Dr P. Bhavani raju
-
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
సిర్రోసిస్‌కు కాలేయమార్పిడే మార్గం నా వయసు 55 ఏళ్లు. నేను ‘సిర్రోసిస్ ఆఫ్ లివర్’ అనే వ్యాధితో బాధపడుతున్నాను. కడుపులో నీరు వచ్చి చేరుతోంది. డాక్టర్‌కు చూపించుకుంటే ‘మీ కిడ్నీ సరిగా పనిచేయడం లేద’న్నారు. కిడ్నీ పనితీరుకూ కడుపులో నీరు చేరడానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. కడుపులో నీరు తగ్గేదెలా? - మనోహర్‌రావు, కర్నూలు మీరు రాసిన లక్షణాలు బట్టి చూస్తే మీ కాలేయం పూర్తిగా చెడిన దశలో ఉన్నారు. కాలేయం చెడిపోవడం వల్ల కడుపులో నీరు చేరడం, కాళ్లల్లో వాపు రావడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సమస్యకు తొలిదశలో ఉప్పు తక్కువగా వాడుతూ, మూత్రం ఎక్కువగా వచ్చేటట్లు చేసే మందులు వాడాలి. కానీ మీ డిడ్నీ వ్యవస్థ సరిగా లేనందున ఆ మందులు వాడటం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రెండువారాలకు ఒకసారి కడుపులో నీరు తీయించుకోవడం, ఒక ఇంజెక్షన్ తీసుకోవడం చేయాలి. దీనివల్ల మీరు కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. దీంతోపాటు ఉప్పును పూర్తిగా తగ్గించుకోవాలి. నీరు కూడా తక్కువగా తాగడం మంచిది. ఈ సమస్యకు కాలేయమార్పిడి శస్త్రచికిత్సే మంచి పరిష్కారం. కాలేయ మార్పిడి వల్ల మీకు ఉన్న సమస్యను పూర్తిగా తొలగించవచ్చు. కాబట్టి మీరు కాలేయ మార్పిడి వైద్యుడిని కలిసి మాట్లాడి తగిన నిర్ణయం తీసుకోండి. నా వయసు 45 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత రెండు నుంచి మూడేళ్లుగా ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టుకు చూపించుకుంటే తగిన పరీక్షలు చేసి, గుండె సమస్య ఏమీ లేదన్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళ నొప్పి మరీ ఎక్కువగా ఉంటోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా? - శంకర్రావు, వనస్థలిపురం మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు ఆహారవాహికకు సంబంధించిన రిఫ్లక్స్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. అది స్థూలకాయంతో ఉండేవారిలో సాధారణంగా కనిపించే సమస్య. అయితే ప్రస్తుతం మీరు ఏవైనా మందులు వాడుతున్నారా, లేదా తెలుపలేదు. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. ఈ పరీక్ష వల్ల రిఫ్లక్స్ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువగా వస్తోందంటున్నారు కాబట్టి రాత్రి భోజనం చేసే ముందు కొన్ని మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు మీరు మీ రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. బరువును నియంత్రించుకోవడం, భోజనానికి, పడుకోవడానికి మధ్య ఒక గంటైనా తేడా ఉండేలా చూసుకోవడం చేయాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు వ్యాధి లక్షణాలు ఎక్కువయ్యేలా చేస్తాయి. అలాంటి పదార్థాలేమిటో గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. అప్పటికీ మీ సమస్యకు పరిష్కారం కనిపించకపోతే మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలవండి. ఆయన ఇచ్చే మందులతో నొప్పినుంచి ఉపశమనం కలుగుతుంది. డాక్టర్ పి. భవానీ రాజు కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గ్యాస్ట్రో కౌన్సెలింగ్
కడుపులో విపరీతమైన నొప్పి, మంట! నా వయసు 40 ఏళ్లు. గత నెలరోజులుగా కడుపులో మంట, నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. పరీక్షల్లో కడుపులో చిన్న పుండు ఉంది అని తేలింది. అల్ట్రాసౌండ్‌లో పిత్తాశయంలో రాయి ఉన్నట్లుగా వచ్చింది. ఈ సమస్య మందులతో తగ్గుతుందా, ఆపరేషన్ అవసరమా? - సుధీర్‌కుమార్, వరంగల్ సాధారణంగా వయసు పెరిగేకొద్దీ పిత్తాశయంలో (గాల్‌బ్లాడర్‌లో) రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నంతమాత్రాన ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రాళ్ల వల్ల తరచూ నొప్పి వస్తుంటే అప్పుడు గాల్‌బ్లాడర్‌ను తొలగించాల్సి ఉంటుంది. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీరు యాసిడ్ పెప్టిక్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీకు వచ్చే నొప్పి పిత్తాశయానికి సంబంధించినది కాదు. కాబట్టి మీరు భయపడాల్సిందేమీ లేదు. ఒకసారి వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. నా వయసు 65 ఏళ్లు. నాకు గత ఆర్నెల్ల నుంచి మలవిసర్జనలో మార్పు కనిపిస్తోంది. మలవిసర్జనకు ముందు రక్తం పడుతోంది. ఆకలి కూడా బాగా తగ్గింది. మలవిసర్జనకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? - శంకర్, సంగారెడ్డి మలవిసర్జనకు ముందు రక్తం పడటానికి చాలా కారణాలు ఉంటాయి. హెమరాయిడ్స్ (పైల్స్) అంటే మొలలు, పెద్దపేగుల్లో కణితులు, క్యాన్సర్ కణితులు, పుండ్లు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్‌లో ఇలా రక్తం పడటం కనిపిస్తుంది. మీ వయసునూ, ఆకలి మందగించడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటే మీరు పెద్దపేగుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారనిపిస్తోంది. మలవిసర్జనలో మార్పు కనిపిస్తోందని రాశారుగానీ, అది ఏ రకమైన మార్పు అన్నది రాయలేదు. పెద్దపేగుల్లో కణితులు ఉంటే మొదట మల విసర్జన ప్రక్రియలో తేడా వస్తుంది. రానురానుపూర్తిగా మలవిసర్జన కష్టమవుతుంది. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోండి. దీని వల్ల రక్తం పడటానికి కారణం తెలుస్తుంది. దాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ పి. భవానీ రాజు కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నా కాలేయం సైజు ఎందుకు పెరిగింది?
గ్యాస్ట్రో కౌన్సెలింగ్ నా వయసు 35. నేను నిద్రపోయే సమయంలో ఛాతీకింద ఎడమవైపున నొప్పి వస్తోంది. గత వారంగా ఇది జరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ టెస్ట్ చేసి టీబీ 0.5, డీబీ 0.2, ఐబీఓ 0.3, ఎస్‌జీపీటీ 30, ఏపీ 225, టీ ప్రొటిన్ 8.2, ఆల్బ్యుమిన్ 3.8, గ్లోబ్యులిన్ 4.4 అని చెప్పారు. ఈ టెస్ట్‌లో ఏదైనా తేడా ఉందా? నా లివర్ సైజు ఎందుకు పెరిగింది, తెలియజేయగలరు. - విజయ్, రాజమండ్రి మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీకు లివర్ సైజు పెరిగిందని చెప్పవచ్చు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అవి... ► ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారి లోనూ, స్థూలకాయం ఉన్నవారిలో లివర్‌లో కొవ్వు పేరుకుపోయి దాని సైజు పెరిగే అవకాశం ఎక్కువ. మీకు స్థూలకాయం ఉందా, ఆల్కహాల్ అలవాటు ఉందా అన్న విషయాలు మీరు తెలియజేయలేదు. ► కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి వంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా లివర్ పెరిగే అవకాశముంది. కానీ మీరు రాసిన లివర్ టెస్ట్‌లో అన్ని విలువలు నార్మల్‌గానే ఉన్నాయి కాబట్టి మీకు ఈ ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం తక్కువ. ► మీరు ముందుగా మీ లివర్ సైజ్ ఎంత పెరిగిందో అల్ట్రా స్కానింగ్ పరీక్ష ద్వారా తెలుసుకోగలరు. ఇక మీకు వస్తున్న కడుపునొప్పి, ఎడమవైపున ఛాతీ కింది భాగంలో కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించుకోగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీకు లివర్ సైజు పెరగడానికి కారణంతో పాటు కడుపు నొప్పికి గల కారణం కూడా తెలిసే అవకాశం ఉంది. మా బాబు వయసు 10 ఏళ్లు. వాడికి ఎనిమిదేళ్ల వయసప్పుడు పచ్చకామెర్లు వచ్చాయి. ఐదు నెలల వ్యవధిలో అవి వాటంతట అవే తగ్గిపోయాయి. మళ్లీ రెండు వారాల క్రితం నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. దయచేసి మాకు సలహా ఇవ్వండి. - కామేశ్వరరావు, ఏలూరు మీ బాబు వయసులో కామెర్లు రావడానికి ముఖ్యంగా హెపటైటిస్ ఏ, లేదా హెపటైటిస్ ఈ అనే వైరస్లు కారణం కావచ్చు. మీ బాబుకు ఇంతకు ముందు ఒకసారి కామెర్లు వచ్చాయి కాబట్టి మళ్లీ మళ్లీ ఇవే వైరస్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా అరుదు. ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే దాని పట్ల మన శరీరంలో వ్యాధినిరోధకశక్తి వృద్ధిచెందే అవకాశం ఉంది కాబట్టి మీ బాబుకు కామెర్లు రావడానికి ఇతర కారణాలు... అంటే ‘విల్సన్ డిసీజ్’ వంటివి ఏమైనా ఉండవచ్చు. ఇక మీ బాబుకు దురద, రక్తహీనత ఉన్నాయా లేదా అన్న వివరాలు రాయలేదు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు మీ బాబును చూపించి, కొన్ని పరీక్షలు చేయించుకుంటే అతడు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ పి. భవానీ రాజు కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్