ఫార్ములా–  ఈ పనులు రయ్‌..రయ్‌ | Formula E Race Hyderabad City Getting Ready At Necklace Road | Sakshi
Sakshi News home page

ఫార్ములా–  ఈ పనులు రయ్‌..రయ్‌

Published Tue, Sep 20 2022 8:49 AM | Last Updated on Tue, Sep 20 2022 8:49 AM

Formula E Race Hyderabad City Getting Ready At Necklace Road - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ప్రతిష్టాత్మక ఫార్ములా– ఈ చాంపియన్‌ పోటీలకు భాగ్య నగరం సన్నద్ధమవుతోంది. ఎల్రక్టానిక్‌  కార్ల సామర్థ్యాన్ని, సత్తాను చాటే ఈ పోటీల కోసం హెచ్‌ఎండీఏ ట్రాక్‌ నిర్మాణ పనులను చేపట్టింది. నెక్లెస్‌ రోడ్డులో 2.8 కిలోమీటర్ల ట్రాక్‌ పనులను ప్రారంభించారు. డిసెంబర్‌ నాటికల్లా  ట్రాక్‌ను సిద్ధం చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలను  రూపొందించింది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్‌ బ్యాటరీ కార్లు గంటకు 180 నుంచి 220 కి.మీటర్లకు పైగా వేగంతో  పరుగులు తీసేవిధంగా ఈ ట్రాక్‌ను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ఫార్ములా–ఈ పోటీల నిర్వహణపై  అధ్యయనం కోసం గత నెలలో హెచ్‌ఎండీఏ అధికారుల బృందం దక్షిణకొరియా రాజధాని సియోల్‌ను సందర్శించింది. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ఎండీ సంతోష్‌ నేతృత్వంలో హెచ్‌ఎండీఏ సీనియర్‌ ఇంజినీర్లు, ప్లానింగ్‌ అధికారులు ఆగస్టులో సియోల్‌లో పర్యటించారు. ప్రస్తుతం సియోల్‌  ట్రాక్‌ తరహాలోనే హైదరాబాద్‌లో ట్రాక్‌ ఏర్పాటు చేయడంతో పాటు పోటీలను నిర్వహించేందుకు తాజాగా పనులు  ప్రారంభించారు.  

ఇదీ రూట్‌.. 
నెక్లెస్‌రోడ్డులోని 2.8 కి.మీ మార్గంలో ట్రాక్‌ ఏర్పాటు చేస్తారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్‌ గార్డెన్‌లోకి  వెళ్లేవిధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. ఎనీ్టఆర్‌ గార్డెన్‌లోంచి వెనక వైపు ఉన్న మింట్‌ కాంపౌండ్‌ మర్రిచెట్టు నుంచి ఐమాక్స్‌ థియేటర్, ఇందిరాగాంధీ విగ్రహం  మీదుగా ఈ ట్రాక్‌ను  ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 17 మలుపులు వచ్చేవిధంగా ట్రాక్‌ ప్లాన్‌ రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

అంతర్జాతీయంగా పేరొందిన 12  ఆటోమొబైల్‌ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు అంచనా. ఆ సంస్థలు రూపొందించిన ఎల్రక్టానిక్‌ కార్ల సామర్థ్యాన్ని చాటుకొనేందుకు హైదరాబాద్‌ తొలిసారిగా వేదిక కానుంది. గంటకు 250 కి.మీటర్లకు పైగా వేగంతో వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ నగరంలో 180 కి.మీ వరకే పోటీ ఉండే అవకాశం ఉందని ఓ అధికారి వివరించారు.  

డిసెంబర్‌లో డెమో ... 
ఈ పోటీల్లో పాల్గొనే డ్రైవర్లు  అంతర్జాతీయ ప్రమాణాల మేరకు డ్రైవింగ్‌లో శిక్షణ పొంది ఉంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఈ పోటీలకు డిసెంబర్‌ నాటికి ట్రాక్‌ను పూర్తి చేసి డెమో నిర్వహించే అవకాశం ఉంది. పోటీల్లో పాల్గొనే డ్రైవర్లు మొత్తం 40 లూప్స్‌ (రౌండ్స్‌) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ కారు ఎంత సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసిందనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని చాంపియన్‌షిప్‌ ఇస్తారు. నగరవాసులు పోటీలను వీక్షించేందుకు వీలుగా ట్రాక్‌ మార్గంలో ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయనున్నారు. వేలాది మంది సందర్శకులు కూర్చొని చూసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయి.   

(చదవండి: జవహార్‌నగర్‌లో కర్చీఫ్‌ లేకుండా తిరగలేం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement