాడుతున్నారా, లేదా తెలుపలేదు. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. ఈ పరీక్ష వల్ల రిఫ్లక్స్ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువగా వస్తోందంటున్నారు కాబట్టి రాత్రి భోజనం చేసే ముందు కొన్ని మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు మీరు మీ రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. బరువును నియంత్రించుకోవడం, భోజనానికి, పడుకోవడానికి మధ్య ఒక గంటైనా తేడా ఉండేలా చూసుకోవడం చేయాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు వ్యాధి లక్షణాలు ఎక్కువయ్యేలా చేస్తాయి. అలాంటి పదార్థాలేమిటో గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. అప్పటికీ మీ సమస్యకు పరిష్కారం కనిపించకపోతే మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలవండి. ఆయన ఇచ్చే మందులతో నొప్పినుంచి ఉపశమనం కలుగుతుంది.
 
 డాక్టర్ పి. భవానీ రాజు
 కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
 కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
 హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement