మాట్లాడుతున్న ఆర్టీసీ ఆర్‌ఎం జి.విజయగీత
ఒంగోలు: ఆర్టీసీ ద్వారా ఔత్సాహికులైన అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్‌లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి శిక్షణను ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జి.విజయగీత పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయంలోని తన ఛాంబర్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ హెవీ డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చే సంస్థలు అతి తక్కువుగా ఉన్నాయని, తద్వారా హెవీ డ్రైవింగ్ డ్రైవర్ల కొరత తీర్చేందుకు ఆర్టీసీ సంకల్పించిందన్నారు. అందులో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఒంగోలులో డిపోలో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఒక్కో బ్యాచ్‌లో 16 మంది అభ్యర్థులు ఉంటారని, వారికి 16 రోజుల థియరీ క్లాసులు, మరో 16 రోజుల పాటు బస్సులపై 15 గంటల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. మొత్తం ఒక బ్యాచ్ పూర్తికావడానికి 40 రోజుల సమయం పడుతుందన్నారు. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం శిక్షణ సిలబస్ ఉంటుందని, ఎంవీ రూల్స్, డ్రైవింగ్ నైపుణ్యత నేర్పిస్తామన్నారు. శిక్షణ పూర్తయిన తరువాత ఫారం–5, ఫారం–14, ఫారం–15 సర్టిపికెట్లు జారీ చేస్తామన్నారు. తద్వారా అభ్యర్థి ఆర్‌టీఏ నిర్వహించే టెస్టులో పాల్గొని డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చన్నారు. ప్రతి అభ్యర్థి శిక్షణకు ఆర్టీసీ డ్రైవింగ్ స్కూలుకు రూ.24 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ పొందగోరు అభ్యర్థులు ఒంగోలు డిపో మేనేజర్ / ఒంగోలు కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7382801048, 9959225691 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment