![Woman Training For RTC Bus Driving In YSR Kadapa - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/24/rtc%20depot_0.jpg.webp?itok=SBP_g09u)
డ్రైవింగ్ చేస్తున్న మాలశ్రీ
సాక్షి, కడప: మేము సైతం.. అంటూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడేందుకు ముందుకు వస్తున్నారు. ఆకాశమే హద్దుగా దూసుకు పోతున్నారు. ద్విచక్రవాహనాలు.. ఆటోలు.. కార్లు మాత్రమే కాదు.. భారీ వాహనాలు నడిపేందుకు కూడా సిద్ధపడుతున్నారు. వివరాల్లోకెళితే.. ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ) ఉన్నతాధికారులు శనివారం నుంచి భారీ వాహనాలు నడపడంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. కడప ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయ ఆవరణలోని డ్రైవింగ్ స్కూల్‌లో జరుగుతున్న శిక్షణకు కడప నగరానికి చెందిన వై.మాలశ్రీ అనే యువతి హాజరయ్యారు. ఈమె ఇదివరకే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు పొంది ఉన్నారు.
ఇప్పుడు భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందేందుకు వచ్చారు. శిక్షణలో భాగంగా శనివారం కడప రోడ్లపై బస్సు నడిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నె, ముంబయి లాంటి నగరాలలో మహిళలు బస్సు డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా కడప నగరంలో మాలశ్రీ దరఖాస్తు చేసుకుని శిక్షణకు రావడం విశేషం. శిక్షణ పూర్తి చేసుని హెవీ లైసెన్స్ పొందిన తర్వాత ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం చేసే అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని ఆమె పేర్కొంటున్నారు. తనకు కుటుంబంలో భర్త ప్రోత్సాహం కూడా ఉందన్నారు. బస్సు నడిపేందుకు ధైర్యంగా ముందుకు వచ్చిన యువతిని ఆర్టీసీ ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment