గ్యాస్ట్రో కౌన్సెలింగ్
నా వయసు 35. నేను నిద్రపోయే సమయంలో ఛాతీకింద ఎడమవైపున నొప్పి వస్తోంది. గత వారంగా ఇది జరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ టెస్ట్ చేసి టీబీ 0.5, డీబీ 0.2, ఐబీఓ 0.3, ఎస్‌జీపీటీ 30, ఏపీ 225, టీ ప్రొటిన్ 8.2, ఆల్బ్యుమిన్ 3.8, గ్లోబ్యులిన్ 4.4 అని చెప్పారు. ఈ టెస్ట్‌లో ఏదైనా తేడా ఉందా? నా లివర్ సైజు ఎందుకు పెరిగింది, తెలియజేయగలరు.
- విజయ్, రాజమండ్రి
మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీకు లివర్ సైజు పెరిగిందని చెప్పవచ్చు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అవి...
► ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారి లోనూ, స్థూలకాయం ఉన్నవారిలో లివర్‌లో కొవ్వు పేరుకుపోయి దాని సైజు పెరిగే అవకాశం ఎక్కువ. మీకు స్థూలకాయం ఉందా, ఆల్కహాల్ అలవాటు ఉందా అన్న విషయాలు మీరు తెలియజేయలేదు.
► కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి వంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా లివర్ పెరిగే అవకాశముంది. కానీ మీరు రాసిన లివర్ టెస్ట్‌లో అన్ని విలువలు నార్మల్‌గానే ఉన్నాయి కాబట్టి మీకు ఈ ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం తక్కువ.
► మీరు ముందుగా మీ లివర్ సైజ్ ఎంత పెరిగిందో అల్ట్రా స్కానింగ్ పరీక్ష ద్వారా తెలుసుకోగలరు. ఇక మీకు వస్తున్న కడుపునొప్పి, ఎడమవైపున ఛాతీ కింది భాగంలో కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించుకోగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీకు లివర్ సైజు పెరగడానికి కారణంతో పాటు కడుపు నొప్పికి గల కారణం కూడా తెలిసే అవకాశం ఉంది.
మా బాబు వయసు 10 ఏళ్లు. వాడికి ఎనిమిదేళ్ల వయసప్పుడు పచ్చకామెర్లు వచ్చాయి. ఐదు నెలల వ్యవధిలో అవి వాటంతట అవే తగ్గిపోయాయి. మళ్లీ రెండు వారాల క్రితం నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. దయచేసి మాకు సలహా ఇవ్వండి.
- కామేశ్వరరావు, ఏలూరు
మీ బాబు వయసులో కామెర్లు రావడానికి ముఖ్యంగా హెపటైటిస్ ఏ, లేదా హెపటైటిస్ ఈ అనే వైరస్‌లు కారణం కావచ్చు. మీ బాబుకు ఇంతకు ముందు ఒకసారి కామెర్లు వచ్చాయి కాబట్టి మళ్లీ మళ్లీ ఇవే వైరస్‌ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా అరుదు. ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే దాని పట్ల మన శరీరంలో వ్యాధినిరోధకశక్తి వృద్ధిచెందే అవకాశం ఉంది కాబట్టి మీ బాబుకు కామెర్లు రావడానికి ఇతర కారణాలు... అంటే ‘విల్సన్ డిసీజ్’ వంటివి ఏమైనా ఉండవచ్చు. ఇక మీ బాబుకు దురద, రక్తహీనత ఉన్నాయా లేదా అన్న వివరాలు రాయలేదు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు మీ బాబును చూపించి, కొన్ని పరీక్షలు చేయించుకుంటే అతడు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి, తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్ పి. భవానీ రాజు
కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
నా కాలేయం సైజు ఎందుకు పెరిగింది?
Published Sun, Jun 28 2015 10:28 PM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM
Advertisement
Advertisement