Kadapa RTC Depot
-
ఆమె చేతిలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్
సాక్షి, కడప: మేము సైతం.. అంటూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడేందుకు ముందుకు వస్తున్నారు. ఆకాశమే హద్దుగా దూసుకు పోతున్నారు. ద్విచక్రవాహనాలు.. ఆటోలు.. కార్లు మాత్రమే కాదు.. భారీ వాహనాలు నడిపేందుకు కూడా సిద్ధపడుతున్నారు. వివరాల్లోకెళితే.. ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ) ఉన్నతాధికారులు శనివారం నుంచి భారీ వాహనాలు నడపడంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. కడప ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయ ఆవరణలోని డ్రైవింగ్ స్కూల్లో జరుగుతున్న శిక్షణకు కడప నగరానికి చెందిన వై.మాలశ్రీ అనే యువతి హాజరయ్యారు. ఈమె ఇదివరకే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు పొంది ఉన్నారు. ఇప్పుడు భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందేందుకు వచ్చారు. శిక్షణలో భాగంగా శనివారం కడప రోడ్లపై బస్సు నడిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నె, ముంబయి లాంటి నగరాలలో మహిళలు బస్సు డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా కడప నగరంలో మాలశ్రీ దరఖాస్తు చేసుకుని శిక్షణకు రావడం విశేషం. శిక్షణ పూర్తి చేసుని హెవీ లైసెన్స్ పొందిన తర్వాత ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం చేసే అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని ఆమె పేర్కొంటున్నారు. తనకు కుటుంబంలో భర్త ప్రోత్సాహం కూడా ఉందన్నారు. బస్సు నడిపేందుకు ధైర్యంగా ముందుకు వచ్చిన యువతిని ఆర్టీసీ ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. -
ఆర్టీసీ కడప డిపోలోనే బంగారు ఆభరణాలు
ఐదు నెలలుగా గోప్యంగా ఉంచిన వైనం కడప అర్బన్ : ఏపీఎస్ఆర్టీసీ కడప డిపోలో ఐదు నెలలుగా ఓ ప్రయాణికునికి చెందిన దాదాపు 72 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.....కడప నుంచి అనంతపురం వెళ్లి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సులో గుర్తు తెలియని వ్యక్తి సూట్‌కేస్‌ను మరిచిపోయాడు. ఆ సూట్‌కేసును బస్సు డ్రైవర్, కండక్టర్ డిపో అధికారులకు అప్పగించారు. ఈ సూట్‌కేసులో ఉన్న దుస్తులను, సూట్‌కేసును నెలరోజులు గడిచిన తర్వాత నిబంధనల మేరకు వేలం వేశారు. విలువైన బంగారు ఆభరణాలను మాత్రం సీజ్ చేసి తమ వద్దనే భద్రపరిచారు. సంఘటన జరిగిన రోజుగానీ, మరుసటిరోజుగానీ సూట్‌కేస్, ఆభరణాల గురించి పోలీసులకుగానీ, పత్రికలకుగానీ తెలుపకుండా గోప్యంగా ఉంచడం పలు ఆరోపణలకు తావిస్తోంది. ఈ విషయంపై విలేకరులు డిపో మేనేజర్ గిరిధర్‌రెడ్డిని వివరణ కోరగా బస్సుల్లో ఎవరైనా ప్రయాణికులు వస్తువులను పోగొట్టుకుంటే నెల రోజులపాటు అందుబాటులో ఉంచుతామన్నారు. తర్వాత వాటిని వేలం వేస్తామన్నారు. బంగారు వస్తువులకు సంబంధించి కమిటీ ద్వారా తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. -
చేయని నేరానికి...
ఆయన పేరు వీఎస్‌రెడ్డి. కోడ్ నెం. ఈ.412461. కడప ఆర్టీసీడిపోలో కండక్టర్‌గా ఏడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 10.5.2014న బద్వేల్ సర్వీసుకు వెళ్లారు. నాల్గొవ ట్రిప్‌లో ఆర్టీసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సిద్దవటం నుంచి వచ్చిన ఇరువురు ప్రయాణికులకు ఒకే వ్యక్తి రెండు టికెట్లు తీసుకున్నాడు. టికెట్లు ఉన్న ప్రయాణికుడు మధ్యలో దిగిపోయాడు. ఇంకో ప్రయాణికుడు పాతబస్టాండు వరకూ బస్సులో వచ్చారు. తనిఖీల సందర్భంగా... మేము కలిసే వచ్చాం.. టికెట్‌కు డబ్బులు తీసుకున్నారు.. మాకు కండక్టర్ ఇచ్చిన టికెట్ ఇదేనంటూ మరో ప్రయాణికుడు బుకాయించాడు. అంతే వాస్తవాలతో నిమిత్తం లేకుండా కేసు నమోదు.. ఆపై చార్జీ మెమో.. అనంతరం సస్పెండ్ చేశారు. సాక్షి ప్రతినిధి, కడప: ‘అరిటాకు వెళ్లి ముళ్లుపై పడ్డా.. ముళ్లు వచ్చి ఆకుపై పడ్డా చినిగేది అరిటాకే’ అన్న సామెత తుచ తప్పకుండా ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తోంది. ప్రయాణికులు చేసిన, చేస్తున్న పొరపాట్లు కండక్టర్లకు వేదనను మిగిలుస్తున్నాయి. తనిఖీ అధికారులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. విచారణలో అలసత్వం కారణంగా కార్మిక కుటుంబాలు నడిరోడ్డుపై పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. విధినిర్వహణలో నిక్కచ్చిగా పనిచేస్తున్నా వే ధింపులు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. అంతా నీతిపరులేనా అన్న ప్రశ్న ఉదయించవచ్చు. చేయని తప్పుకు నేరాన్ని అపాదించడం ఎంతమాత్రం సరైంది కాదని పలువురు ఆక్షేపిస్తున్నారు. వీఎస్‌రెడ్డి లేదా ఎండీ భూషణంలకు అప్పగించిన టికెట్లు.. ప్రయాణికులకు పోను మిగిలిన టికెట్లు,, చార్ట్‌లో నమోదైన టికె ట్ల వివరాలను పరిశీలిస్తే వాస్తవంగా తప్పు చేశారా.. సంస్థను మోసం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారా అన్న విషయం తేటతెల్లమవుతుంది. ఇవేమీ పట్టించుకోకుండా కేసులు నమోదు చేయడం.. ఆపై సస్పెండ్ చేయడం ఆర్టీసీలో రివాజుగా మారిందని పలువురు కార్మికులు వాపోతున్నారు. విచారణలో అలసత్వం.... కండక్టర్లు తప్పులు చేశారని ఆరోపణలు రాగానే స్పందించే యంత్రాంగం ఆపై విచారణలో వాస్తవమా? కాదా? అన్న విషయం నిర్ధారణ చేసి తగిన విధంగా స్పందించకుండా మిన్నకుండిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో కేసులు పెండిం గ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కడప డిపో పరిధిలోనే ఎనిమిది మంది కార్మికులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేవలం ప్రయాణికులు తనిఖీ అధికారులను మభ్యపెట్టడం కారణంగా కేసులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కుటుంబాలను వీధులపాలు చేసుకోలేని కార్మికులు దళారులను ఆశ్రయించి సస్పెన్షన్‌ను తొల గించుకుంటున్నట్లు తెలుస్తోంది. నాకు ఎలాంటి సంబంధంలేదు.. అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయండి మహాప్రభో అని మొరపెట్టుకుంటున్న వారిని కనికరించడం లేదు. ఈవిషయమై ఆర్టీసీ కడప డిపోమేనేజర్ శ్రీనివాసలురెడ్డిని వివరణ కోరేందకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఫోన్ సైతం లిప్ట్ చేయలేదు.