ఇక ఆర్టీసీ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్
స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలుగా ఆర్టీసీ శిక్షణ కళాశాలలు
ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్న కేంద్రం
ప్రైవేటు అభ్యర్థులకూ శిక్షణ
ఒక్కో సెంటర్‌కు రూ.కోటి కేంద్ర నిధులు
హైదరాబాద్: రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి, సరైన డ్రైవింగ్ నైపుణ్యం లేక చోదకులు ఇష్టానుసారం వాహనాలను పరుగుపెట్టించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. మొత్తం ప్రమాదాల్లో 95 శాతం మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయని ఇటీవల ఓ అధ్య యనం వెల్లడించింది. డ్రైవింగ్ నైపుణ్యం అంతంత మాత్రంగానే ఉన్నా.. భారీ వాహనాలను నడిపేందుకు నియమితులవుతున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రప్రభుత్వం.. భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలో అతి తక్కువ ప్రమాదాలు నమోదు చేస్తున్న రవాణా సంస్థగా తెలంగాణ ఆర్టీసీకి ఉన్న గుర్తింపు నేపథ్యంలో.. సంస్థ పరిధిలోని 3 కేంద్రాలను శిక్షణ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆర్టీసీ డ్రైవర్లకు మాత్రమే శిక్షణ ఇస్తున్న ఈ కేంద్రాల్లో కేంద్రం ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్న నేపథ్యంలో.. ప్రైవేటు అభ్యర్థులకూ శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా డ్రైవర్లకు నైపుణ్యంతోపాటు దేశవ్యాప్తంగా డ్రైవర్ల కొరత తీరుతుందని కేంద్రం భావిస్తోంది.
ఆర్టీసీ ప్రత్యేక సర్టిఫికెట్లు..
రాష్ట్రంలో ఇప్పటివరకు భారీ మోటారు వాహనాల డ్రైవింగ్ శిక్షణకు ప్రభుత్వపరంగా కేంద్రాలు లేవు. కేవలం ఆర్టీసీ డ్రైవర్ల కోసం సంస్థ ఆధ్వర్యంలో 3 కేంద్రాలు కొనసాగుతున్నాయి. హకీంపేటలోని ట్రాన్స్‌పోర్టు అకాడమీ, జోనల్ శిక్షణ కళాశాల, వరంగల్‌లో సిబ్బంది శిక్షణ కళాశాలల్లో డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇక వీటిని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలుగా మార్చనున్నారు. ఇందుకోసం ఒక్కో కేంద్రానికి రూ.కోటి వరకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఆర్టీసీ డ్రైవర్లతోపాటు ప్రైవేటు అభ్యర్థులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో ఉత్తీర్ణులైన వారికి ఆర్టీసీ ప్రత్యేక సర్టిఫికెట్లు మంజూరు చేస్తుంది. భవిష్యత్తులో ఆర్టీసీనే నేరుగా వారికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా మోటారు వాహన చట్టానికి కేంద్రం మార్పులు చేయనున్నట్టు సమాచారం.